సిద్దిపేట ‘సేంద్రియ ఎరువు’.. పేరేంటో తెలుసా? | Siddipet Organic Fertilizer Named Carbonlites Made From Wet Garbage | Sakshi
Sakshi News home page

తడి చెత్త ద్వారా తయారైన నాణ్యమైన.. సిద్దిపేట ‘సేంద్రియ ఎరువు’

Published Mon, Feb 20 2023 11:18 AM | Last Updated on Mon, Feb 20 2023 3:20 PM

Siddipet Organic Fertilizer Named Carbonlites Made From Wet Garbage - Sakshi

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్త ద్వారా తయారైన నాణ్యమైన సేంద్రియ ఎరువు త్వరలో మార్కెట్లోకి రానుంది. మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్తను సిద్దిపేట రూరల్‌ మండలం బుస్సాపూర్‌లోని డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ఈ తడి చెత్తతో ఇప్పటికే సీఎన్‌జీని తయారు చేసి విక్రయిస్తుండగా.. తాజాగా ఎరువును కూడా తయారు చేసి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సేంద్రియ ఎరువును సిద్దిపేట కార్బన్‌ లైట్స్‌ బ్రాండ్‌ పేరుతో ఈ నెల 21న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. 

ప్రతి ఇంటినుంచి చెత్త సేకరణ..
సిద్దిపేట పట్టణంలోని 43 వార్డుల్లో 41,322 కుటుంబాలు ఉండగా 1,57,026 మంది నివసిస్తున్నారు. ఇక్కడ తడి, పొడి, హానికర చెత్తను ఇంటింటి నుంచి సేకరించడాన్ని డిసెంబర్‌ 2020లో ప్రారంభించారు. ఈ చెత్తను సేకరించేందుకు 52 వాహనాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో రోజుకు 60 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా ఇందులో 70 శాతం తడి, 30 శాతం పొడి చెత్త ఉంటోంది. ఈ లెక్కన 42 మెట్రిక్‌ టన్నుల తడి చెత్త, 18 మెట్రిక్‌ టన్నుల పొడి చెత్తను సేకరిస్తున్నారు. 

తడి చెత్తతో ఎరువు తయారీ
బుస్సాపూర్‌ డంపింగ్‌ యార్డులో రూ.6 కోట్ల వ్యయంతో బయో – సీఎన్‌జీ ప్లాంట్, సేంద్రియ ఎరువుల కేంద్రం నిర్మించారు. ఈ ప్లాంట్‌ నిర్వహణ బాధ్యతలను కార్బన్‌ లైట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి అప్పగించారు. రాష్ట్రంలోనే మొదటిదైన ఈ ప్లాంట్‌ను 2021 డిసెంబర్‌ 20న బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో కలసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

ఇళ్ల నుంచి సేకరించిన 42 మెట్రిక్‌ టన్నుల తడి చెత్త నుంచి ఆహార వ్యర్థాలు, కురగాయలు, ఇతర వ్యర్థాలను వేరు చేస్తున్నారు. ఇలా వేరుచేసిన తర్వాత 10 మెట్రిక్‌ టన్నుల తడి చెత్తను బయో–సీఎన్‌జీ తయారు చేయడానికి మిగతా 32 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేంద్రియ ఎరువులను తయారు చేయడానికి వినియోగిస్తున్నారు. సిద్ధం చేసిన సేంద్రియ ఎరువును 40 కేజీల చొప్పున బ్యాగుల్లో ప్యాక్‌ చేసి విక్రయించేందుకు సిద్ధం చేశారు. ఒక్కో బ్యాగు అసలు ధర రూ.600 కాగా సిద్దిపేట రైతులకు రూ.300కే విక్రయించనున్నారు.  

21న రైతులకు అవగాహన సదస్సు 
సేంద్రియ ఎరువుల ఆవశ్యకతపై రైతులకు ఈ నెల 21న సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌లోని పత్తి యార్డులో అవగాహన కల్పించనున్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయనున్నారు.  

సిద్దిపేట బ్రాండ్‌తో సేంద్రియ ఎరువు: మంత్రి హరీశ్‌రావు
మంత్రి హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సిద్దిపేట బ్రాండ్‌తో చెత్త ద్వారా తయారు చేసిన ఎరువును రైతులకు అందించబోతున్నామన్నారు. సిద్దిపేట ప్రజలు రోజు వేసే చెత్తతో ఒక గొప్ప సంపదను తయారు చేసి రైతులకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సేంద్రియ ఎరువుతో అన్నీ పంటల నుంచి అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తులు పొందే అవకాశం ఉందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement