సాక్షి, అమరావతి : నిత్యావసరాల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా మిల్లర్లు, టోకు వ్యాపారులను ఇందులో భాగస్వాములను చేస్తోంది. మార్కెట్ ధరల కంటే 15–20 శాతం తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పును విక్రయించేలా ప్రోత్సహిస్తోంది. ఏపీలోని 26 జిల్లాల్లో శనివారం నుంచి తక్కువ ధరకు బీపీటీ, సూపర్ ఫైన్, ఫైన్ వెరైటీ బియ్యం విక్రయాలను ప్రారంభిస్తోంది. ఆయా జిల్లాల్లోని మార్కెట్ ధరల ప్రకారం జాయింట్ కలెక్టర్లు ఈ సబ్సిడీ రేట్లను నిర్ణయిస్తారు.
ప్రత్యేక కౌంటర్లలో..
దేశవ్యాప్తంగా గడిచిన రెండు నెలలుగా నిత్యావసరాల ధరలు వేగంగా పెరిగాయి. ఒక్కసారిగా బియ్యం, కందిపప్పు ధరలు అమాంతం పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలపై అధిక రేట్ల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గత మూడ్రోజులుగా పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు, టోకు వ్యాపారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా బియ్యం, కందిపప్పును మార్కెట్ ధర కంటే తక్కువకు విక్రయించాలని కోరగా.. అందుకు వ్యాపారులు ముందుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు రైతుబజార్లు, కళ్యాణమండపాలు, రద్దీగా ఉండే మార్కెట్లు, వ్యాపారుల దుకాణాల ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ రేట్లకు బియ్యం, కందిపప్పును విక్రయించనున్నారు. ఒక వ్యక్తికి గరిష్టంగా ఒక కేజీ కందిపప్పు, 10 కేజీల ఫైన్ వెరైటీ బియ్యాన్ని అందిస్తారు.
వ్యాపారులను సమన్వయం చేస్తూ..
కొన్ని జిల్లాల్లో ఫైన్ వెరైటీ బియ్యం రకాల్లేవు. అయితే, వాటిని ఇతర జిల్లాల నుంచి వ్యాపారులతో కొనుగోలు చేయించి ప్రజలకు విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేస్తుంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పప్పుమిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ చర్యలతో ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు సైతం తక్కువ రేటుకు కందిపప్పును విక్రయించేందుకు అంగీకరించారు. దీంతో అక్కడి నుంచి కందిపప్పు నిల్వలను మార్కెట్‌లోకి తరలిస్తారు. ఇక వచ్చే సోమవారం నుంచి కందిపప్పును పూర్తిస్థాయిలో తక్కువ రేటుకు అందిస్తారు.
కార్పొరేషన్.. కొత్త బ్రాండ్..
ఏపీ పౌరసరఫరాల సంస్థ సైతం సొంత బ్రాండింగ్‌తో బియ్యం రకాలను విక్రయించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇప్పటికే కర్నూలు నుంచి 50 టన్నుల బీపీటీ రకం ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వాటిని మిల్లింగ్ చేయగా 32 టన్నుల బియ్యం వస్తున్నట్లు గుర్తించారు. వీటిని పైలెట్ ప్రాజెక్టు కింది ప్రత్యేక ప్యాకింగ్‌లో మార్కెట్ రేటు కంటే తక్కువకు విక్రయించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే సీజన్ నుంచి పౌరసరఫరాల సంస్థ స్థానిక రైతుల నుంచి కందులను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. అవసరమైతే మద్దతు ధరకు మించి మార్కెట్ రేటు ఉన్నా కొనుగోలు చేసి ప్రజా ప్రజలకు చేర్చనుంది. నవంబర్, డిసెంబర్‌లలో కందుల సేకరణకు ప్రత్యేకంగా కార్పస్ పెట్టడంతో పాటు కొనుగోలు చేసిన వెంటనే రైతులకు నగదు చెల్లించేలా ప్రతిపాదనలు రూపొందిస్తోంది.
నిల్వలపై పటిష్ట నిఘా
వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి నిత్యావసరాల రేట్లను పెంచకుండా పౌరసరఫరాల శాఖ పటిష్ట నిఘా ఏర్పాటుచేసింది. వివిధ వర్గాల వ్యాపారుల వద్ద సరుకు నిల్వలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ http://fcainfoweb. nic.in/pspలో వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని హెచ్చరిస్తోంది. నిల్వలు అధికంగా ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. గుంటూరు కోల్డ్ స్టోరేజీల్లోని కందుల నిల్వలను సైతం తనిఖీచేసి వాటిని కూడా బయట మార్కెట్‌లోకి తరలించనుంది.
111 ప్రత్యేక కౌంటర్లు..
రాష్ట్రవ్యాప్తంగా సీఎస్‌ఆర్ ద్వారా చౌకగా బియ్యం, కందిపప్పు విక్రయాలకు వీలుగా 111 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు. ఇందులో 42 రైతుబజార్లలో, 56 ఓపెన్ మార్కెట్లలో ఉన్నాయి. వీటిల్లో సూపర్ ఫైన్ వెరైటీలతో పాటు బీపీటీ, సోనా మసూరి, సాంబామసూరి, ఆర్జీఎల్, స్టీమ్డ్ బియ్యం రకాలను అందుబాటులో ఉంచనున్నారు.
కేవలం ప్రజల కోసమే..
ప్రజలకు నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉంచేందుకు మిల్లర్లు, వ్యాపారులతో చర్చించాం. వారి ద్వారా మార్కెట్ రేటు కంటే 15–20 శాతం తక్కువకు సరుకులు అందిస్తాం. ప్రజల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. హోల్‌సేల్ వ్యాపారులు ఈ విక్రయాలను కేవలం ప్రజల కోసమే చేపడుతున్నారు. – హెచ్.అరుణ్‌కుమార్,కమిషనర్, పౌరసరఫరాల సంస్థ
Comments
Please login to add a commentAdd a comment