ఎంపీ బుట్టా రేణుకకు ఝాన్షీ లక్ష్మీబాయి అవార్డు
ఎంపీ బుట్టా రేణుకకు ఝాన్షీ లక్ష్మీబాయి అవార్డు
Published Sat, Jan 28 2017 11:52 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM
కర్నూలు(అర్బన్): కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కర్ణాటక కో ఆపరేటీవ్ హ్యాండ్ లూమ్స్ వీవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థ కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ధీర వీర వనిత ఝాన్షీలక్ష్మీబాయి అవార్డును ప్రదానం చేసింది. శనివారం బెంగళూరు కేఆర్ రోడ్డు (బన్‌శంకరి)లోని కర్ణాటక జైన్ భవన్‌లో జరిగిన కార్యాక్రమంలో ఈ అవార్డును బుట్టా రేణుకకు ప్రదానం చేసినట్లు కుర్ని సేవా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు తెలిపారు. కావేరి హ్యాండ్ లూమ్స్, అఖిల భారత కుర్హిన శెట్టి విద్యార్థిని నిలయ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక చేనేత ఫెడరేషన్ చైర్మన్, మాజీ మంత్రి మల్లికార్జున నాగప్ప, కావేరి హ్యాండ్‌లూమ్స్ అధ్యక్షుడు విరుపాక్షప్ప, కన్నడ సినీ నటుడు కార్తీక్, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వరి చిదానంద మన్సూర్, కర్ణాటక రాష్ట్ర చేనేత నాయకురాలు రూపా లింగేశ్వర్ హాజరయ్యారని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుర్ని సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎంపీగా ఎన్నిక కావడంతో పాటు తన పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు. అలాగే బీసీ వర్గాలకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బుట్టా నీలకంఠం, కుర్ని సంక్షేమ సంఘం కర్నూలు పట్టణ అధ్యక్షుడు సీ అజయ్‌కుమార్, గౌరవాధ్యక్షుడు బుట్టా రంగయ్య, అసోసియేట్ అధ్యక్షుడు బందికె జగదీష్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.
Advertisement