మేడ్చల్ రూరల్: ఆయనో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నెలవారీ వేతనం వేలల్లోనే ఉంటుంది. అయినా జీవితంలో ఇంకా ఏదో సాధించాలనే తపన. చిన్నప్పటినుంచీ వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. ప్రజలకు సేంద్రియ ఎరువుల తో పండిన ఆకుకూరలు, కూరగాయలు అందించాలనే లక్ష్యం ఉండేది. ఇంకేముంది.. ఒకవైపు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యవసాయంపై దృష్టి సారించాడు.
సేంద్రియ పద్ధతిలో కూరగాయల పంటలు పండిస్తున్నాడు. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు జాన్ ఇజ్రాయిల్ రావూరి. మేడ్చల్‌కు చెందిన జాన్ ఏడాదిన్నర క్రితం మండలంలోని గిర్మాపూర్, మండమాదారం గ్రామాల్లో ఏడెకరాల భూమిని లీజ్‌కు తీసుకుని లాభసాటిగా సేంద్రియ వ్యవసాయ సాగు చేస్తున్నాడు. ఆవు పేడ, మూత్రం, ఆకు కషాయంతో తక్కువ పెట్టుబడి పెట్టి వ్యవసాయం మెలకువలు నేర్చుకుని, నలుగురికి మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. అంతే కాకుండా పండిన పంటలను తానే మార్కెట్‌లో నేరుగా వినియోగదారులకు విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నాడు.
వ్యవసాయం వైపు దృష్టి సారించడానికి కారణాలేమిటి తదితర అంశాలు జాన్ ఇజ్రాయిల్ మాట ల్లోనే...
సేంద్రియ వ్యవసాయమే ఉత్తమం..
వ్యవసాయంలో సేంద్రియ పంటలు రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటాయని తెలుసుకున్నా. మనమెందుకు ఇలాంటి వ్యవసాయం చేయకూడదనుకుని ఈ పద్ధతిలో సాగు చేపట్టాను. దీనికి తోడు ఒకే రకం పంటలు కాకుండా తక్కువ భూమిలో ఎక్కువ రకాల పంటలు వేస్తున్నాను. మన పూర్వీకులు సారవంతమైన భూమిలో పంటలు ఎలా పండించారో ఆ విధంగా మనం కూడా పంటలు పండించాలని జీవామృత ఎరువుతో పంటల సాగు చేపడుతున్నాను. ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగ పిండితో జీవామృతాన్ని తయారుచేసి ఎరువుగా ఉపయోగిస్తున్నాను. చెట్ల ఆకులను, జనుము, జీలుగను ఎరువుగా వాడుతున్నాను.
నేరుగా వినియోగదారులకే విక్రయం..
పండించిన కూరగాయలను నేరుగా వినియోగదారుల ఇళ్లకు వె ళ్లి అందిస్తున్నాను. కొందరు రైతులు మార్కెట్ చేయడం తెలియక నష్టపోతున్నారు. నూతన పద్ధతితో కూరగాయల విక్రయాలు చేపట్టాలని ఒక కవరులో ఎనిమిది రకాల కూరగాయలు ఒక్కోటి అరకిలో చొప్పున, అయిదు రకాల ఆకు కూరలు 5 కట్టల చొప్పున ప్యాక్‌చేసి రూ.350కు వినియోగదారులకు చేరవేస్తున్నాను. ఈ పద్ధతి కోసం ఇతర రైతులకు ప్రోత్సాహం అందించి వారితో కొన్ని రకాల పంటలు వేయిస్తున్నాను. ఇలా ప్రతి రోజు వినియోగదారులకు ప్యాక్ చేసి ఇస్తున్నాను. వారంలో వంద మందికి అందించాలనే లక్ష్యం నెరవేర్చుకున్నాను. దీంతో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను. వ్యవసాయం చేసి పదిమందికి మంచి భోజనం అందించడంలో ఉన్న తృప్తి దేనిలోనూ ఉండదు.
‘సాఫ్ట్‌వేర్’ రైతు
Published Thu, Sep 18 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
Advertisement