Yanadula development
-
ఇల వైకుంఠపురంలో..
‘ఇంట్లో దీపం వెలిగితే ఆ కుటుంబానికే వెలుగు.. అదే దీపం గుడిలో వెలిగితే ఊరంతటికీ వెలుగు’నిస్తుందని నమ్మారు ఆ ఊరి వాళ్లంతా. తూరుపు దిక్కున ప్రతి గుమ్మానికి ఆత్మ గౌరవమనే తోరణం కట్టారు. అజ్ఞానపు కట్టుబాట్లను తెంచి పడమర దిక్కున పాతేశారు. ఊరికి ఉత్తరాన అంతరాలను కట్టెలపై కాల్చేసి.. జ్ఞాన దివిటీలను గుండెల్లో వెలిగించుకున్నారు. దారికి దక్షిణాన నాగలి పట్టి పుడమి నుదుటిపై తమ జీవిత రాతలు ఎలా ఉండాలో రాసుకున్నారు. అక్షర కాంతులు నింపుకున్న ఆ గ్రామం ఇప్పుడు సామాజిక చైతన్యపు తిలకాన్ని నుదిట దిద్దుకుని కొత్త పొద్దులకు ఆహ్వానం పలుకుతోంది. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నల్లమల అడవి అంచున వెలసిన గిరిజన గ్రామం వైకుంఠపురం విశేషాలను పరికిస్తే.. ప్రతి గడపా ఓ విజయగాథకు ప్రతిరూపంగా నిలుస్తోంది. సాక్షి, నరసరావుపేట: ఇప్పటికీ అత్యంత వెనుకబడిన గిరిజన తెగ ‘యానాదులు’. సంప్రదాయ వృత్తులకే పరిమితమైన వీరిలో అత్యధికులు చదువులకు నోచుకోక.. ఎదుగుబొదుగూ లేని జీవితాల్ని గడుపుతున్నారు. అష్టకష్టాలు పడి కొండకెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకోవడం.. చేపలు పట్టడం.. పొలాల వెంట తిరుగుతూ ఎలుకల్ని పట్టడం.. పంటలకు కాపలాదారులుగా ఉండటం.. కానీ.. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన యానాదులు తమ చరిత్ర గతిని మార్చుకున్నారు. కట్టెలు కొట్టిన చేతితో నాగలి పట్టారు. గ్రామం మొత్తం రైతన్నలుగా మారిపోయారు. మరో అడుగు ముందుకేసి ఉద్యాన పంటలు సైతం సాగు చేస్తున్నారు. తాగుడుకు స్వస్తి పలికి చైతన్యవంతులయ్యారు. ఊరిని మద్యనిషేధ గ్రామంగా మార్చుకున్నారు. తరతరాల నిరక్షరాస్యతను ఛేదించి తొలి తరం అభ్యాసకులుగా అక్షర కాంతులు నింపుకుంటున్నారు. 25 ఏళ్లుగా స్థానిక పాలనలో కూడా వారు కీలకంగా మారారు. నాలుగు కుటుంబాలతో మొదలై.. 1965 నాటికి ఇక్కడ ఒబ్బాని రంగనాయకులు, చేవూరి లక్ష్మయ్య, రాపూరి అంకులు, కొమరగిరి నీలకంఠం కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఆ నాలుగు కుంటుంబాలు అక్కడ సారవంతమైన భూములు ఉండటంతో పంటలు వేయడం ప్రారంభించాయి. తర్వాత కాలంలో వీరిని చూసి ఒక్కో కుటుంబం అక్కడకు చేరింది. ఇప్పుడు ఆ గ్రామంలో 310 గడపలయ్యాయి. సుమారు 952 మంది జనాభా నివాసం ఉంటున్నారు. ప్రతి ఇంటికి పొలం ఉంది. వ్యవసాయమే వారి ప్రధాన జీవనాధారం. ప్రతి చేనుకు బోరు మోటార్ ఉన్నాయి. దశాబ్దాలుగా అక్కడ మద్య నిషేధం అమలవుతోంది. అనాదిగా నల్లమల అటవీ ప్రాంతం సారా తయారీ అడ్డాగా ఉన్నా.. ఇక్కడ మాత్రం ఆ వాసనే లేదు. సారానే కాదు.. మద్యం అమ్మడం, తాగడాన్ని కూడా నిషేధించారు. గ్రామంలో నేరాలు కూడా లేవు. పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉండవు. గిరిజనులు ఇలా కష్టాన్ని నమ్ముకుని ఇలలో వారి గ్రామం వైకుంఠపురం నామాన్ని సార్థకం చేసుకున్నారు. అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో ప్రస్తుత తరంలో 154 కుటుంబాలకు వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరయ్యాయి. ఇక గ్రామంలో పక్కా ఇల్లు లేని వారంటూ ఉండరు. ఏళ్లుగా బంజరు భూములను సాగు చేస్తున్న 18 మంది రైతులకు త్వరలో సాగు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామం మొత్తం దాదాపుగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులే. ఎంపీటీసీలుగా ఆ గ్రామస్తులకే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) అవకాశం ఇస్తున్నారు. చలంచర్ల విశ్వనాథం, ఇండ్ల అప్పారావు, రాపూరి సామ్రాజ్యం, యాకసిరి లక్ష్మి , ప్రస్తుతం చేపూరి భవాని ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో 12 మంది స్థిరపడ్డారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. -
యానాదుల బతుకుల్లో మార్పుకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన యానాదులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే నెల్లూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలో ప్రత్యేకంగా యానాదులకు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్ కార్డుల జారీతో వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెల్సిందే. తాజాగా విజయవాడ ఐటీడీఏ(మైదాన ప్రాంతం) పరిధిలోని ఎన్టీఆర్ జిల్లాలో యానాదుల స్థితిగతులను అధ్యయనం చేసి వారికి ప్రభుత్వ పథకాలను చేరువ చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. కేర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కోబో కలెక్ట్ యాప్(మొబైల్ అప్లికేషన్) సాయంతో సర్వే నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి సర్వేలో సేకరించిన అంశాల ఆధారంగా వారికి ప్రభుత్వ పథకాలతో పాటు అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలిస్తుండటంతో మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేసే విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ పరిశీలిస్తోంది. కోబో యాప్‌తో సమగ్ర సమాచారం గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో కేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఏకుల రవి, వెలుగు చంద్రరావు తమ సిబ్బందితో కలిసి కోబో కలెక్ట్ యాప్‌తో ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామాల్లో పర్యటించి యానాదులను గుర్తిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారి స్థితిగతులు, సమస్యలను యాప్ ద్వారా సేకరిస్తున్నారు. సేకరించిన సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు అందిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పలు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని యానాదుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల సహకారంతో బడి ఈడు పిల్లలను బడిలో, చిన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేరుస్తున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల యంత్రాంగంతో మాట్లాడి వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇప్పించేలా చర్యలు చేపట్టారు. 412 మంది యానాదులకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ.50 వేల చొప్పున అందించారు. 2,500 మందికి ఆధార్ కార్డులు, 550 మందికి రేషన్‌కార్డులు, మూడు వేల మందికి కుల ధ్రువీకరణ పత్రాలిప్పించేలా చర్యలు చేపట్టారు. చేపల వేటకు లైసెన్స్లిస్తున్నాం.. మైదాన ప్రాంత ఐటీడీఏ పరిధిలోని ఎస్టీల్లో లంబాడీ, ఎరుకల, యానాది, చెంచు, నక్కల తెగల వారున్నారు. వారిలో యానాదులకు సరైన చిరునామా, నివాసం లేక అవస్థలు పడుతున్నారు. వారి స్థితిగతులపై చేపట్టిన సర్వే మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అందిస్తున్నాం. ప్రధానంగా చేపల వేటపై ఆధారపడి జీవించే యానాదుల ఉపాధిని మరింత మెరుగుపరిచేలా దృష్టి సారించాం. కాలువలు, నదుల్లో చేపలను వేటాడుకునేలా జి కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన 18 మందికి కొత్తగా లైసెన్స్లిచ్చాం. మత్స్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో సబ్సిడీపై వలలు అందించేలా కార్యాచరణ చేపట్టాం. – ఎం.రుక్మంగదయ్య, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మైదాన ప్రాంత ఐటీడీఏ(విజయవాడ) -
యానాదుల అభివృద్ధికి కృషి
తాడేపల్లిగూడెం రూరల్ : యానాదుల సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతోపాటు వారి అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. మండలంలోని పడాల మార్కెట్ యార్డులో శనివారం జరిగిన యానాదుల ఐక్యగర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రిటిష్ తరహా విధానాలను అనుసరించడం వల్ల పేదలంతా పేదలుగానే మిగిలిపోయారన్నారు. యానాదుల జాతి గుర్తింపునకు, రక్షణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. పేదలు ఉన్నత విద్యావంతులైనప్పుడే అసమానతలు తొలగుతాయని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. యానాదుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ యానాదులు రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని చెప్పారు. బీసీ జాబితాలోని ఉపకులాలను ఎస్సీ జాబితాలో చేర్చడం వల్ల ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందన్నారు. తొలుత గొల్లగూడెం సెంటర్ నుంచి యానాదులు ర్యాలీగా పడాల మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అనంతరం సంఘ జిల్లా అధ్యక్షుడు మేకల ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన మహాసభలో గ్రేహౌండ్స్ ఎస్పీ వెంకటేశ్వర్లు, యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి శ్రీనివాస్, మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, పడాల మార్కెట్ కమిటీ చైర్మన్ పాతూరి రామ్‌ప్రసాద్‌చౌదరి, సినీ కళాకారుడు పి.ఆంజనేయులు తదితరులు మాట్లాడారు.