‘మాది వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం బాలాయిపల్లె. గిద్దలూరులో టెక్స్‌మో పోలిరెడ్డి అనే వ్యక్తి 100 ఎకరాల్లో పంట వేయడం చూసి మా ఊర్లో 15 ఎకరాల్లో పామ్‌రోజ్, నిమ్మగడ్డిని సాగుచేశా. ఆయిల్ తీసే పద్ధతిలో లోపాలు ఉండటంతో నష్టాలు వచ్చాయి. కందుకూరులో నా స్నేహితుని వద్దకు వెళ్లి ఇవే పంటలపై రూ.3 లక్షల పెట్టుబడి పెట్టా. అక్కడ కూడా నష్టపోయా. మేం పెట్టిన రెండు డిస్టిలేషన్ యూనిట్లలో(మొక్కల నుంచి ఆయిల్ తీసే యంత్రం) ఉన్న లోపాలను అప్పుడు గమనించా.
తొలిసారి 6:6 సైజ్ పెద్ద డ్రమ్‌లను, ఆవిరిని చల్లబరిచే గొట్టం 2 అంగుళాలు ఉండే పరికరాన్ని ఉపమోగించా. టన్ను గడ్డికి 4 లీటర్ల ఆయిల్ రావాల్సి ఉండగా 2.5 లీటర్లు మాత్రమే వచ్చేది. కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో యంత్రాలను గమనించా. 6ఁ5 సైజ్‌లో రెండు పెద్ద డ్రమ్‌లను, ఆవిరిని చల్లబరచే గొట్టంను 10 అంగుళాలకు పెంచి సొంతగా తయారు చేయించా. ఒక్కో డ్రమ్‌లో 750 కేజీల గడ్డి పడుతుంది.
దీని నుంచి నాలుగు కేజీల ఆయిల్ వస్తోంది. కంపెనీలు తయారు చేసే డిస్టిలేషన్ యూనిట్ కొనాలంటే రూ.3 లక్షలు ఖర్చువుతుంది. వాటి ద్వారా ఆశించిన ఆయిల్ రావడం లేదు. అందుకని రూ.2.50 లక్షలు ఖర్చుపెట్టి ఆయిల్ తీసే యంత్రాన్ని సొంతగా తయారు చేయించుకున్నా. ఇప్పుడు న ష్టం రావడం లేదు. లక్షల్లో ఉన్న అప్పు మొత్తం తీరిపోయింది. ప్రస్తుతం ఎడాదికి రూ.15 లక్షల ఆదాయం పొందుతున్నా.
2011లో బేస్తవారిపేట మండలం మల్లాపురం సమీపంలో 60 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పామ్‌రోజ్, నిమ్మగడ్డి సాగుచేస్తున్నా. హైదరాబాద్‌లోని బోడుప్పల్ మెడికల్ అండ్ ఆరోమాటిక్ కార్యాలయంలో విత్తనాలు తెచ్చుకుంటున్నా. ప్రారంభంలో పంట చేతికి వచ్చే వరకు ఎకరాకు రూ.15-20 వేలు ఖర్చవుతుంది. నాటిన నాలుగో నెల నుంచి పంట చేతికొస్తుంది. పామ్‌రోజ్ విత్తనాలు ఒకసారి నాటితే 8-10 ఏళ్ల పాటు పంట పండుతుంది. ఏడాదికి ఐదు కోతలు కోయవచ్చు.
విత్తనాలు నాటిన తర్వాత ఖర్చు ఉండదు. ఏడాదికి ఒకసారి అంతర సేద్యం(దుక్కి దున్నడం), 25 కేజీల యూరియా, 25 కేజీల డీఏపీ చల్లితే సరిపోతుంది. రెండు నెలల్లో ఎకరాకు మూడు టన్నుల గడ్డి పెరుగుతోంది. టన్నుకు నాలుగు కేజీల ఆయిల్ దిగుబడి ఉంటుంది. రోజూ రూ.1,500 ఖర్చుతో(కూలీలకు) 8 లీటర్ల ఆయిల్ తీస్తున్నా. నెలలో 20 రోజుల పాటు 150 ఆయిల్ దిగుబడి వస్తోంది. డిస్టిలేషన్ యంత్రంతో గడ్డిని ఉడికించడానికి ముందు రోజు ఆయిల్ తీసిన గడ్డినే వంట చెరకుగా ఉపయోగిస్తున్నా. దీనివల్ల వంట చెరకు ఖర్చు మిగులుతోంది.
నిమ్మగడ్డి రెండు నెలలకు ఎకరాకు 2 టన్నుల గడ్డి వస్తుంది. టన్నుకు 10 కేజీల ఆయిల్ తీస్తున్నా. మార్కెట్‌లో కేజీ రూ.800 ధర ఉంది. ఈ పంట నీటి ఎద్దడిని తట్టుకోలేదు. 8-10 ఏళ్లు ఉండే పామ్‌రోజ్‌లా ఎక్కువ కాలం పంట ఉండకపోవడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. నేను కూడా ఐదెకరాల్లో సాగు చేస్తున్నా.
సేంద్రియ పద్ధతిలో అధిక దిగుబడి
మొదట్లో సేంద్రియ పద్ధతిలోనే గడ్డి పెంచా. మంచి దిగుబడి వచ్చింది. 200 లీటర్ల నీటికి ఐదు కేజీల ఆవు పేడ, మూత్రం, 2 కిలోల శనగ పిండి, 2 కిలోల బెల్లం, మర్రి చెట్ల కింద మట్టి గుప్పెడు వేస్తే బ్యాక్టీరియా వెయ్యి రెట్లు ఉత్పన్నమవుతుంది. ఆరు రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని పొలమంతా చల్లితే గడ్డి దిగుబడి చాలా పెరిగింది. అయితే అదే సమయంలో డిస్టిలేషన్ యంత్రాల్లో లోపాలను అధిగమించే క్రమంలో సేంద్రియ పద్ధతిలో సాగు గాడితప్పింది. ఇప్పుడు సమస్యలేమీ లేవు. త్వరలోనే పూర్తి స్థాయిలో సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తా.
ఆయిల్‌ను దళారులకే విక్ర యిస్తున్నా..
పదేళ్ల క్రితం పామ్‌రోజ్ ఆయిల్ కేజీ రూ.400 ఉండేది. ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.1,800 మధ్య ధర ఉంటోంది. తిరుపతిలో ప్రైవేట్ దళారులకు ఆయిల్‌ను అమ్ముతున్నా. నేరుగా కంపెనీలకు అమ్మితే మంచి ధర వస్తుంది. కంపెనీల వాళ్లు నగదు చెల్లింపులో జాప్యం చేస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది’.
రైతు చెన్నారెడ్డిని 9440855448లో సంప్రదించవచ్చు.
పామ్‌రోజ్, నిమ్మ గడ్డి సాగు
Published Wed, Sep 10 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement