సాగులో ఉన్న వరి పంట
‘ఇంట్లో దీపం వెలిగితే ఆ కుటుంబానికే వెలుగు.. అదే దీపం గుడిలో వెలిగితే ఊరంతటికీ వెలుగు’నిస్తుందని నమ్మారు ఆ ఊరి వాళ్లంతా. తూరుపు దిక్కున ప్రతి గుమ్మానికి ఆత్మ గౌరవమనే తోరణం కట్టారు. అజ్ఞానపు కట్టుబాట్లను తెంచి పడమర దిక్కున పాతేశారు. ఊరికి ఉత్తరాన అంతరాలను కట్టెలపై కాల్చేసి.. జ్ఞాన దివిటీలను గుండెల్లో వెలిగించుకున్నారు. దారికి దక్షిణాన నాగలి పట్టి పుడమి నుదుటిపై తమ జీవిత రాతలు ఎలా ఉండాలో రాసుకున్నారు. అక్షర కాంతులు నింపుకున్న ఆ గ్రామం ఇప్పుడు సామాజిక చైతన్యపు తిలకాన్ని నుదిట దిద్దుకుని కొత్త పొద్దులకు ఆహ్వానం పలుకుతోంది. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నల్లమల అడవి అంచున వెలసిన గిరిజన గ్రామం వైకుంఠపురం విశేషాలను పరికిస్తే.. ప్రతి గడపా ఓ విజయగాథకు ప్రతిరూపంగా నిలుస్తోంది.
సాక్షి, నరసరావుపేట: ఇప్పటికీ అత్యంత వెనుకబడిన గిరిజన తెగ ‘యానాదులు’. సంప్రదాయ వృత్తులకే పరిమితమైన వీరిలో అత్యధికులు చదువులకు నోచుకోక.. ఎదుగుబొదుగూ లేని జీవితాల్ని గడుపుతున్నారు. అష్టకష్టాలు పడి కొండకెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకోవడం.. చేపలు పట్టడం.. పొలాల వెంట తిరుగుతూ ఎలుకల్ని పట్టడం.. పంటలకు కాపలాదారులుగా ఉండటం.. కానీ.. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన యానాదులు తమ చరిత్ర గతిని మార్చుకున్నారు.
కట్టెలు కొట్టిన చేతితో నాగలి పట్టారు. గ్రామం మొత్తం రైతన్నలుగా మారిపోయారు. మరో అడుగు ముందుకేసి ఉద్యాన పంటలు సైతం సాగు చేస్తున్నారు. తాగుడుకు స్వస్తి పలికి చైతన్యవంతులయ్యారు.
ఊరిని మద్యనిషేధ గ్రామంగా మార్చుకున్నారు. తరతరాల నిరక్షరాస్యతను ఛేదించి తొలి తరం అభ్యాసకులుగా అక్షర కాంతులు నింపుకుంటున్నారు. 25 ఏళ్లుగా స్థానిక పాలనలో కూడా వారు కీలకంగా మారారు.
నాలుగు కుటుంబాలతో మొదలై..
1965 నాటికి ఇక్కడ ఒబ్బాని రంగనాయకులు, చేవూరి లక్ష్మయ్య, రాపూరి అంకులు, కొమరగిరి నీలకంఠం కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఆ నాలుగు కుంటుంబాలు అక్కడ సారవంతమైన భూములు ఉండటంతో పంటలు వేయడం ప్రారంభించాయి. తర్వాత కాలంలో వీరిని చూసి ఒక్కో కుటుంబం అక్కడకు చేరింది. ఇప్పుడు ఆ గ్రామంలో 310 గడపలయ్యాయి. సుమారు 952 మంది జనాభా నివాసం ఉంటున్నారు. ప్రతి ఇంటికి పొలం ఉంది.
వ్యవసాయమే వారి ప్రధాన జీవనాధారం. ప్రతి చేనుకు బోరు మోటార్ ఉన్నాయి. దశాబ్దాలుగా అక్కడ మద్య నిషేధం అమలవుతోంది. అనాదిగా నల్లమల అటవీ ప్రాంతం సారా తయారీ అడ్డాగా ఉన్నా.. ఇక్కడ మాత్రం ఆ వాసనే లేదు. సారానే కాదు.. మద్యం అమ్మడం, తాగడాన్ని కూడా నిషేధించారు. గ్రామంలో నేరాలు కూడా లేవు. పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా ఉండవు. గిరిజనులు ఇలా కష్టాన్ని నమ్ముకుని ఇలలో వారి గ్రామం వైకుంఠపురం నామాన్ని సార్థకం చేసుకున్నారు.
అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకతో ప్రస్తుత తరంలో 154 కుటుంబాలకు వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరయ్యాయి. ఇక గ్రామంలో పక్కా ఇల్లు లేని వారంటూ ఉండరు. ఏళ్లుగా బంజరు భూములను సాగు చేస్తున్న 18 మంది రైతులకు త్వరలో సాగు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామం మొత్తం దాదాపుగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే.
ఎంపీటీసీలుగా ఆ గ్రామస్తులకే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) అవకాశం ఇస్తున్నారు. చలంచర్ల విశ్వనాథం, ఇండ్ల అప్పారావు, రాపూరి సామ్రాజ్యం, యాకసిరి లక్ష్మి , ప్రస్తుతం చేపూరి భవాని ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో 12 మంది స్థిరపడ్డారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment