నల్ల ధాన్యం సాగు సక్సెస్‌ | Black Grain Cultivation Success | Sakshi
Sakshi News home page

నల్ల ధాన్యం సాగు సక్సెస్‌

Published Mon, Dec 16 2019 3:43 AM | Last Updated on Mon, Dec 16 2019 3:43 AM

Black Grain Cultivation Success - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: బాపట్ల వ్యవసాయ పరిశోధన కేంద్రం బీపీటీ 2841 రకం బ్లాక్‌ రైస్‌ వరి వంగడాన్ని ఆవిష్కరించింది. ఖరీఫ్‌ సీజన్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని బాపట్ల పట్టణానికి చెందిన రైతు లేళ్ల వెంకటప్పయ్య  సేంద్రియ పద్ధతిలో సాగు చేశారు. 2 కిలోల విత్తనాన్ని 20 సెంట్ల మాగాణిలో సాగు చేయగా 7 బస్తాల దిగుబడి వచ్చింది. దీని ధర 75 కిలోల బస్తా రూ.7,500కు పైగా ఉండటం గమనార్హం. ఇప్పటివరకూ బాపట్లలో 8 రకాల నాణ్యమైన వరి వంగడాలు రూపొందించగా... బీపీటీ 5204 (సాంబ మసూరి), బీపీటీ 2270 (భావపురి సన్నాలు) దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. బీపీటీ 5204 రకం దేశంలో సాగయ్యే విస్తీర్ణంలో 25 శాతం సాగు చేయడం గమనార్హం. తాజాగా బాపట్ల కీర్తి కిరీటంలో సరికొత్త వంగడం బ్లాక్‌రైస్‌  బీపీటీ 2841 చేరనుంది.

క్వాలిటీ రైస్‌ కింద అభివృద్ధి చేస్తున్నాం...
బీపీటీ 2841 బ్లాక్‌ రైస్‌ను రూపొందించి ఈ ఏడాది ప్రయోగాత్మకంగా రైతులతో సాగు చేయించాం. తెగుళ్లను తట్టుకొని మంచి దిగుబడి వచ్చింది. మూడేళ్లు ప్రయోగాలు చేసి, ఫలితాలు చూసిన తరువాతే అధికారికంగా విడుదల చేస్తాం. దీన్ని వినియోగించటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మార్కెట్‌లో గిరాకీ ఉంది. అమెజాన్‌లో కిలో బియ్యం రూ. 375కి అమ్ముతున్నారు. ఈ కొత్త వంగడం బాపట్ల సిగలో తలమానికం కానుంది.     
– టీవీ రామారావు, ప్రధాన శాస్త్రవేత్త, బాపట్ల

మంచి దిగుబడి వచ్చింది
బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం వారు ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు ఇచ్చారు. 2 కిలోల విత్తనాన్ని 20 సెంట్లలో సాగు చేశాను. 7 బస్తాల దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో బ్లాక్‌ రైస్‌కు డిమాండ్‌ ఉండటంతో మంచి ఆదాయం వస్తుంది.
– లేళ్ల  వెంకటప్పయ్య,  రైతు, బాపట్ల

ఖర్చు తక్కువ–ఆదాయం ఎక్కువ
బ్లాక్‌ రైస్‌ను 20 సెంట్లలో సాగు చేసేందుకు ఖర్చు తక్కువే అయిందని రైతు లేళ్ల వెంకటప్పయ్య చెబుతున్నారు. ఒక బండి ఎరువు రూ.1,200, నాలుగు సార్లు దుక్కుల కోసం రూ.500, వరి నాట్లు వేసేందుకు ఇద్దరు కూలీలకు రూ.600, కోత కోసేందుకు ఇద్దరు కూలీలకు రూ.600, పంట నూర్పిడి చేసేందుకు రూ.1,000 మొత్తం రూ.3,900 మాత్రమే ఖర్చు అయినట్లు తెలిపారు. 20 సెంట్లలో సుమారు 7 బస్తాల దిగుబడి వచ్చిందని దీని ప్రకారం ఎకరానికి 35 బస్తాలకు పైగా దిగుబడి వచ్చినట్లని వివరించారు.75 కిలోల ధాన్యం ధర రూ.7,500 పలుకుతోందని చెప్పారు. ఈ లెక్కన  20 సెంట్ల సాగుతో  రూ.49,000 వస్తుందని, ఖర్చులు పోను రూ.45,100 ఆదాయం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. పంట కేవలం 125 రోజుల్లో వచ్చిందని, ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించలేదని, బ్యాక్టీరియా, మెడ తెగులు, పాముపొడ రాకుండా వేప చమురు, పుల్ల మజ్జిగను వినియోగించినట్లు ఆయన వివరించారు.

బ్లాక్‌ రైస్‌ ప్రత్యేకతలు
ఈ వంగడం దోమ, అగ్గి తెగులును తట్టుకుంటుంది. భారీ వర్షాలను తట్టుకుంటుంది. పంట నేలవాలదు. దీనిలో యాంటీఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండటం వలన, వాడిన వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement