అల వైకుంఠపురంబులో..
వైకుంఠపురం కేంద్రంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని!
ఆసియాలోనే అతి పెద్దదైన 192 కిలోమీటర్ల ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణం
ఔటర్ పరిధిలో కృష్ణా నదిపై ఆరు వంతెనలు
రాజధాని స్వరూపం, నిర్మాణాలపై ప్రాథమిక మ్యాప్ సిద్ధం
కృష్ణా నది వెంబడి రెండు జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం
వీజీటీఎం పరిధిని విస్తరించి రాజధాని అభివృద్ధి అథారిటీ ఏర్పాటు!
గన్నవరానికి ప్రత్యామ్నాయంగా గుంటూరు జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం
హైదరాబాద్ : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 192 కిలోమీటర్ల ఆసియాలోనే అతి పెద్దదైన ఔటర్ రింగ్ రోడ్డు, దాని మధ్యలో వైకుంఠపురం కేంద్రంగా రాజధాని నగరాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాజ దాని ప్రతిపాదనలు సిద్ధంచేస్తోంది. రాజధాని రూపురేఖలు, ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న విషయంపై ఒక ప్రాథమిక చిత్రాన్ని (మ్యాప్‌ను) సిద్ధం చేసింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం ఉడా) పరిధిని విస్తరించి చుట్టూతా 192 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ రింగ్ రోడ్డు అంతర్భాగంగా ఉండే ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధి అథారిటీ (ఏపీఎస్సీడీఏ)గా మారుస్తారు. కృష్ణా, గుంటూ రు జిల్లాల్లో మోగులూరు, పరిటాల, వెలగలేరు, అట్కూరు, గన్నవరం, తరిగొప్పుల, చలివేంద్రపాలెం, కొల్లిపర, జంపని, వేటపాలెం, వట్టి చెరుకూరు, ఫిరంగిపురం, 113 తాళ్లూరు, మేడికొండూరు, కొర్రపాడు, సిరిపురం, లింగంగుం ట్ల, పెదకూరపాడు, 75 తాళ్లూరు, తమ్మవరం మీదుగా ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. దీనికోసం భూసేకరణ జరపాలని నిర్ణయానికొచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డులో అంతర్భాగంగా ఆరు వంతెనలు నిర్మించాలని ప్రతిపాదించారు. గుంటూరు జిల్లా కొల్లిపరతో పాటు మరో రెండు ప్రాంతాలు, కృష్ణా జిల్లా కంకిపాడు, గొల్లపల్లి, గుంటుపల్లిల వద్ద నదిపై భారీ వంతెనల కోసం మ్యాప్‌లో మార్కింగ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, ఉద్యోగుల నివాస గృహ సముదాయాలను ఎక్కడెక్కడ నిర్మించాలో ఈ మ్యాప్‌లో గుర్తించారు. కృష్ణా నది వెంబడి రెండు జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలను నిర్మించడానికి ప్రతిపాదించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, చావపాడు, నెమలికల్లు, తాడికొండ, పెదవడ్లపూడి, మంగళగిరి, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో అన్ని స్థాయిలవారికి ప్రభుత్వ వసతి గృహాలను నిర్మించాలని ప్రతిపాదించారు.
కేపిటల్ డెవలప్మెంట్ అథారిటీ
వీజీటీఎం ఉడా పరిధిని దాటి రాజధాని అభివృద్ధి అథారిటీ ఏర్పాటు కానుంది. ఈ అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లోనే భారీ ఎత్తున ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూ సేకరణ జరపాలని భావిస్తోంది. తొలి దశలో 25 వేల ఎకరాలు సేకరించాలని భావిస్తోంది. ఇందుకోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రుల కమిటీని కూడా నియమించింది. ఈ నెల 17 నుంచి మూడు రోజులపాటు ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో ఆ బృందం పర్యటించాల్సి ఉంది. తుపాను కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది.
వరద ముప్పు ఉందంటున్న నిపుణులు
ప్రతిపాదిత రాజధాని ప్రాంతం.. మరీ ముఖ్యం గా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు తదితర భవనాలు నిర్మించే ప్రాంతాల్లో వరద ముప్పు లేకుండా చూడాలని నిపుణులు సూచించారు. తాజాగా తలెత్తిన వరదలు, వైకుంఠపురం ప్రాం తంలో భూకంపాలు సంభవిస్తాయన్న నిపుణుల సూచనల మేరకు వరద ముప్పు లేకుండా తీసుకోవలసిన చర్యలపై ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు నిర్వహించారు. వరద ముప్పును ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలపై నీటి పారుదల శాఖ ఇప్పటికే ఒక నివేదిక రూపొం దించినట్టు తెలిసింది. దీనిని అధ్యయనం చేసిన తర్వాత ముఖ్య భవనాల సముదాయాలను ప్రతిపాదిత ప్రాంతంలోనే నిర్మించాలా? మరో ప్రాంతానికి మార్చాలా అన్నది నిర్ణయిస్తారని అధికారవర్గాలు చెప్పాయి. కాగా అంతర్జాతీయ విమానాశ్రయం కోసం గుంటూరు జిల్లా తాడికొండ, కృష్ణా జిల్లా చిక్కవరం ప్రాంతాలను ఈ మ్యాప్‌లో మార్క్ చేశారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని గన్నవరం వద్ద విమానాశ్రయం ఉంది. దీని విస్తరణలోసమస్యలు వచ్చే పరిస్థితి ఉందని నిపుణులు నివేదిస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని, ప్రత్యామ్నాయంగా మరోచోట అంతర్జాతీయస్థాయి విమానాశ్రయం నిర్మించాలని భావిస్తున్నారు. దీని కోసం కనీసం 5 వేల ఎకరాలు అవసరమని తేల్చారు.
రాజధాని కోసం ఇనాం భూములు!
ఆయా దేవాలయాల పరిధిలో దాతలు గతం లో ఇనాంగా ఇచ్చిన భూములను రాజధాని కోసం సేకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాంటి భూముల వివరాలతో కూడిన నివేదిక కూడా ప్రభుత్వానికి అందింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే దాతలు కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో దేవాలయాలకు ఇచ్చిన భూములు సుమారు రెండు వేల ఎకరాలు ఉన్నట్లు ఆ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
ఇనాం భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం...
గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురంతో పాటు ప్రముఖ దేవాలయాలను రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు నిర్మించారు. అపుడు ఆలయాల్లో అర్చకత్వం చేసే వారితో పాటు వివిధ సేవలు అందించే వారికి వారి పనిని బట్టి ఎనిమిది ఎకరాలతో మొదలు పెట్టి అంతకంటే ఎక్కువ భూమిని ఇనాంగా ఇచ్చారు. దేవుడికి ఇనాంగా ఇచ్చిన భూములను అమ్ముకునేందుకు అవకాశం లేదన్న అస్త్రాన్ని ప్రయోగించి రాజధాని నిర్మాణానికి ఆ భూములను సేకరించాలన్న అంశంపైనా సర్కారు పెద్దలు చర్చించినట్లు తెలిసింది.
వైకుంఠపురాన్నే ఎందుకు ఎంచుకున్నారంటే...
కృష్ణా నది తూర్పు దిశగా ప్రవహిస్తుంది. అయితే గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వద్దకు వచ్చేసరికి నది దిశ మారింది. ఇక్కడ నదికి క్రౌంచ పర్వతం అడ్డు వచ్చింది. దీంతో అది తూర్పు నుంచి కొద్ది దూరం ఉత్తర దిశగా ప్రవహించి మళ్లీ తూర్పు దిక్కుకు మళ్లింది. వారణాసిలో గంగా నది కూడా ఇలానే తూర్పు నుంచి ఉత్తర దిక్కుకు మళ్లి తిరిగి యథాస్థితికి చేరుతుంది. ఇలా నది తూర్పు నుంచి ఉత్తర దిక్కుకు మారే ప్రాంతాన్ని ఉత్తర వాహినిగా పేర్కొంటారు. ఇది చాలా పవిత్ర ప్రదేశంగా పురాణాల్లో పేర్కొన్నారు. ఇంత ప్రాధాన్యత ఉన్నది కాబట్టే వైకుంఠపురం కేంద్రంగా రాజధాని నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారవర్గాల సమాచారం.