ముందుగా సడ చెట్లను పెంచాలి
తమలపాకు తోటలను పెంచాలనుకుంటున్న రైతులు ముందుగా సడ చెట్ల కాయలను సేకరించాలి. కాయలు పగులగొట్టి విత్తనాలను పొలంలో ప్రతీ గజం దూరానికి ఒకటి చొప్పున నాటాలి. మొక్కలు పెరిగేందుకు నీటి సరఫరా సౌకర్యం ఏర్పాటు చేయాలి. 5 నుంచి 6 నెలల తర్వాత మొక్కలు చెట్లుగా మారుతాయి. అనంతరం అర గజం పొడవు ఉన్న తమలపాకు తీగలను తెచ్చి ప్రతీ చెట్టు మొదలు వద్ద గుంతను తవ్వి నాటాలి.
ఈ విధంగా నాటిన తమలపాకు తీగలు 6 నెలల తర్వాత పెద్దవై సడచెట్ల తీగలకు అల్లుకుంటాయి. ఒక్కసారి తమలపాకుల తోటలను పెంచడం మొదలు పెడితే 5 ఏళ్ల దాకా తెంచిన తమలపాకుల స్థానంలో కొత్త ఆకులు చిగురిస్తాయి. ఒకసారి ఆకులు తెంచితే తిరిగి పది రోజుల్లోగా కొత్త ఆకులు వస్తుంటాయి. ఇలా వీటి పెంపకం రైతులకు లాభదాయకంగా కూడా ఉంటోంది.
సేంద్రియ ఎరువులతోనే..
తమలపాకు తోటల పెంపకానికి ఎలాంటి రసాయన ఎరువులను వినియోగించకూడదు. కేవలం వేప పిండి, వేరుశనగ పిండి, పశువుల పేడతో సొంతంగా ఎరువులను తయారు చేసి తోటల పెంపకానికి వినియోగించాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో వేలకు వేలు ఖర్చు చేసి రసాయనిక ఎరువులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో మేలు రకమైన తమలపాకులను ఉత్పత్తి చేసే వీలుంది. తమలపాకులలో లేత, ముదురు అని రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండు తోట ల పెంపకానికి వేర్వేరుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
పట్టణాల నుంచి వచ్చి కొనుగోలు
తమలపాకు తోటలు పెంచుతున్న గ్రామాలకు హైదరాబాద్, మహబూబ్‌నగర్, వికారాబాద్, తాండూరు తదితర పట్టణాల నుంచి వ్యాపారులు నేరుగా వచ్చి సంచులకొద్దీ తమలపాకులను కొనుగోలు చేసి తీసుకువెళుతుంటారు. చిరు వ్యాపారులకు తమలపాకులను చర్కా (20 తమలపాకుల కట్టలు)లుగా రూపొందించి విక్రయిస్తుంటారు.
ఒక్కో కట్టలో 400 తమలపాకులుండి రూ. 200 ధర పలుకుతోంది. ఇవి పోనూ మిగిలిన తమలపాకులను సమీపంలో ఉన్న పరిగి, కుల్కచర్ల, షాద్‌నగర్ తదితర మార్కెట్లకు తీసుకు వెళ్లి విక్రయిస్తుంటారు. వినియోగదారుల అవసరార్థం నేరుగా తోటల వద్ద కూడా విక్రయిస్తారు.