ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో నష్టపోయిన గృహిణి
వాట్సాప్ ద్వారా వలవేసిన సైబర్ నేరగాళ్లు
కేసు దర్యాప్తు చేస్తున్నసీసీఎస్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మహిళను టార్గెట్‌గా చేసుకున్న సైబర్ నేరగాళ్లు పెట్టుబడుల పేరుతో ఎర వేశారు. ఆమెకు రూ.720 లాభం ఇవ్వడం ద్వారా నమ్మకం కలిగించి ఏకంగా రూ.4.49 లక్షలు టోకరా వేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓ వివాహితకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా ట్రేడ్ మార్కెటింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో ఎర వేశారు. దానికి ముందు కొన్ని టాస్‌్కలు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో ఆయా వీడియోలు, ఫొటోలను షేర్ చేయడం, ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చని నమ్మబలికారు. మొదటి టాస్క్ పూర్తి చేసిన ఆమెకు రూ.120, రెండో టాస్క్ పూర్తి చేయడంతో రూ.300 చెల్లించారు.
దీంతో వారిపై పూర్తిగా నమ్మకం కలిగిన గృహిణి తాను పెట్టుబడులు పెడతానంటూ వాట్సాప్ ద్వారా సందేశం ఇచ్చారు. దీంతో ఆమెకు ఓ లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు అందులో ఖాతా తెరవడం ద్వారా పెట్టుబడులు పెట్టాలన్నారు. తొలుత రూ.వెయ్యి పెట్టుబడి పెట్టిన ఆమెకు రూ.300 లాభంతో రూ.1300 చెల్లించారు. ఆపై పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేయిస్తూ, త్వరలోనే లాభాలు వస్తాయని కాలయాపన చేశారు. మొత్తమ్మీద రూ.4.49 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత రిఫండ్ కోరితే మరికొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తేనే వస్తుందని చెప్పారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే...
తెలుగు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రైవేట్ ఉద్యోగికి పెళ్లి కూతురి పేరుతో ప్రొఫైల్ పంపిన సైబర్ నేరగాళ్లు రూ.2.05 లక్షలు కాజేశారు. దీనికోసం వాళ్లు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కథ చెప్పారు. నగర యువకుడు తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకోగా... మలేíÙయాలో ఉంటున్న విశాఖపట్నం యువతిగా ఓ యువతి తన ప్రొఫైల్ పంపింది. వాట్సాప్ ద్వారా ఇద్దరూ కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్నారు. ఆపై తన తండ్రి క్రిప్టో కరెన్సీ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి, లాభాలు పొందటంతో నిష్ణాతుడని చెప్పింది. తొలుత నిజమైన క్రిప్టో కరెన్సీ యాప్‌లోనే పెట్టుబడి పెట్టి, లాభాలు పొందేలా చేశారు.
ఆపై నకిలీ యాప్ లింక్‌ను పంపి, అందులో రూ.2.05 లక్షలు ఇన్వెస్ట్ చేయించి కాజేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే తెలుగు మ్యాట్రిమోనీ నుంచి వాట్సాప్ ద్వారా బాధితుడికి ఓ మెసేజ్ వచి్చంది. అందులో సైబర్ నేరగాళ్లు పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తెలుగా పరిచయమై ఎర వేస్తున్నారని, ఆపై వివిధ అంశాల్లో తమ అంకుల్, తండ్రి నిష్ణాతులని చెప్పి మోసం చేస్తున్నారని ఉంది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
తక్షణం ఫిర్యాదు చేయండి
అపరిచితులతో ఎలాంటి లావాదేవీలు వద్దు. ఆన్‌లైన్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్ అంటూ
వచ్చే ప్రకటనలు నమ్మవద్దు. ఎవరైనా
సైబర్ నేరాల బారినపడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసి లేదా 8712665171 నెంబర్‌ను వాట్సాప్ ద్వారా,
(cybercrimespshyd@gmail.com) మెయిల్‌కు ఐడీకి ఈ–మెయిల్ ద్వారా సంప్రదించి లేదా (www.cybercrime.gov.in) వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయాలి.
– సైబర్ క్రైమ్ పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment