ఆదిలాబాద్ అగ్రికల్చర్ : వంకాయ.. కూరగాయల సాగులో ప్రధానమైనది. వంకాయ సాగులో చీడపీడలు నివారిస్తే ఏడాది పొడవుతునా దిగుబడి పొందవచ్చు. వంకాయలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కొద్దిపాటి జాగ్రత్తలు వహిస్తే నాణ్యమైన పంట చేతికొస్తుంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించి తెగుళ్లు నివారిస్తే మంచి ఆదాయం ఆర్జించవచ్చని ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సూచనలు, పురుగులు, తెగుళ్ల నివారణ చర్యలు వివరించారు.
మేలైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
మేలు రకాలైన వంకాయ విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. సరైన పద్ధతిలో సాగు చేస్తే నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు. దేశవాలీ రకాల్లో భాగ్యమతి, అర్కషీల్, అర్కకుసుమాకర్, హైబ్రీడ్ రకాలైన మహికో, రవయ్యా, సుఫల్ ఉన్నాయి. విత్తన రకాలను బట్టి దిగుబడులు వస్తాయి.
భాగ్యమతి రకం : గుత్తికి మూడు నుంచి నాలుగు రకాలు ఉంటాయి. ఉదా రంగులో అండాకారంగా కాయలు ఉంటాయి. పంట కాల పరిమితి 140 నుంచి 160 రోజులు. ఇది నీటి ఎద్దడి బాగా తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. హెక్టార్‌కు 30 నుంచి 35టన్నుల దిగుబడి వస్తుంది.
అర్కషిల్ రకం : కాయలు మధ్యస్థంగా పొడవుగా ఆకర్షణీయమైన ముదురు ఉదా రంగులో ఉండి గింజలు తక్కువగా ఉంటాయి. కాలపరిమితి 110 రోజుల నుంచి 120 రోజులు. హెక్టారుకు 394 క్వింటాళ్లా వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
అర్కకుసుమాకర్ రకం : కాయలు చిన్నవిగా వేలు ఆకారంలో, ఆకు పచ్చరంగులో ఉంటాయి. కాయలు ఐదు నుంచి ఏడు వరకు గుత్తులుగా కాస్తాయి. మొక్కకు 70 నుంచి 75 వరకు కాయలు దిగుబడిలు వస్తాయి. కాలపరిమితి 110 నుంచి 120 రోజులు. హెక్టార్‌కు 40 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
ఎరువులు వాడే విధానం
ఆఖరి దుక్కులో హెక్టార్‌కు 60 కిలోల పొటాష్ మరియు భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు వేయాలి. హెక్టార్‌కు వంద కిలోల నత్రజని మూడు భాగాలుగా చేసి నాటిన సమయంలో, 30వ రోజు, 75 రోజున వేయాలి. ఎరువులు వేసిన సమయంలో కలుపు తీసి, గొప్పు తవ్వి మట్టిని సవరిస్తే పంట దిగుబడి పెరుగుతుంది. భూమిలో తేమను బట్టి, వేసవిలో 4 నుంచి 5 రోజులకు శీతాకాలంలో 7 నుంచి 10 రోజులకోసారి, వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాలి.
పురుగుల నివారణ చర్యలు..
పిండి పురుగులు : వీటి వల్ల మొక్కలు గిడసబారుతాయి. దీని నివారణకు మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగు అశించిన రెమ్మలు, కాయలను ముందుగా తీసి నాశనం చేయాలి.
రసం పీల్చు పురుగులు : ఇవి ఆకుల అడుగు భాగాన ఉండి రసాన్ని పీలుస్తాయి. ఆకులు వడలి పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. దీని నివారణకు డైమిథోయేట్ 30 శాతం ఇ.సి మందు రెండు మిల్లీలీటర్ల చొప్పున ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
అక్షింతల పురుగు : ఇవి పెద్దపురుగులు, పిల్లపురుగు ఆకుల్లో పత్రహరితాన్ని తినేసి ఈనెలను మిగులుస్తాయి. ఆకు జల్లెడ మాదికిగా కనిపిస్తుంది. ఆకులు ఎండిపోయి మొక్కలు శక్తిహీనంగా ఉంటాయి. దీని నివారణకు 0.16 శాతం మలాథియాన్ 3 మిల్లీలీటర్లు గానీ.. 0.03 శాతం మిథైల్ పెరాథియాన్ ఒక మిల్లీలీటర్లు గానీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మొవ్వ మరియు కాయ తొలుచు పురుగు : చిరుమొవ్వ దశలో ఉన్నప్పుడు ఇవి ఆశించడం వల్ల మొక్కలు వంగిపోతాయి. కాపు దశలో కాయలను తొలిచి అంచెలంచెలుగా కాయ లోపలికి చేరుతాయి. దీని నివారణకు పురుగు ఆశించిన , వంగిన రెమ్మలను తీసివేసి 50 శాతం డబ్ల్యూపీ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. లేదా మోనోక్రోటోఫాస్ 1.25 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందు పిచికారీ చేసిన పది రోజుల తర్వాత కాయలు కోయాలి.
తెగుళ్ల నివారణ..
ఆకుమూడు తెగులు : ఈ తెగులు సోకిన ఆకులపై అక్కడక్కడా గోధుమ రంగుతో కూడిన మచ్చలు కనిపిస్తాయి. ఉధృతంగా తెగులు సోకితే ఆకులు రాలిపోతాయి. ఈ తెగులు సోకిన కాయలు పసుపు(ముదురక) రంగులోకి పూర్తిగా మారకముందే ఎండిపోతాయి. దీని నివారణకు బ్లెటాక్స్ 3 గ్రాములు లీటరు నీటిలో లేదా 2.5 గ్రాములు జినేట్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
వెర్రి తెగులు : తెగులు ఆశించిన ఆకులు పాలిపోయిన ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి. వీటి నివారణకు తెగులు సోకిన మొక్కలను పెరికి నాశనం చేయాలి. తెగులు వ్యాపింపజేసే చీడలను క్రిమిసంహారక మందులను ఉపయోగించి నివారించాలి.
వంకాయ.. ఏడాదంతా దిగుబడే
Published Wed, Sep 17 2014 2:21 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement