Lemon grass cultivation
-
ఇది లాభాల పంట! ఈ గడ్డి సాగుతో రూ. లక్షల రాబడి..
ప్రస్తుతం పంటల సాగు లాభదాయకమైన వ్యాపార మార్గంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నవారు అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో వినూత్న పంటలు సాగు చేస్తూ లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. మీకూ ఇలాంటి వ్యాపార ఆలోచన (Business Idea) ఉంటే లెమన్ గ్రాస్ ఫార్మింగ్ (Lemon grass farming) చేయొచ్చు. లెమన్ గ్రాస్ (నిమ్మ గడ్డి) సాగును ఇప్పటికే చాలా చోట్ల చేపడుతూ మంచి లాభాలు గడిస్తున్నారు. కొన్ని చోట్ల దీన్ని మహిళా గ్రూప్‌లు, పొదుపు సంఘాల సభ్యులు ఉమ్మడిగా సాగుచేస్తున్నారు. ఈ ఆలోచనను ప్రధాని మోదీ కూడా గుర్తించడం మరింత ఆసక్తికర అంశం. 2020లో ప్రధాని మోదీ నెలవారీ 'మన్ కీ బాత్' రేడియో ప్రసంగం సందర్భంగా నిమ్మగడ్డి సాగును ప్రశంసించారు. నిమ్మగడ్డి కేవలం నాలుగు నెలల్లోనే పెరుగుతుంది. దీని నూనెకు మార్కెట్లో అత్యంత గిరాకీ ఉంటుంది. అందుకే మంచి ధర లభిస్తోంది. సౌందర్య సాధనాలు, సబ్బులు, నూనెలు, మందులతో సహా వివిధ పరిశ్రమలలో లెమన్ గ్రాస్ నూనెకు విపరీతమైన డిమాండ్ ఉంది. లెమన్‌గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్స్ వర్గానికి చెందినది. పలు రకాల చికిత్సల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్‌కు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఇది శుష్క ప్రాంతాలలోనూ పెరుగుతుంది. ఇది కరువు ప్రాంతాల్లో కూడా సాగు చేయడానికి అనువుగా ఉంటుంది. సహజంగానే స్థితిస్థాపకంగా ఉండే ఈ పంటకు ఎరువులు కూడా అవసరం లేదు. రూ. 20,000 కంటే తక్కువ పెట్టుబడితోనే హెక్టారుకు ఏటా రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. పంట ప్రారంభించిన తర్వాత, వరుసగా ఐదారు సంవత్సరాల పాటు స్థిరమైన దిగుబడి లభిస్తుంది. అయితే లెమన్‌గ్రాస్ సాగుకు సమయం చాలా కీలకం. ఫిబ్రవరి నుంచి జులై నెలల మధ్య కాలం ఈ పంట సాగుకు అనువుగా ఉంటుంది. మొక్కల నర్సరీ బెడ్స్ సిద్ధం చేయడానికి సరైన సమయం మార్చి నుంచి ఏప్రిల్ నెలల మధ్య కాలం. ఈ పంటను ఒకసారి నాటితే సంవత్సరానికి ఆరు నుంచి ఏడు పంటలు ఆశించవచ్చు. అంటే దాని విలువైన నూనెను అధిక మొత్తంలో తీసి విక్రయించి లాభాలు పొందవచ్చు. మీడియాలో వచ్చిన పలు నివేదికల ప్రకారం. హెక్టారుకు సంవత్సరానికి 3 నుంచి 5 లీటర్ల లెమన్‌గ్రాస్ నూనెను ఉత్పత్తి చేయవచ్చు. మార్కెట్లో ఒక్కో లీటరు లెమన్ గ్రాస్ ఆయిల్ ధర రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు ఉంటుంది. మొదటి మూడు సంవత్సరాలలో దాని ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. (Disclaimer: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమేనని గమనించగలరు. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మార్కెట్ అవగాహన, ఇతర వివరాలను పరిశీలించడం అవసరం.) -
లెమన్ గ్రాసే లచ్చిందేవి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వారందరూ ఓ చిన్న తండాకు చెందిన గిరిజన మహిళలు. రెక్కాడితే గానీ డొక్కాడదు. ఆ పరిస్థితి నుంచి బయట పడేందుకు, తమ కుటుంబాలను గాడిన పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు అందరూ ఏకమై దారులు వెతికారు. వినూత్న ఆలోచనను ఒడిసిపట్టి విజయబావుటా ఎగురవేశారు. లెమన్ గ్రాస్ (నిమ్మగడ్డి)తో సుగంధ ద్రవ్యాన్ని (నూనె) తయారుచేస్తూ.. ఓ అంతర్జాతీయ ఏజెన్సీ సహకారంతో మార్కెటింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి యూనిట్ ఏర్పాటు చేసి ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న చీకరుచెట్టు తండా మహిళలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అడుగులు ఇలా.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని చీకరుచెట్టు తండా జనాభా 570 మంది. ఈ చిన్న తండాలో 14 మహిళా సంఘాలు ఉండగా.. ఇందులో సుమారు 150 మంది సభ్యులు ఉన్నారు. గతంలో బ్యాంకు లింకేజీ రుణాలతో చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని సెరా అనే సంస్థ మహిళా చైతన్యం, ఆర్థికాభివృద్ధిపై 2021 జనవరిలో జిల్లాలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లిలో జరిగిన సదస్సుకు చీకరచెట్టు తండాలోని మహిళలు హాజరయ్యారు. లెమన్ గ్రాస్‌తో సుగంధ ద్రవ్యంతో పాటు పలు ఉత్పత్తులు తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. పదిమంది మహిళలు గ్రూపుగా ఏర్పడి.. తమ ఆసక్తిని అప్పటి కలెక్టర్ షేక్ యాస్మిన్‌భాషా దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆర్థిక సాయంతో పాటు ప్రోత్సాహం అందించడంతో.. వారంతా ఝాన్సీలక్ష్మీబాయి మహిళా సంఘంగా ఏర్పడి సుగంధ ద్రవ్యం, ఇతర ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం మొత్తం యూనిట్ కాస్ట్ రూ.11.50 లక్షలు కాగా.. కలెక్టర్ నుంచి రూ.6.50 లక్షలు, సెరా సంస్థ రూ.2 లక్షలు సాయం లభించింది. మహిళలు తమవంతుగా రూ.3 లక్షలు వేసుకుని యూనిట్‌ను నెలకొల్పారు. మొదట లెమన్ గ్రాస్ సేకరించి సుగంధ ద్రవ్యం తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నూనెతో పలు ఉత్పత్తులకూ రూపకల్పన చేశారు. అంతేకాదు.. వీటిని మార్కెటింగ్ చేయడం ఎలా అని ఆలోచించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఓ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ట్రికా నుంచి ఇటీవల రూ.11.13 లక్షల సబ్సిడీ విడుదలైంది. లీటర్ ఆయిల్‌కు రూ.1,400 టన్ను నిమ్మగడ్డితో ఆ మహిళలు ఆరు లీటర్ల నూనె తయారు చేస్తున్నారు. మార్కెట్లో ఈ ఆయిల్ లీటర్‌కు రూ.1,400 పలుకుతోంది. ఈ నూనెతో క్రిమినాశక సబ్బులు, షాంపూలు, పలు కాస్మోటిక్స్, ఫేస్ క్రీమ్, హెయిర్ ఆయిల్, లెమన్‌టీ పౌడర్ తయారు చేయవచ్చు. ప్రస్తుతం ఇక్కడి మహిళలు సబ్బులు, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సెంట్లు, లెమన్ టీ పౌడర్ తయారు చేసి విక్రయిస్తున్నారు. భవిష్యత్‌లో అగర్‌బత్తులతో పాటు ధూప్ స్టిక్స్ ఇతరత్రా తయారు చేయనున్నట్లు మహిళలు వెల్లడించారు. పెరుగుతున్న సాగు సంఘంలో ఉన్న సభ్యులు మొదట తమ తమ వ్యవసాయ పొలాల్లో నిమ్మగడ్డి సాగు చేశారు. తర్వాత తాము కొంటామంటూ చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయడంతో పాటు రైతులను యూనిట్ వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. ఈ క్రమంలో దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి, చిలకటోనిపల్లి, పెద్దమందడి గ్రామాల్లో చాలామంది రైతులు లెమన్ గ్రాస్ సాగు చేపట్టారు. ఈ మేరకు టన్ను నిమ్మగడ్డికి రూ.4 వేలు ఇవ్వడంతో పాటు మంట కోసం ఉపయోగించిన గడ్డి కాలిపోగా వచ్చిన బూడిదను పొలాల్లో ఎరువుగా వినియోగించేందుకు సదరు రైతులకే అందజేస్తున్నారు. ఆదరణ లభిస్తోంది.. నిమ్మగడ్డి పంట రెండు నెలలకోసారి వస్తుంది. అయినా దీని సాగు ఇంకా పెరగాల్సి ఉంది. ఈ మేరకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం రెండు నెలలకోసారి 80 నుంచి 100 లీటర్ల వరకు ఆయిల్ విక్రయిస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లలో పాల్గొన్నాం. మేం తయారు చేసే లెమన్ గ్రాస్ ఆయిల్, సబ్బులు ఇతరత్రా ఉత్పత్తుల్లో ఎలాంటి రసాయనాలు లేకపోవడంతో మంచి ఆదరణ ఉంది. వనపర్తి కలెక్టరేట్లో లెమన్ టీ సెంటర్ ఏర్పాటు చేశాం. – మోతీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
పామ్రోజ్, నిమ్మ గడ్డి సాగు
‘మాది వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం బాలాయిపల్లె. గిద్దలూరులో టెక్స్మో పోలిరెడ్డి అనే వ్యక్తి 100 ఎకరాల్లో పంట వేయడం చూసి మా ఊర్లో 15 ఎకరాల్లో పామ్రోజ్, నిమ్మగడ్డిని సాగుచేశా. ఆయిల్ తీసే పద్ధతిలో లోపాలు ఉండటంతో నష్టాలు వచ్చాయి. కందుకూరులో నా స్నేహితుని వద్దకు వెళ్లి ఇవే పంటలపై రూ.3 లక్షల పెట్టుబడి పెట్టా. అక్కడ కూడా నష్టపోయా. మేం పెట్టిన రెండు డిస్టిలేషన్ యూనిట్లలో(మొక్కల నుంచి ఆయిల్ తీసే యంత్రం) ఉన్న లోపాలను అప్పుడు గమనించా. తొలిసారి 6:6 సైజ్ పెద్ద డ్రమ్‌లను, ఆవిరిని చల్లబరిచే గొట్టం 2 అంగుళాలు ఉండే పరికరాన్ని ఉపమోగించా. టన్ను గడ్డికి 4 లీటర్ల ఆయిల్ రావాల్సి ఉండగా 2.5 లీటర్లు మాత్రమే వచ్చేది. కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో యంత్రాలను గమనించా. 6ఁ5 సైజ్‌లో రెండు పెద్ద డ్రమ్‌లను, ఆవిరిని చల్లబరచే గొట్టంను 10 అంగుళాలకు పెంచి సొంతగా తయారు చేయించా. ఒక్కో డ్రమ్‌లో 750 కేజీల గడ్డి పడుతుంది. దీని నుంచి నాలుగు కేజీల ఆయిల్ వస్తోంది. కంపెనీలు తయారు చేసే డిస్టిలేషన్ యూనిట్ కొనాలంటే రూ.3 లక్షలు ఖర్చువుతుంది. వాటి ద్వారా ఆశించిన ఆయిల్ రావడం లేదు. అందుకని రూ.2.50 లక్షలు ఖర్చుపెట్టి ఆయిల్ తీసే యంత్రాన్ని సొంతగా తయారు చేయించుకున్నా. ఇప్పుడు న ష్టం రావడం లేదు. లక్షల్లో ఉన్న అప్పు మొత్తం తీరిపోయింది. ప్రస్తుతం ఎడాదికి రూ.15 లక్షల ఆదాయం పొందుతున్నా. 2011లో బేస్తవారిపేట మండలం మల్లాపురం సమీపంలో 60 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పామ్రోజ్, నిమ్మగడ్డి సాగుచేస్తున్నా. హైదరాబాద్‌లోని బోడుప్పల్ మెడికల్ అండ్ ఆరోమాటిక్ కార్యాలయంలో విత్తనాలు తెచ్చుకుంటున్నా. ప్రారంభంలో పంట చేతికి వచ్చే వరకు ఎకరాకు రూ.15-20 వేలు ఖర్చవుతుంది. నాటిన నాలుగో నెల నుంచి పంట చేతికొస్తుంది. పామ్రోజ్ విత్తనాలు ఒకసారి నాటితే 8-10 ఏళ్ల పాటు పంట పండుతుంది. ఏడాదికి ఐదు కోతలు కోయవచ్చు. విత్తనాలు నాటిన తర్వాత ఖర్చు ఉండదు. ఏడాదికి ఒకసారి అంతర సేద్యం(దుక్కి దున్నడం), 25 కేజీల యూరియా, 25 కేజీల డీఏపీ చల్లితే సరిపోతుంది. రెండు నెలల్లో ఎకరాకు మూడు టన్నుల గడ్డి పెరుగుతోంది. టన్నుకు నాలుగు కేజీల ఆయిల్ దిగుబడి ఉంటుంది. రోజూ రూ.1,500 ఖర్చుతో(కూలీలకు) 8 లీటర్ల ఆయిల్ తీస్తున్నా. నెలలో 20 రోజుల పాటు 150 ఆయిల్ దిగుబడి వస్తోంది. డిస్టిలేషన్ యంత్రంతో గడ్డిని ఉడికించడానికి ముందు రోజు ఆయిల్ తీసిన గడ్డినే వంట చెరకుగా ఉపయోగిస్తున్నా. దీనివల్ల వంట చెరకు ఖర్చు మిగులుతోంది. నిమ్మగడ్డి రెండు నెలలకు ఎకరాకు 2 టన్నుల గడ్డి వస్తుంది. టన్నుకు 10 కేజీల ఆయిల్ తీస్తున్నా. మార్కెట్లో కేజీ రూ.800 ధర ఉంది. ఈ పంట నీటి ఎద్దడిని తట్టుకోలేదు. 8-10 ఏళ్లు ఉండే పామ్రోజ్లా ఎక్కువ కాలం పంట ఉండకపోవడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. నేను కూడా ఐదెకరాల్లో సాగు చేస్తున్నా. సేంద్రియ పద్ధతిలో అధిక దిగుబడి మొదట్లో సేంద్రియ పద్ధతిలోనే గడ్డి పెంచా. మంచి దిగుబడి వచ్చింది. 200 లీటర్ల నీటికి ఐదు కేజీల ఆవు పేడ, మూత్రం, 2 కిలోల శనగ పిండి, 2 కిలోల బెల్లం, మర్రి చెట్ల కింద మట్టి గుప్పెడు వేస్తే బ్యాక్టీరియా వెయ్యి రెట్లు ఉత్పన్నమవుతుంది. ఆరు రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని పొలమంతా చల్లితే గడ్డి దిగుబడి చాలా పెరిగింది. అయితే అదే సమయంలో డిస్టిలేషన్ యంత్రాల్లో లోపాలను అధిగమించే క్రమంలో సేంద్రియ పద్ధతిలో సాగు గాడితప్పింది. ఇప్పుడు సమస్యలేమీ లేవు. త్వరలోనే పూర్తి స్థాయిలో సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తా. ఆయిల్‌ను దళారులకే విక్ర యిస్తున్నా.. పదేళ్ల క్రితం పామ్రోజ్ ఆయిల్ కేజీ రూ.400 ఉండేది. ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.1,800 మధ్య ధర ఉంటోంది. తిరుపతిలో ప్రైవేట్ దళారులకు ఆయిల్‌ను అమ్ముతున్నా. నేరుగా కంపెనీలకు అమ్మితే మంచి ధర వస్తుంది. కంపెనీల వాళ్లు నగదు చెల్లింపులో జాప్యం చేస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది’. రైతు చెన్నారెడ్డిని 9440855448లో సంప్రదించవచ్చు.