అస్థి పంజరాలను దించుతున్న అగ్నిమాపక సిబ్బంది
భువనేశ్వర్: జాజ్‌పూర్ జిల్లాలో ఒక గ్రామ సమీపంలోని తాగునీటి ప్రాజెక్టులో భాగంగా కొత్తగా నిర్మించిన నీళ్ల ట్యాంక్‌లో సోమవారం రెండు అనుమానాస్పద మానవ అస్థిపంజరాలు గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
జాజ్‌పూర్ సదర్ మండలం నిశ్చింత గ్రామ శివారులో తాగునీటి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ట్యాంక్‌లో అస్థిపంజరాలు కనిపించినట్లు సమాచారం. అస్థిపంజరాలు మనుషులవిగా భావిస్తున్నారు. అయితే ఈ విషయం ఇంకా ధ్రువీకరించబడలేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అస్థి పంజరాలను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం జాజ్‌పూర్ పట్టణంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి (డీహెచ్‌హెచ్)కి తరలించారు. నివేదిక అందిన తర్వాతే అస్థి పంజరాలు మనుషులవా లేక కోతులవా అనేది తేలనుందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు గ్రామ శివారులో ఉన్న నీళ్ల ట్యాంక్ నిర్మాణం పూర్తయినా ఇంకా ప్రారంభించలేదు.
సరదాగా సోమవారం ట్యాంక్‌పైకి ఎక్కిన ఇద్దరు చిన్నారులు ఈ అస్థి పంజరాలను గుర్తించారు. సమాచారం తెలియడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందడంతో జాజ్‌పూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వినిత్ అగర్వాల్, సబ్ డివిజనల్ పోలీసు అధికారితో పాటు పోలీసు బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించింది. అగ్నిమాపక సిబ్బంది అస్థి పంజరాలను వెలికితీసి జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించి మరిన్ని వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment