jhansi lakshmi bai
-
లెమన్ గ్రాసే లచ్చిందేవి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వారందరూ ఓ చిన్న తండాకు చెందిన గిరిజన మహిళలు. రెక్కాడితే గానీ డొక్కాడదు. ఆ పరిస్థితి నుంచి బయట పడేందుకు, తమ కుటుంబాలను గాడిన పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు అందరూ ఏకమై దారులు వెతికారు. వినూత్న ఆలోచనను ఒడిసిపట్టి విజయబావుటా ఎగురవేశారు. లెమన్ గ్రాస్ (నిమ్మగడ్డి)తో సుగంధ ద్రవ్యాన్ని (నూనె) తయారుచేస్తూ.. ఓ అంతర్జాతీయ ఏజెన్సీ సహకారంతో మార్కెటింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి యూనిట్ ఏర్పాటు చేసి ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న చీకరుచెట్టు తండా మహిళలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అడుగులు ఇలా.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని చీకరుచెట్టు తండా జనాభా 570 మంది. ఈ చిన్న తండాలో 14 మహిళా సంఘాలు ఉండగా.. ఇందులో సుమారు 150 మంది సభ్యులు ఉన్నారు. గతంలో బ్యాంకు లింకేజీ రుణాలతో చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని సెరా అనే సంస్థ మహిళా చైతన్యం, ఆర్థికాభివృద్ధిపై 2021 జనవరిలో జిల్లాలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లిలో జరిగిన సదస్సుకు చీకరచెట్టు తండాలోని మహిళలు హాజరయ్యారు. లెమన్ గ్రాస్‌తో సుగంధ ద్రవ్యంతో పాటు పలు ఉత్పత్తులు తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. పదిమంది మహిళలు గ్రూపుగా ఏర్పడి.. తమ ఆసక్తిని అప్పటి కలెక్టర్ షేక్ యాస్మిన్‌భాషా దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆర్థిక సాయంతో పాటు ప్రోత్సాహం అందించడంతో.. వారంతా ఝాన్సీలక్ష్మీబాయి మహిళా సంఘంగా ఏర్పడి సుగంధ ద్రవ్యం, ఇతర ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం మొత్తం యూనిట్ కాస్ట్ రూ.11.50 లక్షలు కాగా.. కలెక్టర్ నుంచి రూ.6.50 లక్షలు, సెరా సంస్థ రూ.2 లక్షలు సాయం లభించింది. మహిళలు తమవంతుగా రూ.3 లక్షలు వేసుకుని యూనిట్‌ను నెలకొల్పారు. మొదట లెమన్ గ్రాస్ సేకరించి సుగంధ ద్రవ్యం తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నూనెతో పలు ఉత్పత్తులకూ రూపకల్పన చేశారు. అంతేకాదు.. వీటిని మార్కెటింగ్ చేయడం ఎలా అని ఆలోచించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఓ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ట్రికా నుంచి ఇటీవల రూ.11.13 లక్షల సబ్సిడీ విడుదలైంది. లీటర్ ఆయిల్‌కు రూ.1,400 టన్ను నిమ్మగడ్డితో ఆ మహిళలు ఆరు లీటర్ల నూనె తయారు చేస్తున్నారు. మార్కెట్లో ఈ ఆయిల్ లీటర్‌కు రూ.1,400 పలుకుతోంది. ఈ నూనెతో క్రిమినాశక సబ్బులు, షాంపూలు, పలు కాస్మోటిక్స్, ఫేస్ క్రీమ్, హెయిర్ ఆయిల్, లెమన్‌టీ పౌడర్ తయారు చేయవచ్చు. ప్రస్తుతం ఇక్కడి మహిళలు సబ్బులు, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సెంట్లు, లెమన్ టీ పౌడర్ తయారు చేసి విక్రయిస్తున్నారు. భవిష్యత్‌లో అగర్‌బత్తులతో పాటు ధూప్ స్టిక్స్ ఇతరత్రా తయారు చేయనున్నట్లు మహిళలు వెల్లడించారు. పెరుగుతున్న సాగు సంఘంలో ఉన్న సభ్యులు మొదట తమ తమ వ్యవసాయ పొలాల్లో నిమ్మగడ్డి సాగు చేశారు. తర్వాత తాము కొంటామంటూ చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయడంతో పాటు రైతులను యూనిట్ వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. ఈ క్రమంలో దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి, చిలకటోనిపల్లి, పెద్దమందడి గ్రామాల్లో చాలామంది రైతులు లెమన్ గ్రాస్ సాగు చేపట్టారు. ఈ మేరకు టన్ను నిమ్మగడ్డికి రూ.4 వేలు ఇవ్వడంతో పాటు మంట కోసం ఉపయోగించిన గడ్డి కాలిపోగా వచ్చిన బూడిదను పొలాల్లో ఎరువుగా వినియోగించేందుకు సదరు రైతులకే అందజేస్తున్నారు. ఆదరణ లభిస్తోంది.. నిమ్మగడ్డి పంట రెండు నెలలకోసారి వస్తుంది. అయినా దీని సాగు ఇంకా పెరగాల్సి ఉంది. ఈ మేరకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం రెండు నెలలకోసారి 80 నుంచి 100 లీటర్ల వరకు ఆయిల్ విక్రయిస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లలో పాల్గొన్నాం. మేం తయారు చేసే లెమన్ గ్రాస్ ఆయిల్, సబ్బులు ఇతరత్రా ఉత్పత్తుల్లో ఎలాంటి రసాయనాలు లేకపోవడంతో మంచి ఆదరణ ఉంది. వనపర్తి కలెక్టరేట్లో లెమన్ టీ సెంటర్ ఏర్పాటు చేశాం. – మోతీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
ఝాన్సీ లక్ష్మీబాయి: తలవాల్చిన.. తలవాల్సిన రోజు
పైన బ్రిటిష్ డేగల కళ్లు. కింద కోడిపిల్ల.. ఝాన్సీ సంస్థానం. ఏ క్షణమైనా తన్నుకుపోవచ్చు. తక్షణం ఝాన్సీకి వారసుడు కావాలి. ఆ వారసుడి చేతిలో పదునైన ఖడ్గం ఉండాలి. తన్నుకుపోవ డానికి కిందికి వాలబోతున్న డేగల కంఠాల్ని సర్రున తెగ్గొట్టేయాలి. అప్పుడే ఝాన్సీకి బతుకు. అప్పుడే ఝాన్సీ ప్రజలకు మెతుకు. వారసుడు లేడు. మణికర్ణిక వచ్చింది. మ..ణి..క..ర్ణి..క! ఆమెలా ఎవరూ ఉండరు. ఆమెలా ఎవరూ అశ్వాన్ని పరుగులు తీయించలేరు. ఆమెలా ఎవ్వరూ ఖడ్గాన్ని తిప్పలేరు. ఆమేనా వారసురాలు? ఝాన్సీని రక్షించేందుకు లేచి నిబడింది కదా. లేచి నడుము బిగించింది కదా. ఒరలోకి కత్తిని దోపుకుంది కదా. జవనాశ్వాన్ని ఎక్కింది కదా. ఖడ్గాన్ని తీసి గగనంలో నెత్తురు కక్కుతున్న ఆకలి కళ్లవైపు చూపింది కదా. అయితే వారసురాలే. ఝాన్సీ పౌరురాలు కాదు. అయినా వారసురాలే. ఝాన్సీకి ఆమె కోడలు. ఝాన్సీ సంస్థానం ఇక కోడి పిల్ల కాదు. కోడలు పిల్ల. మణికర్ణిక పేరు మారింది. లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీకి రాణి. ‘లక్ష్మీబాయి అనే నేను.. చివరి రక్తపు బొట్టు చిందేవరకు, ఝాన్సీకి అత్యంత విధేయురాలినై, ఝాన్సీ ప్రజల సేవకు ఝాన్సీ సంస్థాన రక్షణకు, సంరక్షణకు.. లక్ష్మీబాయి ప్రమాణ స్వీకారం. డేగలు కళ్లెర్ర చేశాయి. ఝాన్సీ నుంచి వెళ్లిపొమ్మని వర్తమానం పంపాయి. వెళ్లిపోవడం దేశద్రోహం. మిన్నకుండిపోవడం శత్రు శేషం. శత్రువును మిగిల్చదలచుకో లేదు లక్ష్మీబాయి. బ్రిటిష్ ఫిరంగులు ఝాన్సీలో చొరబడ్డాయి. ఝాన్సీని మరుభూమిగా మార్చివేశాయి. లక్ష్మీబాయి, ఆమె అశ్వం, ఆమె చేతిలోని ఖడ్గం.. పోరాటం ఆపలేదు. ‘‘దేశంపై ప్రేమ.. ఓటమిని అంగీకరించనివ్వదు. దేశాన్ని శత్రువుకు వదిలి పారిపోనివ్వదు’’... భర్త మాటలు గుర్తుకొచ్చాయి లక్ష్మీబాయికి. ‘‘నిన్ను ప్రేమించడాని కన్నా ముందు నేను నా దేశాన్ని ప్రేమించాను లక్ష్మీ’.. భర్త చివరి మాటలు గుర్తుకున్నాయి లక్ష్మీబాయ్‌కి. ‘నేనున్నా, పోయినా, నా దేశం మిగలాలి లక్ష్మీ.. నా దేశం మిగలాలి లక్ష్మీ.. నా దేశం మిగలాలి లక్ష్మీ’’. పదిహేడవ శతాబ్దపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కల కూడా అదే. స్వరాజ్యం. ఆయన కలను కూడా ఒక కత్తిలా చేతికి తీసుకుంది లక్ష్మీబాయి. హరహర మహాదేవ్. హరహర మహాదేవ్. శత్రుమూకల శిరస్సులు తెగి, లక్ష్మీబాయి ముఖం మీద రక్తం చింది పడుతోంది. నుదిటిపై సిందూరంలా రక్తం. కంఠంపై ఆభరణంలా రక్తం. పెదవులపై విజయహాసంలా రక్తం. లక్ష్మీబాయి గెలిచింది. కాదు.. ఝాన్సీ గెలిచింది. కాదు. ఝాన్సీ లక్ష్మీబాయి గెలిచింది. ‘‘నీకు ఝాన్సీ కావాలి. నాకూ ఝాన్సీ కావాలి. ఒకటే తేడా. నీకు పాలన కావాలి. నాకు ప్రజలు కావాలి’’.. శత్రువుతో లక్ష్మీబాయి. ‘‘నీకు నా శిరస్సు కావాలి, నాకూ నీ శిరస్సు కావాలి. ఒకటే తేడా. ఝాన్సీ కోట గుమ్మం ముందు వేలాడగట్టేందుకు నీకు నా శిరస్సు కావాలి. ఎవరికీ తలొంచే పని లేదని నా ప్రజలకు నేను చెప్పేందుకు నీ శిరస్సు నాకు కావాలి’’.. శత్రువుతో లక్ష్మీబాయి. 1858 జూన్‌లో గ్వాలియర్‌లో జరిగిన ఆ యుద్ధంలో 29 ఏళ్ల వయసులో ఝాన్సీలక్ష్మీబాయి శత్రువుతో పోరాడుతూనే వీర మరణం పొందారు. నేడు (జూన్ 18) ఆమె మరణించిన రోజు. -
పరాయి పాలన నుంచి విముక్తికై..
భారతావని నేడు 74వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటోంది. ఎర్రకోటపై మువ్వన్నల జెండా రెపరెపలు చూసి భారతీయుల గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. మరి ఈనాటి ఈ సంతోషం ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధుల త్యాగఫలమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రిటీష్ అధికారుల తుపాకీ గుళ్లకు ప్రాణాలు ఎదురొడ్డి, వారు చేసిన అలుపెరుగని పోరాటం కారణంగానే నేడు మనమంతా స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నాం. ఇక సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతో మంది మహిళామణులు కూడా విశేష పాత్ర పోషించారు. ‘అమ్మ’ను పరాయి పాలకుల చెర నుంచి విడిపించడానికి తమ వంతు కృషి చేశారు. వారిలో కొంతమంది ధీరోధాత్తలను నేడు స్మరించుకుందాం. ఆ ఆదిశక్తి స్వరూపాలను తలచుకుంటూ జై భరతనారీ అని నినదిద్దాం. ఝాన్సీ లక్ష్మీబాయి(1828-58) భారతీయ స్త్రీ అంటే ధైర్యానికి ప్రతీక అని చాటి చెప్పిన ధీర వనిత, ‘ఝాన్సీ’కి రాణి మణికర్ణిక తాంబే. 1857 సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజ్య సంక్రమణ’ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం ప్రకటించిన వీరనారి. కొడుకును వీపున కట్టుకుని పోరాడుతూ అతివ అంటే అబల కాదు సబల అని నిరూపించిన స్త్రీ మూర్తి.(చదవండి: స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?) బేగం హజ్రత్ మహల్(1820-1879) అవధ్ రాణిగా సుప్రసిద్ధురాలైన హజ్రత్ మహల్ భర్త నవాబ్ వాజిద్ అలీ షా మరణానంతరం పాలనా బాధ్యతలు స్వీకరించారు. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, తన అనుచరులతో కలిసి లక్నోను ఆక్రమించుకున్నారు. కొడుకు బిజ్రిస్ కాద్రాను అవధ్‌కు రాజుగా ప్రకటించారు. కానీ బ్రిటీష్ అధికారుల కుయుక్తుల ముందు ఓడిపోయి, బహిష్కరణకు గురై కలకత్తాకు వెళ్లిపోయారు. రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆలయాలు, మసీదులు కూల్చివేసి ప్రజా సంక్షేమానికే మొదటి ప్రాధాన్యమిచ్చిన రాణిగా అందరి దృష్టి ఆకర్షించారు. 1857- 1859 జాతీయ విముక్తి తిరుగుబాటుకు బేగం నాయకత్వం వహించారని కార్ల్ మార్క్స్, తన పుస్తకంలో పేర్కొన్నారు. (ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ) మేడమ్ బికాజీ కామా(1861-1936) పార్శీ వర్గానికి చెందినవారు. 1896లో ముంబైలో ప్లేగు వ్యాధి ప్రబలించినపుడు ఆమెకు వ్యాధి సోకినప్పటికీ ఇతరులకు సాయం చేశారు. మెరుగైన చికిత్స కోసం బ్రిటన్ వెళ్లారు. స్వాతంత్ర్యోద్యమానికై జీవితాన్ని ధారపోశారు. దాదాబాయ్ నౌరోజీ కార్యదర్శిగా పనిచేసే సమయంలో శ్యామ్ కృష్ణ వర్మ స్థాపించిన ‘ఇండియన్ హోమ్‌రూల్ సొసైటీ’కి మద్ధతుగా నిలిచారు. 1907లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సామాజిక సదస్సులో పాల్గొని భారత జెండాను ప్రదర్శించారు. భారత ఉపఖండం కరువును జయించిన తీరును వివరించారు. మానవ హక్కులకై, సమానత్వం సాధించుటకై కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1935లో యూరప్ నుంచి బహిష్కరణకు గురయ్యారు.(దేశం కోసం ఆమె భర్తతోనే విభేదించింది) కస్తూర్బా గాంధీ(1869-1944) భారత జాతిపిత మహాత్మా గాంధీ సహధర్మచారిణిగానే కాకుండా రాజకీయవేత్తగా, పౌర హక్కులకై పోరాడిన మహిళగా, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని గుర్తింపు పొందారు. కుటుంబ బాధ్యత తీసుకుని గాంధీజీకి అండగా నిలిచారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, క్రమశిక్షణ ఆవశ్యకతతో పాటు, విద్య ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు. కమలా నెహ్రూ(1899-1936) జవహర్లాల్ నెహ్రూ భార్య. సహాయ నిరాకరణోద్యమంలో మహిళా బృందాలను సంఘటితపరుస్తూ, విదేశీ దుస్తులు, మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. భర్త హాజరుకాని సమావేశాలకు ఆయన తరపున వెళ్లి ఉపన్యసించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అనీబిసెంట్(1857-1933) భారతదేశం స్వతంత్రంగా మారాలని ఆకాక్షించిన విదేశీ మహిళ. ఐర్లాండ్‌కు చెందిన వారు. బాలగంగాధర్ తిలక్‌తో కలిసి ‘హోం రూల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. సరోజిని నాయుడు(1879-1949) భారత కోకిలగా సుప్రసిద్ధురాలైన సరోజిని నాయుడు గవర్నర్ పదవి నిర్వహించిన తొలి భారతీయ మహిళ. స్వతంత్ర పోరాటంలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. గొప్ప కవయిత్రి కూడా. దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినపుడు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం ‘ఖైజర్-ఎ-హింద్’ పతకంతో సత్కరించింది. విజయ లక్ష్మీ పండిట్(1900-1990) సంపన్న కుటుంబంలో జన్మించిన విజయ లక్ష్మీ పండిట్ భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. పండిట్ జవహర్ లాల్ సోదరి. కేబినెట్ పదవి పొందిన మొదటి భారతీయ మహిళ. స్థానిక స్వయం ప్రభుత్వ, ప్రజారోగ్య మంత్రిగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు. భారత్ తరపున మాస్కో, వాషింగ్ట్‌న్, లండన్ మహిళా రాయబారిగా పనిచేశారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ (1909-1981) తెలుగు వనిత దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గాంధీజీ అనుచరురాలిగా సుప్రసిద్ధులు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగా బహుముఖ ప్రఙ్ఞ కలవారు. ఉప్పు సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారు. లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రణాళికా సంఘం సభ్యురాలిగా ఉన్న సమయంలో కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు స్థాపించారు. దీని ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సుచేతా కృపలానీ(1908-1974) స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వతంత్ర భారత్‌లో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా(ఉత్తర్ ప్రదేశ్) చరిత్ర సృష్టించారు. అరుణా అసఫ్ అలీ(1909-1996) భారత రత్న అవార్డు గ్రహీత. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రమంలో పలు మార్లు అరెస్టయ్యారు. జైలులో ఖైదీల పట్ల జైలు సిబ్బంది ప్రవర్తనా తీరుకు నిరసనగా బంద్‌లు చేపట్టారు. ఈ నిరసనల వల్ల తీహార్ జైలులోని ఖైదీల పరిస్థితి మెరుగుపడింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. -
నటి కంగనా రనౌత్ ఇంటి వద్ద భద్రత
సాక్షి, ముంబై : మణికర్ణిక మూవీ విడుదల నేపథ్యంలో ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయిగా టైటిల్ రోల్ పోషించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయిను అగౌరవపరిచేలా సన్నివేశాలున్నాయంటూ హిందూ కర్ణిసేన ఆందోళనలకు దిగడంతో ముందు జాగ్రత్త చర్యగా కంగనా నివాసం ఎదుట పోలీసు బలగాలను నియోగించారు. కాగా,బ్రిటిష్ అధికారితో లక్ష్మీభాయ్‌కు సంబంధం ఉందనే రీతిలో ఈ సినిమాలో సన్నివేశాలు ఉండటం పట్ల కర్ణిసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌ను కించపరిచేలా ఏ ఒక్క సీన్ ఉన్నా హిందూ సమాజం కంగనాను క్షమించబోదనిన. ఆమె తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని కర్ణిసేన హెచ్చరించింది. తమను కంగనా బెదిరించడం ఇలాగే కొనసాగిస్తే ఆమెను తాము స్వేచ్ఛగా మహారాష్ట్రలో తిరగనివ్వబోమని, ఆమె మూవీ సెట్స్‌ను తగులబెడతామని మహారాష్ట్ర కర్ణిసేన అధ్యక్షుడు అజయ్ సింగ్ సెంగార్ హెచ్చరించారు. -
ఎంపీ బుట్టా రేణుకకు ఝాన్షీ లక్ష్మీబాయి అవార్డు
కర్నూలు(అర్బన్): కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కర్ణాటక కో ఆపరేటీవ్ హ్యాండ్ లూమ్స్ వీవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థ కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ధీర వీర వనిత ఝాన్షీలక్ష్మీబాయి అవార్డును ప్రదానం చేసింది. శనివారం బెంగళూరు కేఆర్ రోడ్డు (బన్శంకరి)లోని కర్ణాటక జైన్ భవన్లో జరిగిన కార్యాక్రమంలో ఈ అవార్డును బుట్టా రేణుకకు ప్రదానం చేసినట్లు కుర్ని సేవా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు తెలిపారు. కావేరి హ్యాండ్ లూమ్స్, అఖిల భారత కుర్హిన శెట్టి విద్యార్థిని నిలయ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక చేనేత ఫెడరేషన్ చైర్మన్, మాజీ మంత్రి మల్లికార్జున నాగప్ప, కావేరి హ్యాండ్లూమ్స్ అధ్యక్షుడు విరుపాక్షప్ప, కన్నడ సినీ నటుడు కార్తీక్, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వరి చిదానంద మన్సూర్, కర్ణాటక రాష్ట్ర చేనేత నాయకురాలు రూపా లింగేశ్వర్ హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుర్ని సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎంపీగా ఎన్నిక కావడంతో పాటు తన పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు. అలాగే బీసీ వర్గాలకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బుట్టా నీలకంఠం, కుర్ని సంక్షేమ సంఘం కర్నూలు పట్టణ అధ్యక్షుడు సీ అజయ్‌కుమార్, గౌరవాధ్యక్షుడు బుట్టా రంగయ్య, అసోసియేట్ అధ్యక్షుడు బందికె జగదీష్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.