dall
-
AP: తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పు విక్రయాలు
సాక్షి, అమరావతి : నిత్యావసరాల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా మిల్లర్లు, టోకు వ్యాపారులను ఇందులో భాగస్వాములను చేస్తోంది. మార్కెట్ ధరల కంటే 15–20 శాతం తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పును విక్రయించేలా ప్రోత్సహిస్తోంది. ఏపీలోని 26 జిల్లాల్లో శనివారం నుంచి తక్కువ ధరకు బీపీటీ, సూపర్ ఫైన్, ఫైన్ వెరైటీ బియ్యం విక్రయాలను ప్రారంభిస్తోంది. ఆయా జిల్లాల్లోని మార్కెట్ ధరల ప్రకారం జాయింట్ కలెక్టర్లు ఈ సబ్సిడీ రేట్లను నిర్ణయిస్తారు. ప్రత్యేక కౌంటర్లలో.. దేశవ్యాప్తంగా గడిచిన రెండు నెలలుగా నిత్యావసరాల ధరలు వేగంగా పెరిగాయి. ఒక్కసారిగా బియ్యం, కందిపప్పు ధరలు అమాంతం పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలపై అధిక రేట్ల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గత మూడ్రోజులుగా పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు, టోకు వ్యాపారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా బియ్యం, కందిపప్పును మార్కెట్ ధర కంటే తక్కువకు విక్రయించాలని కోరగా.. అందుకు వ్యాపారులు ముందుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు రైతుబజార్లు, కళ్యాణమండపాలు, రద్దీగా ఉండే మార్కెట్లు, వ్యాపారుల దుకాణాల ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ రేట్లకు బియ్యం, కందిపప్పును విక్రయించనున్నారు. ఒక వ్యక్తికి గరిష్టంగా ఒక కేజీ కందిపప్పు, 10 కేజీల ఫైన్ వెరైటీ బియ్యాన్ని అందిస్తారు. వ్యాపారులను సమన్వయం చేస్తూ.. కొన్ని జిల్లాల్లో ఫైన్ వెరైటీ బియ్యం రకాల్లేవు. అయితే, వాటిని ఇతర జిల్లాల నుంచి వ్యాపారులతో కొనుగోలు చేయించి ప్రజలకు విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేస్తుంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పప్పుమిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ చర్యలతో ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు సైతం తక్కువ రేటుకు కందిపప్పును విక్రయించేందుకు అంగీకరించారు. దీంతో అక్కడి నుంచి కందిపప్పు నిల్వలను మార్కెట్లోకి తరలిస్తారు. ఇక వచ్చే సోమవారం నుంచి కందిపప్పును పూర్తిస్థాయిలో తక్కువ రేటుకు అందిస్తారు. కార్పొరేషన్.. కొత్త బ్రాండ్.. ఏపీ పౌరసరఫరాల సంస్థ సైతం సొంత బ్రాండింగ్‌తో బియ్యం రకాలను విక్రయించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇప్పటికే కర్నూలు నుంచి 50 టన్నుల బీపీటీ రకం ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వాటిని మిల్లింగ్ చేయగా 32 టన్నుల బియ్యం వస్తున్నట్లు గుర్తించారు. వీటిని పైలెట్ ప్రాజెక్టు కింది ప్రత్యేక ప్యాకింగ్‌లో మార్కెట్ రేటు కంటే తక్కువకు విక్రయించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే సీజన్ నుంచి పౌరసరఫరాల సంస్థ స్థానిక రైతుల నుంచి కందులను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. అవసరమైతే మద్దతు ధరకు మించి మార్కెట్ రేటు ఉన్నా కొనుగోలు చేసి ప్రజా ప్రజలకు చేర్చనుంది. నవంబర్, డిసెంబర్లలో కందుల సేకరణకు ప్రత్యేకంగా కార్పస్ పెట్టడంతో పాటు కొనుగోలు చేసిన వెంటనే రైతులకు నగదు చెల్లించేలా ప్రతిపాదనలు రూపొందిస్తోంది. నిల్వలపై పటిష్ట నిఘా వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి నిత్యావసరాల రేట్లను పెంచకుండా పౌరసరఫరాల శాఖ పటిష్ట నిఘా ఏర్పాటుచేసింది. వివిధ వర్గాల వ్యాపారుల వద్ద సరుకు నిల్వలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ http://fcainfoweb. nic.in/pspలో వెబ్సైట్లో నమోదు చేయాలని హెచ్చరిస్తోంది. నిల్వలు అధికంగా ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. గుంటూరు కోల్డ్ స్టోరేజీల్లోని కందుల నిల్వలను సైతం తనిఖీచేసి వాటిని కూడా బయట మార్కెట్లోకి తరలించనుంది. 111 ప్రత్యేక కౌంటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా సీఎస్ఆర్ ద్వారా చౌకగా బియ్యం, కందిపప్పు విక్రయాలకు వీలుగా 111 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు. ఇందులో 42 రైతుబజార్లలో, 56 ఓపెన్ మార్కెట్లలో ఉన్నాయి. వీటిల్లో సూపర్ ఫైన్ వెరైటీలతో పాటు బీపీటీ, సోనా మసూరి, సాంబామసూరి, ఆర్జీఎల్, స్టీమ్డ్ బియ్యం రకాలను అందుబాటులో ఉంచనున్నారు. కేవలం ప్రజల కోసమే.. ప్రజలకు నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉంచేందుకు మిల్లర్లు, వ్యాపారులతో చర్చించాం. వారి ద్వారా మార్కెట్ రేటు కంటే 15–20 శాతం తక్కువకు సరుకులు అందిస్తాం. ప్రజల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. హోల్‌సేల్ వ్యాపారులు ఈ విక్రయాలను కేవలం ప్రజల కోసమే చేపడుతున్నారు. – హెచ్.అరుణ్‌కుమార్,కమిషనర్, పౌరసరఫరాల సంస్థ -
మధ్యాహ్న భోజనానికి సబ్సిడీ పప్పు
సాక్షి, హైదరాబాద్: పప్పు నిల్వలను వదిలించుకునేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. కంది, పెసర వంటి పప్పులను సబ్సిడీపై రాష్ట్రాలకు ఇవ్వా లని కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం, సమీకృత శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) తదితర సంక్షేమ పథకాలకు పప్పులను అందజేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర వ్యవసాయ శాఖ శుక్రవారం లేఖ రాసింది. మార్కెట్ ప్రకారం సాధారణ ధరను నిర్ధారించి కిలోకు రూ.15 చొప్పున సబ్సిడీపై ఇస్తామని వెల్లడించింది. మొత్తం 34.88 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు నిల్వలను వదిలించుకోవా లని భావిస్తోంది. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి ప్రతి ఏడాది ప్రభుత్వసంస్థల ద్వారా కేంద్రం పప్పుధాన్యాలను సేకరిస్తోంది. దిగుమతులు కూడా వస్తుండటంతో నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ఏం చేయాలో అర్థంగాక వాటిని రాష్ట్రాలకు అంటగట్టాలని నిర్ణయించింది. ఏ పథకానికి ఎంతెంత అవసరమో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో పేరుకుపోయిన కందులు మరోవైపు నిల్వ ఉన్న పప్పుధాన్యాలను వదిలించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. తన వద్ద ఉన్న కందుల నిల్వలను పప్పు చేసి ప్రజాపంపిణీ వ్యవస్థకు ఇస్తామని ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై సీఎస్ ఇటీవల ప్రత్యేక భేటీ నిర్వ హించారు. ప్రతి ఏడాది రైతుల నుంచి మార్క్‌ఫెడ్ కందులను కొనుగోలు చేసి, మద్దతు ధర అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. క్వింటాకు రూ.5,450 కనీస మద్దతు ధరతో కందులు కొనుగోలు చేసింది. మార్క్‌ఫెడ్ వద్ద 11.29 లక్షల క్వింటాళ్లు పేరుకుపోయాయి. వాటిని క్వింటాలుకు రూ.3,500 మించి కొనడానికి వ్యాపారులు ముందుకు రావడంలేదు. అలాఅమ్మితే వందల కోట్లు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతోంది. త్వరలో రానున్న ఈ ఖరీఫ్ కందులనూ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయాల్సి ఉం టుంది. ఎలాగైనా నిల్వ కందులను వదలించుకోవాలన్న ఆలోచనతో వాటిని పప్పు చేసి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. కందిని పప్పు చేసి కిలోకు రూ.50 చొప్పున పేదలకు, ఇతర వినియోగదారులకు అందజేస్తామని నిర్ణయించింది. కిలో, 5, 10, 25 కిలోల బ్యాగుల్లో ప్యాక్ చేయాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రజాపంపిణీ వ్యవస్థలో పప్పు సరఫరా లేదు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పుడు బియ్యం తప్ప ఇతర ఆహార పదార్థాలను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడంలేదు. గతంలో కందిపప్పును సరఫరా చేసి నిలిపివేశారు. దీంతో కందిపప్పు సరఫరాను పునరుద్ధరించాలంటే ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న పప్పులనే వదిలించుకునే పరిస్థితి లేనప్పుడు ఇక కేంద్రం నుంచి వచ్చే లక్షల టన్నులు ఏం చేయగలరనేది ప్రశ్న. -
నిత్యావసర సరుకుల ధరలు పైపైకి..
చెన్నూర్, న్యూస్‌లైన్ : నిత్యావసర ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నారుు. బియ్యం.. పప్పు.. చింతపండు.. నూనె.. ఇలా.. దేని ధర చూసినా ఆకాశాన్నంటింది. ఇక ఉల్లి ధర.. కళ్లెంట నీళ్లు తెప్పిస్తోంది. కూరగాయల ధరలూ బెదరగొడు తున్నాయి. జీతం డబ్బులు సరుకులకే సరిపోతున్నాయని, ఇలాగైతే బతుకుడు ఎలా అని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చడి మెతుకులు చాలంటున్నారు. భారీగా పెరుగుదల.. గతంలో రూ.45 ఉన్న పామాయిల్ నూనె లీట ర్ ధర ప్రస్తుతం రూ.65కు చేరుకుంది. రూ.20 ఉన్న కిలో ఉల్లిగడ్డ ధర రూ.60కి చేరుకోగా కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నారుు. పప్పు.. అల్లం.. ఎల్లిగడ్డ.. ఇతర సరుకులదీ ఇదే పరిస్థితి. ఇదే రీతిన సరుకుల ధరలు పెరుగుతూ పోతే పస్తులుండక తప్పదని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కిలో కొనేవారు అరకిలో, అరకిలో కొనేవారు పావుకిలో కొటూ సరిపెట్టుకుంటున్నారు. అత్యవసర సరుకులే కొంటున్నారు. కూరగాయల ధరల పుణ్యమా అని కొన్ని రోజులుగా పప్పులకే ప్రాధాన్యమిస్తున్నారు. వ్యాపారుల దోపిడీ.. నెల రోజల నుంచి సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం కొనసాగుతుండడంతో ఆ ప్రాంతం నుంచి వాహనాల రాకపోకలు నిలిచా రుు. దీని ప్రభావం నిత్యావసర సరుకులు, కూ రగాయలపై పడింది. ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ సరుకుల ధరలు విపరీతంగా పెంచుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేరే చోట సరుకులు నిల్వ చేస్తూ ధరలు అమాంతం పెంచుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తే సరుకుల ధరలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశముందని పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏం కొనలేకపోతున్నం.. ధరలు మండుతున్నయ్. ఏం కొనాలన్నా భయమేస్తంది. ఎన్ని పైసలు తీసుకెళ్లినా సరిపోతలేవు. మార్కెట్‌కు వెళ్లి కిలో తెచ్చేవి అరకిలో తెస్తున్నం. ఏవీ పూర్తిగా కొనలేకపోతున్నం. ఇలాగే ధరలు పెరుక్కుంట పోతే రోజుకు ఒక్కపూట కూడా తినుడు కష్టమే. - ఇంగిలి మల్లయ్య, రిటైర్డ్ సింగరేణి కార్మికుడు ఎలా బతుకుడు ఇద్దరం పనిచేస్తే రోజుకు రెండొందలు కూడా గిట్టుబాటు అరుుతలేదు. మార్కెట్‌కు పోతే ధరలేమో మండుతున్నయి. బియ్యం, పప్పులు, నూనె, కూరగాయల ధరలు బాగా పెరిగినయ్. చేసిన కష్టం ఒక్క పూటకు సరిపోతలేదు. పిల్లలను ఎలా చదివించుడు.. ఎలా బతుకుడు.? - పున్నం నర్మద, చెన్నూర్