చెన్నూర్, న్యూస్‌లైన్ : నిత్యావసర ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నారుు. బియ్యం.. పప్పు.. చింతపండు.. నూనె.. ఇలా.. దేని ధర చూసినా ఆకాశాన్నంటింది. ఇక ఉల్లి ధర.. కళ్లెంట నీళ్లు తెప్పిస్తోంది. కూరగాయల ధరలూ బెదరగొడు తున్నాయి. జీతం డబ్బులు సరుకులకే సరిపోతున్నాయని, ఇలాగైతే బతుకుడు ఎలా అని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చడి మెతుకులు చాలంటున్నారు.
భారీగా పెరుగుదల..
గతంలో రూ.45 ఉన్న పామాయిల్ నూనె లీట ర్ ధర ప్రస్తుతం రూ.65కు చేరుకుంది. రూ.20 ఉన్న కిలో ఉల్లిగడ్డ ధర రూ.60కి చేరుకోగా కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నారుు. పప్పు.. అల్లం.. ఎల్లిగడ్డ.. ఇతర సరుకులదీ ఇదే పరిస్థితి. ఇదే రీతిన సరుకుల ధరలు పెరుగుతూ పోతే పస్తులుండక తప్పదని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కిలో కొనేవారు అరకిలో, అరకిలో కొనేవారు పావుకిలో కొటూ సరిపెట్టుకుంటున్నారు. అత్యవసర సరుకులే కొంటున్నారు. కూరగాయల ధరల పుణ్యమా అని కొన్ని రోజులుగా పప్పులకే ప్రాధాన్యమిస్తున్నారు.
వ్యాపారుల దోపిడీ..
నెల రోజల నుంచి సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం కొనసాగుతుండడంతో ఆ ప్రాంతం నుంచి వాహనాల రాకపోకలు నిలిచా రుు. దీని ప్రభావం నిత్యావసర సరుకులు, కూ రగాయలపై పడింది. ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ సరుకుల ధరలు విపరీతంగా పెంచుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేరే చోట సరుకులు నిల్వ చేస్తూ ధరలు అమాంతం పెంచుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తే సరుకుల ధరలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశముందని పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఏం కొనలేకపోతున్నం..
ధరలు మండుతున్నయ్. ఏం కొనాలన్నా భయమేస్తంది. ఎన్ని పైసలు తీసుకెళ్లినా సరిపోతలేవు. మార్కెట్‌కు వెళ్లి కిలో తెచ్చేవి అరకిలో తెస్తున్నం. ఏవీ పూర్తిగా కొనలేకపోతున్నం. ఇలాగే ధరలు పెరుక్కుంట పోతే రోజుకు ఒక్కపూట కూడా తినుడు కష్టమే.
- ఇంగిలి మల్లయ్య,
రిటైర్డ్ సింగరేణి కార్మికుడు
ఎలా బతుకుడు
ఇద్దరం పనిచేస్తే రోజుకు రెండొందలు కూడా గిట్టుబాటు అరుుతలేదు. మార్కెట్‌కు పోతే ధరలేమో మండుతున్నయి. బియ్యం, పప్పులు, నూనె, కూరగాయల ధరలు బాగా పెరిగినయ్. చేసిన కష్టం ఒక్క పూటకు సరిపోతలేదు. పిల్లలను ఎలా చదివించుడు.. ఎలా బతుకుడు.?
- పున్నం నర్మద, చెన్నూర్
నిత్యావసర సరుకుల ధరలు పైపైకి..
Published Sat, Aug 31 2013 2:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement