కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోదా? | lease farmer Kopuri Punnaravu suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోదా?

Published Tue, Aug 14 2018 4:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

lease farmer Kopuri Punnaravu suicide - Sakshi

కొపూరి పున్నారావు

30 ఏళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్న రైతు ప్రైవేటు అప్పులు తెచ్చి పత్తి, మిర్చి సాగు చేసి అప్పుల్లో కూరుకొని ఆత్మహత్య పాలైన ఏడాదిన్నరకు కూడా ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఎటువంటి సహాయమూ అందించలేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కౌలు రైతు కొపూరి పున్నారావు (50) 2017 మే 13న ఇంట్లోనే పురుగులమందు తాగారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన సత్తెనపల్లిలోని ఆస్పత్రికి తరలించగా.. 17న చనిపోయారు.  సెంటు భూమి లేకపోయినప్పటికీ పున్నారావు కుటుంబం 30 ఏళ్లుగా భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు.

2017లో ఎకరానికి రూ. 25 వేల కౌలు చొప్పున ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. రెండెకరాల్లో పత్తి, నాలుగెకరాల్లో  మిరప పంటను సాగు చేశారు. పత్తికి తెగుళ్లు ఎక్కువగా సోకడంతో కనీసం పంట పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. మిర్చి ధర క్వింటాలు రూ. 2,500కు పడిపోవటంతో రూ. 5 లక్షల అప్పు తీర్చేదారి లేక దిగులుతో ఆత్మహత్య చేసుకున్నారు.  పున్నారావుకు భార్య పద్మావతి, కుమార్తెలు శిరీష, రాధ ఉన్నారు. ‘మాకు సెంటు కూడా భూమి లేకపోవడంతో బ్యాంకులు రుణం ఇవ్వలేదు. 17 సవర్ల బంగారం వేరే వారి పేరు మీద బ్యాంకులో కుదువ పెట్టాం. దానికి కూడా రుణమాఫీ వర్తించలేదు. ఇప్పుడు రెక్కల కష్టంపైనే ఆధార పడి జీవిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు..’ అని పద్మావతి ఆవేదన చెందుతున్నారు.
– ఓ.వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement