లెమన్‌ గ్రాసే లచ్చిందేవి! | Preparation of spices with lemon grass | Sakshi
Sakshi News home page

లెమన్‌ గ్రాసే లచ్చిందేవి!

Published Wed, Mar 8 2023 2:27 AM | Last Updated on Wed, Mar 8 2023 6:54 AM

Preparation of spices with lemon grass - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌  :  వారందరూ ఓ చిన్న తండాకు చెందిన గిరిజన మహిళలు. రెక్కాడితే గానీ డొక్కాడదు. ఆ పరిస్థితి నుంచి బయట పడేందుకు, తమ కుటుంబాలను గాడిన పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.  చివరకు అందరూ ఏకమై దారులు వెతికారు. వినూత్న ఆలోచనను ఒడిసిపట్టి విజయబావుటా  ఎగురవేశారు. లెమన్‌ గ్రాస్‌ (నిమ్మగడ్డి)తో సుగంధ ద్రవ్యాన్ని (నూనె) తయారుచేస్తూ.. ఓ అంతర్జాతీయ ఏజెన్సీ సహకారంతో మార్కెటింగ్‌ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి యూనిట్‌ ఏర్పాటు చేసి ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తూ.. అందరికీ ఆదర్శంగా  నిలుస్తున్న చీకరుచెట్టు తండా మహిళలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 

అడుగులు ఇలా.. 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని చీకరుచెట్టు తండా జనాభా 570 మంది. ఈ చిన్న తండాలో 14 మహిళా సంఘాలు ఉండగా.. ఇందులో సుమారు 150 మంది సభ్యులు ఉన్నారు. గతంలో బ్యాంకు లింకేజీ రుణాలతో చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని సెరా అనే సంస్థ మహిళా చైతన్యం, ఆర్థికాభివృద్ధిపై 2021 జనవరిలో జిల్లాలోని పలు గ్రామాల్లో మహిళా సంఘా­లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.

ఈ క్ర­మంలోనే పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లిలో జరిగిన సదస్సుకు చీకరచెట్టు తండాలోని మహిళలు హాజరయ్యారు. లెమన్‌ గ్రాస్‌తో సుగంధ ద్రవ్యంతో పాటు పలు ఉత్పత్తు­లు తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. పదిమంది మహిళలు గ్రూపుగా ఏర్పడి.. తమ ఆసక్తిని అప్పటి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌భాషా దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆర్థిక సాయంతో పాటు ప్రోత్సాహం అందించడంతో.. వారంతా ఝాన్సీలక్ష్మీబాయి మహిళా సంఘంగా ఏర్పడి సుగంధ ద్రవ్యం, ఇ­త­ర ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు.  

అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం 
మొత్తం యూనిట్‌ కాస్ట్‌ రూ.11.50 లక్షలు కాగా.. కలెక్టర్‌ నుంచి రూ.6.50 లక్షలు, సెరా సంస్థ రూ.2 లక్షలు సాయం లభించింది. మహిళలు తమవంతుగా రూ.3 లక్షలు వేసుకుని యూనిట్‌ను నెలకొల్పారు. మొదట లెమన్‌ గ్రాస్‌ సేకరించి సుగంధ ద్రవ్యం తయారు చేయడం మొదలుపెట్టారు.

ఆ తర్వాత నూనెతో పలు ఉత్పత్తులకూ రూపకల్పన చేశారు. అంతేకాదు.. వీటిని మార్కెటింగ్‌ చేయడం ఎలా అని ఆలోచించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఓ ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. యూనిట్‌ ఏర్పాటుకు సంబంధించి ట్రికా నుంచి ఇటీవల రూ.11.13 లక్షల సబ్సిడీ విడుదలైంది. 

లీటర్‌ ఆయిల్‌కు రూ.1,400 
టన్ను నిమ్మగడ్డితో ఆ మహిళలు ఆరు లీటర్ల నూనె తయారు చేస్తున్నారు. మార్కెట్‌లో ఈ ఆయిల్‌ లీటర్‌కు రూ.1,400 పలుకుతోంది. ఈ నూనెతో క్రిమినాశక సబ్బులు, షాంపూలు, పలు కాస్మోటిక్స్, ఫేస్‌ క్రీమ్, హెయిర్‌ ఆయిల్, లెమన్‌టీ పౌడర్‌ తయారు చేయవచ్చు. ప్రస్తుతం ఇక్కడి మహిళలు సబ్బులు, ఫినాయిల్, ఫ్లోర్‌ క్లీనర్, సెంట్లు, లెమన్‌ టీ పౌడర్‌ తయారు చేసి విక్రయిస్తున్నారు. భవిష్యత్‌లో అగర్‌బత్తులతో పాటు ధూప్‌ స్టిక్స్‌ ఇతరత్రా తయారు చేయనున్నట్లు మహిళలు వెల్లడించారు. 

పెరుగుతున్న సాగు 
సంఘంలో ఉన్న సభ్యులు మొదట తమ తమ వ్యవసాయ పొలాల్లో నిమ్మగడ్డి సాగు చేశారు. తర్వాత తాము కొంటామంటూ చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయడంతో పాటు రైతులను యూనిట్‌ వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. ఈ క్రమంలో దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి, చిలకటోనిపల్లి, పెద్దమందడి గ్రామాల్లో చాలామంది రైతులు లెమన్‌ గ్రాస్‌ సాగు చేపట్టారు. ఈ మేరకు టన్ను నిమ్మగడ్డికి రూ.4 వేలు ఇవ్వడంతో పాటు మంట కోసం ఉపయోగించిన గడ్డి కాలిపోగా వచ్చిన బూడిదను పొలాల్లో ఎరువుగా వినియోగించేందుకు సదరు రైతులకే అందజేస్తున్నారు. 

ఆదరణ లభిస్తోంది.. 
నిమ్మగడ్డి పంట రెండు నెలలకోసారి వస్తుంది. అయినా దీని సాగు ఇంకా పెరగాల్సి ఉంది. ఈ మేరకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం రెండు నెలలకోసారి 80 నుంచి 100 లీటర్ల వరకు ఆయిల్‌ విక్రయిస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లలో పాల్గొన్నాం. మేం తయారు చేసే లెమన్‌ గ్రాస్‌ ఆయిల్, సబ్బులు ఇతరత్రా ఉత్పత్తుల్లో ఎలాంటి రసాయనాలు లేకపోవడంతో మంచి ఆదరణ ఉంది. వనపర్తి కలెక్టరేట్‌లో లెమన్‌ టీ సెంటర్‌ ఏర్పాటు చేశాం.  – మోతీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement