చేవెళ్ల రూరల్: ఈ ఏడాది ఖరీప్ ప్రారంభం నుంచీ వరుణ దేవుడు రైతులతో దోబూచులాడుతూనే ఉన్నాడు. అవసరమైన సమయంలో వర్షాలు లేక ఇప్పటికే చాలా మంది రైతులు పంటల సాగులో వెనకబడిపోయారు. అడపాదడపా కురిసిన వర్షాలకు ధైర్యం చేసి మొక్కజొన్న పంట సాగు చేశారు. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పొట్ట దశలో ఉన్న మొక్కజొన్న చేతికి వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మండలంలో ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, జొన్న, కూరగాయ పంటలు ప్రస్తుతం మంచి కాత దశలో ఉన్నాయి. మొక్కజొన్న కంకులు పట్టి పాల దశలో ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు కురిస్తేనే కంకుల్లో విత్తులు గట్టి పడే అవకాశం ఉంది. పత్తి పంట కూడా పూత, కాత దశలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వానలు పడితే మంచి కాత వస్తుందని రైతులు అంటున్నారు. కానీ వరుణ దేవుడు కరుణ చూపించటంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఎండలు మండిపోతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో ఒక పెద్ద వాన పడితేనే అన్ని పంటలు గట్టెక్కుతాయని అంటున్నారు. లేదంటే ఇన్నాళ్లూ కష్టపడి పండించిన పంటలు కళ్ల ముందే పాడయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికే వర్షాధారంగా వేసిన కూరగాయ పంటలు వానలు లేక రోగాల బారిన పడి నాశనమవుతున్నాయన్నారు. వేల రూపాయల పెట్టుబడులు మట్టిలో పోసినట్లేనని ఆవేదన చెందుతున్నారు.
మొక్కజొన్న దక్కేనా!
Published Mon, Sep 29 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement