Karampudi
-
సీఐ నారాయణస్వామిపై ఈసీ చర్యలు
గుంటూరు/పల్నాడు, సాక్షి: ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ ఎఫెక్ట్.. ఆపై హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు కదిలింది. కారంపూడి సీఐ నారాయణస్వామిని విధుల నుంచి తప్పించింది.తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటూ నారాయణ స్వామితో పాటు ఇద్దరు పోలీస్ అధికారులపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన విచారణలో భాగంగా చర్యలు చేపట్టాలని సీఈవోకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఈసీ సీఐ నారాయణ స్వామిని తప్పించింది. అంతేకాదు.. నారాయణ స్వామిపై సిట్ విచారణకు ఆదేశించారు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా. ఆధారాలు సమర్పిస్తే ఇతర అధికారులపైనా విచారణ చేపడతామని ఆయన అంటున్నారు. -
ఇల వైకుంఠపురంలో..
‘ఇంట్లో దీపం వెలిగితే ఆ కుటుంబానికే వెలుగు.. అదే దీపం గుడిలో వెలిగితే ఊరంతటికీ వెలుగు’నిస్తుందని నమ్మారు ఆ ఊరి వాళ్లంతా. తూరుపు దిక్కున ప్రతి గుమ్మానికి ఆత్మ గౌరవమనే తోరణం కట్టారు. అజ్ఞానపు కట్టుబాట్లను తెంచి పడమర దిక్కున పాతేశారు. ఊరికి ఉత్తరాన అంతరాలను కట్టెలపై కాల్చేసి.. జ్ఞాన దివిటీలను గుండెల్లో వెలిగించుకున్నారు. దారికి దక్షిణాన నాగలి పట్టి పుడమి నుదుటిపై తమ జీవిత రాతలు ఎలా ఉండాలో రాసుకున్నారు. అక్షర కాంతులు నింపుకున్న ఆ గ్రామం ఇప్పుడు సామాజిక చైతన్యపు తిలకాన్ని నుదిట దిద్దుకుని కొత్త పొద్దులకు ఆహ్వానం పలుకుతోంది. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నల్లమల అడవి అంచున వెలసిన గిరిజన గ్రామం వైకుంఠపురం విశేషాలను పరికిస్తే.. ప్రతి గడపా ఓ విజయగాథకు ప్రతిరూపంగా నిలుస్తోంది. సాక్షి, నరసరావుపేట: ఇప్పటికీ అత్యంత వెనుకబడిన గిరిజన తెగ ‘యానాదులు’. సంప్రదాయ వృత్తులకే పరిమితమైన వీరిలో అత్యధికులు చదువులకు నోచుకోక.. ఎదుగుబొదుగూ లేని జీవితాల్ని గడుపుతున్నారు. అష్టకష్టాలు పడి కొండకెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకోవడం.. చేపలు పట్టడం.. పొలాల వెంట తిరుగుతూ ఎలుకల్ని పట్టడం.. పంటలకు కాపలాదారులుగా ఉండటం.. కానీ.. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన యానాదులు తమ చరిత్ర గతిని మార్చుకున్నారు. కట్టెలు కొట్టిన చేతితో నాగలి పట్టారు. గ్రామం మొత్తం రైతన్నలుగా మారిపోయారు. మరో అడుగు ముందుకేసి ఉద్యాన పంటలు సైతం సాగు చేస్తున్నారు. తాగుడుకు స్వస్తి పలికి చైతన్యవంతులయ్యారు. ఊరిని మద్యనిషేధ గ్రామంగా మార్చుకున్నారు. తరతరాల నిరక్షరాస్యతను ఛేదించి తొలి తరం అభ్యాసకులుగా అక్షర కాంతులు నింపుకుంటున్నారు. 25 ఏళ్లుగా స్థానిక పాలనలో కూడా వారు కీలకంగా మారారు. నాలుగు కుటుంబాలతో మొదలై.. 1965 నాటికి ఇక్కడ ఒబ్బాని రంగనాయకులు, చేవూరి లక్ష్మయ్య, రాపూరి అంకులు, కొమరగిరి నీలకంఠం కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఆ నాలుగు కుంటుంబాలు అక్కడ సారవంతమైన భూములు ఉండటంతో పంటలు వేయడం ప్రారంభించాయి. తర్వాత కాలంలో వీరిని చూసి ఒక్కో కుటుంబం అక్కడకు చేరింది. ఇప్పుడు ఆ గ్రామంలో 310 గడపలయ్యాయి. సుమారు 952 మంది జనాభా నివాసం ఉంటున్నారు. ప్రతి ఇంటికి పొలం ఉంది. వ్యవసాయమే వారి ప్రధాన జీవనాధారం. ప్రతి చేనుకు బోరు మోటార్ ఉన్నాయి. దశాబ్దాలుగా అక్కడ మద్య నిషేధం అమలవుతోంది. అనాదిగా నల్లమల అటవీ ప్రాంతం సారా తయారీ అడ్డాగా ఉన్నా.. ఇక్కడ మాత్రం ఆ వాసనే లేదు. సారానే కాదు.. మద్యం అమ్మడం, తాగడాన్ని కూడా నిషేధించారు. గ్రామంలో నేరాలు కూడా లేవు. పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉండవు. గిరిజనులు ఇలా కష్టాన్ని నమ్ముకుని ఇలలో వారి గ్రామం వైకుంఠపురం నామాన్ని సార్థకం చేసుకున్నారు. అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో ప్రస్తుత తరంలో 154 కుటుంబాలకు వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరయ్యాయి. ఇక గ్రామంలో పక్కా ఇల్లు లేని వారంటూ ఉండరు. ఏళ్లుగా బంజరు భూములను సాగు చేస్తున్న 18 మంది రైతులకు త్వరలో సాగు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామం మొత్తం దాదాపుగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులే. ఎంపీటీసీలుగా ఆ గ్రామస్తులకే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) అవకాశం ఇస్తున్నారు. చలంచర్ల విశ్వనాథం, ఇండ్ల అప్పారావు, రాపూరి సామ్రాజ్యం, యాకసిరి లక్ష్మి , ప్రస్తుతం చేపూరి భవాని ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో 12 మంది స్థిరపడ్డారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. -
రణక్షేత్రంలో ఉప్పొంగిన ఉత్సాహం.. వైభవంగా వీరారాధనోత్సవాలు
పల్నాటి రణక్షేత్రం కారంపూడి కత్తిగట్టి కదంతొక్కిందా.. వీరావేశంతో నాగులేరు ఉవ్వెత్తున ఉప్పొంగిందా.. బ్రహ్మనాయుడి ఉగ్రనృసింహకుంతం సమరనాదం మోగిస్తూ ముందుకురికిందా.. పల్నాటి పౌరుషాగ్నిని రగిలించిందా.. అన్నట్టు పోరాటాల పురిటిగడ్డ పల్నాడు గర్జించింది. వీరారాధనోత్సావాలతో ప్రతిమదీ పులకించింది. వీరుల కొణతములతో వీరంగమాడింది. కారంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాల రెండో రోజు రాయబారం ఘట్టం వైభవంగా జరిగింది. వీరాచారవంతులు వీరుల కొణతములతో కదంతొక్కారు. ఎదురు రొమ్ములపై బాదుకుంటూ కత్తిసాము చేశారు. వీరుల గుడిలో కొలువుదీరిన ఆయుధాలకు పూజలు చేశారు. రెండుగంటల పాటు కత్తుల సేవ చేశారు. అనంతరం గ్రామోత్సవానికి బయలు దేరారు. వీరులు కొందరు వీరావేశంతో ఊగిపోతుంటే బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం వారిపై వాలి ఓదార్చే ఘట్టం అబ్బురపరిచింది. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం బయట, బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయంలో వీరాచారవంతులు కత్తి సేవ చేశారు. చిన్న పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఉగ్ర రూపులై ఉత్సవంలో పాలుపంచుకున్నారు. చెన్నకేశవుని దీవెనలు పొంది చెన్నకేశవస్వామి, అంకాలమ్మ చెంతకు ఒక్కో ఆచారవంతుడు ఆయుధంతో వెళ్లి వారి దీవెనలు పొందారు. గంటలు గణగణ మోగిస్తూ జై చెన్నకేశవ అంటూ నినదించారు. గోవింద నామస్మరణలు చేశారు. అనంతరం పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇంటి వద్దకు చేరుకుని అక్కడ కొద్ది సేపు కత్తి సేవ చేశారు. రణక్షేత్ర వీధులు సంప్రదాయ డోలు, వీరు జోళ్ల వాయిద్యాలు, సన్నాయి మేళాలతో మార్మోగాయి. ఆయుధాలతో వీరులు చేసిన గ్రామోత్సవం ఆద్యంతం నాటి పోరాటాన్ని కళ్లకుకట్టింది. వీరుల గుడి నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా చెన్నకేశవస్వామి, అంకాలమ్మ ఆలయాలకు చేరుకుని కోట బురుజు మీదుగా పీఠాధిపతి ఇంటి వరకు, అక్కడి నుంచి మళ్లీ వీరుల గుడి వరకు గ్రామోత్సవం కొనసాగింది. వీరుల ఆయుధాలకు కారంపూడి ప్రజలు నీరాజనాలు పలికారు. వారుపోసి కొబ్బరి కాయలు కొట్టి ఆశీస్సులు పొందారు. ఆయుధాలకు పంచామృతాభిషేకాలు పల్నాటి వీరాచారవంతులు పల్నాటి రణక్షేత్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే వారు తొలుత తలనీలాలు సమర్పించి నాగులేరులో స్నానం చేశారు. నాగులేరు గంగధారి మడుగులో ఆయుధాలను శుభ్రం చేసుకున్నారు. కొందరు పంచామృతాలతో వీరుల ఆయుధాలను నాగులేరులో అభిషేకించడం విశేషం. నూతన వస్త్రాలతో పూజ కట్టుకున్నారు. వీరంతా ఒకేసారి ఆయుధాలను వీరుల గుడిలో ఉంచి పొంగళ్లు చేసుకుని వీర్ల అంకాలమ్మ, చెన్నకేశవస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. గురువారం తెల్లవారు జాము వరకు కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరాచారవంతులు వస్తూనే ఉన్నారు. శుక్రవారం కూడా మరికొందరు రానున్నారు. రాయబారం కథాగానం రెండో రోజు రాయబారం చారిత్రక ఘట్టం నేపథ్యంలో వీరుల గుడిలో రాత్రి అలరాజు రాయబారం కథాగానాన్ని వీరవిద్యావంతులు గానం చేశారు. వేదనాభరితమైన ఈ ఘట్టం గుండెలను పిండేసింది. మందపోరు ఘట్టం.. చాపకూడు పల్నాటి వీరారాధనోత్సవాలలో 3వ రోజు శుక్రవారం మందపోరు ఘట్టం జరగనుంది. ఈ రోజు బ్రహ్మనాయుడు చాపకూడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోపాటు ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు పది వేల మంది సహపంక్తి భోజనాలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ చేయూతతో ఈ కార్యక్రమం జరుగుతోంది. -
పల్నాడు రైతుల వినూత్న పంథా.. ‘ఫల’ప్రదం
పల్నాడు ‘ఫల’నాడుగా మారుతోంది. వినూత్న ప్రయోగాలకు వేదికవుతోంది. ఫలప్రదమై ఆనందాలు పంచుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మనవిగాని సరికొత్త పండ్ల తోటల సాగుకు ఇక్కడి కర్షకులు శ్రీకారం చుడుతున్నారు. సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలివిగా ఆలోచించి స్వేదం చిందిస్తే సిరులు కురిపించడం పెద్ద కష్టమేమీ కాదని, కష్టే‘ఫలి’ అని నిరూపిస్తున్నారు. లాభాలు గడిస్తూ అందరిచేత ఔరా అనిపిస్తున్నారు. సాక్షి, నరసరావుపేట: తక్కువ నీటితో అధిక దిగుబడులిచ్చే సరికొత్త ఉద్యానపంటల సాగుకు పల్నాడు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఆధునిక సాంకేతికతను జోడిస్తూ లాభసాటి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో పండ్ల తోటల సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. ఖర్జూర బా(ద్)షా సాధారణంగా ఖర్జూర పంటను గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో సాగుచేస్తారు. ఈ మధ్య రాయలసీమలోని అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో పండిస్తున్నారు. పల్నాడు జిల్లాలోనూ దీనిని సాగుచేయవచ్చని కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన బాషా నిరూపించారు. 15 ఎకరాల ఎర్ర ఇసుక నేలలో గుజరాత్‌లోని ఖచ్ కార్పొరేషన్ ల్యాబ్, రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని అతుల్ ల్యాబ్ నుంచి మూడున్నరేళ్ల వయసున్న 750 మొక్కలు తెచ్చి రెండేళ్ల క్రితం నాటారు. ఒక్కో మొక్కను రూ.5 వేలకు కొన్నారు. తొలి కాపు మొదలైంది. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు ఉండటంతో ఇక్కడి వాతావరణం ఖర్జూర సాగుకు అనుకూలమని రైతు బాషా చెబుతున్నారు. పంట కు సబ్సిడీ అందించడానికి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఉద్యాన రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మెట్టప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలో ఉద్యాన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మొత్తం 81,750 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏటా ఉద్యానవన శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతోపాటు రాయితీలు, ఇతర కార్యక్రమాలకు రూ.13 కోట్ల వరకు ఖర్చుచేస్తోంది. యాపిల్ బేర్.. రైతు కు‘భేర్’ థాయ్‌లాండ్‌కి చెందిన యాపిల్ బేర్‌ను ఉత్తరభారత దేశంలో అధికంగా సాగుచేస్తారు. ప్రస్తుతం అచ్చంపేట మండలం గ్రంథిసిరి గ్రామానికి చెందిన రైతు రాంబాబు దీనిని వినూత్నంగా సాగుచేస్తున్నారు. నాలుగెకరాల్లో పంట మొదలుపెట్టారు. ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు యాపిల్ బేర్ పంట చేతికివస్తుంది. ఎకరానికి పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని, ఆదాయం సగటున రూ.2 లక్షల వరకు ఉంటుందని రైతు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో యాపిల్ బేర్‌ను కిలో రూ.80 నుంచి రూ.90 వరకు అమ్ముతున్నారు. యాపిల్ బేర్ సాగుకు అవసరమైన మెలుకువలను ఉద్యానవనశాఖ అధికారులు అందజేస్తున్నట్టు రాంబాబు వెల్లడించారు. డ్రాగన్ ‘ఫ్రూట్‌ఫుల్’ ఎన్నో గొప్ప పోషకాలున్న డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం మాచర్ల, పెదకూరపాడు, మాచవరం, యడ్లపాడు, నరసరావుపేట మండలాల్లో ఎక్కువగా సాగవుతోంది. మొత్తం 110 ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అంచనా. పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులూ దీని సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. తక్కువ నీటితో పెరిగే ఈ మొక్కలు నాటిన రెండేళ్లలో దిగుబడి ప్రారంభమవుతుంది. మూడేళ్ల తర్వాత ఎకరానికి మూడు టన్నుల వరకు దిగుబడి వస్తు్తంది. ఉద్యాన వన శాఖ ఎకరానికి రూ.12 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. బెంగళూరు, హైదరాబాద్‌లాంటి నగరాలతోపాటు స్థానికంగా కూడా ఈ పండ్లకు గిరాకీ బాగా ఉంటోంది. (క్లిక్: తాటి.. పోషకాల్లో మేటి) ఉద్యాన శాఖ సహకారంతో.. నాలుగు ఎకరాల్లో యాపిల్ బేర్ పంట సాగుచేస్తున్నా. మన ప్రాంతంలో ఈ పంట సాగుచేయవచ్చా లేదా అన్న విషయాన్ని అధ్యయనం చేసి ప్రారంభించాను. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. ఉద్యానవన శాఖ నుంచి సాంకేతిక సలహాలు, సూచనలు అందుతున్నాయి. అధిక లాభాలు సాధించే అవకాశం ఉంది. – రాంబాబు, రైతు, గ్రంథసిరి గ్రామం, అచ్చంపేట లాభసాటి పంటలు ఉద్యాన పంటలు లాభసాటిగా ఉంటాయి. కాలానుగుణంగా వస్తున్న కొత్త వంగడాలు, రకాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటేనే సత్ఫలితాలు సాధ్యం. పల్నాడు జిల్లాలో ఖర్జూర, యాపిల్ బేర్, డ్రాగన్ ఫ్రూట్ వంటి కొత్త రకం పంటలకు రైతులు శ్రీకారం చుట్టారు. వీరికి సలహాలు, సూచనలతోపాటు రాయితీలు అందిస్తున్నాం. మార్కెటింగ్ చేసుకోవడం ఎలాగో కూడా చెబుతున్నాం. – బెన్నీ, జిల్లా ఉద్యానశాఖ అధికారి, పల్నాడు -
AP: ఊర్లున్నాయి.. ప్రజలు లేరు!
సాక్షి, అమరావతి బ్యూరో/కారంపూడి: పాడి–పంట.. పక్షుల కిలకిలారావాలు.. రచ్చబండలు.. అమ్మలక్కల ముచ్చట్లు.. ఇవీ పల్లెలకు ప్రతిరూపాలు. కానీ, ఊరు ఉండి ఆ ఊర్లో ఇవేమీ లేకపోతే..? అచ్చం ఇలాంటివే రెండు ఊర్లు గుంటూరు జిల్లా కారంపూడి మండలంలో ఉన్నాయి. ఒకటి సింగరుట్ల అయితే రెండోది వీరలక్ష్మీపురం. ఇక్కడ జనావాసాలు అంతరించినా అనేక శతాబ్దాలుగా ఆ గ్రామాల పేర్లు మాత్రం సజీవంగా ఉంటూ వస్తున్నాయి. ఈ విశేషమేంటో.. స్థానికంగా ప్రచారంలో ఉన్న చరిత్ర ఏమిటంటే.. రూపం చెడినా ఆనవాళ్లున్నాయి పల్నాటి యుద్ధం (క్రీ.శ 1182) అనంతరం వీరలక్ష్మీపురం అగ్రహారం కనుమరుగు కాగా, ఉగ్రనారసింహుని ఆగ్రహానికి గురై సింగరుట్ల భౌతిక రూపం లేకుండాపోయిందనే గాథ స్థానికంగా ప్రచారంలో ఉంది. సింగరుట్లలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం గతకాల వైభవానికి ప్రతీకగా కన్పిస్తోంది. ఆ గ్రామ పుట్టుక నుంచి కాలగర్భంలో కలసిపోయే వరకు అంతా స్వామి మహిమతోనే జరిగినట్లు స్వామివారి స్థల పురాణం చెబుతోంది. ఆ గ్రామ ఉనికి నిజమని తెలిపేందుకు అక్కడికి సమీపంలోనే అదే పేరుతో సింగరుట్ల తండా ఒకటి ఉంది. అలాగే, వీరలక్ష్మీపురం గ్రామం కాలగర్భంలో కలిసిపోయినా దానికి పడమరగా లక్ష్మీపురం పేరుతో కొత్త గ్రామం ఉంది. సింగరగూడెమే సింగరుట్లగా.. కారంపూడికి సమీపంలోని నల్లమల అడవిలో నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడు. ఆహార సేకరణ నిమిత్తం వేటకు వచ్చిన చెంచులు స్వామివారిని గుర్తించకుండా అపరాధం చేశారని, వారిపై తేనేటీగలు దాడిచేసి ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టిన విషయాన్ని చెంచులు వారి నాయకుడు సింగరకు తెలపగా, సింగర ఆ ప్రాంతాన్ని పరిశీలించి కొండరాతిపై ఉగ్రనారసింహుని రూపాన్ని చూశాడని, ఇక అప్పటినుంచి ఆయన్ను కొలుస్తూ అక్కడే గూడేన్ని ఏర్పాటుచేసుకున్నాడని.. ఆదే సింగరగూడెమని కాలక్రమంలో సింగరుట్లగా నామాంతరం చెందినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు స్వామివారికి 7,700 ఎకరాల భూమిని ఈనాంగా సమర్పించి, పూజించాడని చారిత్రక ఆధారం ఉంది. తర్వాత కాలంలో సింగరుట్ల అగ్రహారికులు స్వామివారి మాన్యాలను ఆక్రమించుకుని చివరకు స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు లేకుండా చేయడంతో ఉగ్రనారసింహుడు ఆగ్రహించి సింగరుట్ల గ్రామ రూపరేఖలు లేకుండా చేశాడనే పురాణ గాథ ఉంది. వీరలక్ష్మీపురం.. రికార్డుల్లో పదిలం ఇక పల్నాటి చరిత్ర కాలంలో వీరలక్ష్మీపురం అగ్రహారంగా వర్థిల్లింది. ఇది 581.14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఊరు కాలగమనంలో కలిసిపోయినా గ్రామం సరిహద్దులు మాత్రం చెక్కుచెదరలేదు. ఇక్కడున్న భూములు సేద్యం చేస్తున్న క్రమంలో అనేక దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. వాటిలో వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, పోలేరమ్మ విగ్రహాలున్నాయి. ఇక్కడ లభ్యమైన విగ్రహాన్నే అగ్రహారం పొలాల్లో వేపకంపల్లి, ఒప్పిచర్ల గ్రామస్తులు ప్రతిష్ఠించారు. వీరలక్ష్మీపురంలో వీరాంజనేయస్వామి దేవాలయం నేటికీ అలనాటి చరిత్రకు సాక్షిగా కన్పిస్తోంది. పల్నాటి చరిత్ర కాలంలో పేర్కొన్న 194 గ్రామాల్లో వీరలక్ష్మీపురం అగ్రహారం కూడా ఒకటి. సింగరుట్లలోని నరసింహస్వామి ఆలయం -
ఉద్రిక్తత నడుమ పల్నాటి కోడిపోరు
కారంపూడి (మాచర్ల): పల్నాటి వీరారాధనోత్సవాల్లో ప్రధానమైన కోడిపోరు ఉత్సవం సందర్భంగా ఆదివారం గుంటూరు జిల్లా కారంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. కోడిపోరు ఉత్సవ వేదికగా టీడీపీ నాయకులు, వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టే చర్యలకు దిగారు. తోపులాటలు చోటుచేసుకున్నాయి. గొడవలు జరగకుండా వీరులగుడి ఆవరణలోకి ఎవరూ పార్టీ జెండాలతో ప్రవేశించకుండా, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా అధికారులు చర్యలు చేపట్టగా వైఎస్సార్సీపీ కట్టుబడింది. ఆ ప్రకారమే వైఎస్సార్సీపీ శాసన సభ పార్టీ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ గురజాల నాయకులు ఎనుముల మురళీధరరెడ్డి పార్టీ శ్రేణులు జెండాలను గుడి బయటే ఉంచి వీరులగుడి ప్రాంగణంలోని కోడిపోరు గరిడీకి చేరుకున్నారు. పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి సహా ఏడుగురిని గరిడీలోకి అనుమతించారు. ఎమ్మెల్యే పీఆర్కే.. బ్రహ్మనాయుడు పక్షం వైపు పోటీకి దిగి పీఠాధిపతి పిడుగు తరుణ్‌చెన్నకేశవతో ఆశీనులయ్యారు. కొద్దిసేపటికి మాచర్ల టీడీపీ ఇన్చార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి డీజే ర్యాలీతో వీరులగుడి వరకు వచ్చారు. అయితే కొందరు పార్టీ నేతలు మెడలో పార్టీ కండువాలు, జెండాలతో గుడిలోకి నినాదాలతో దూసుకొచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన వైఎస్సార్సీపీ శ్రేణులు తాము కూడా జెండాలతో వస్తామని బయలుదేరడం, రెండు పార్టీల వారు వందలాదిగా ఎదురుపడడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాహాబాహీ తలపడే పరిస్థితి వచ్చింది. ఉత్సవాల పవిత్రతను దెబ్బతీస్తారా? అని వైఎస్సార్ సీపీ శ్రేణులు టీడీపీ నేతలపై ఆగ్రహించారు. టీడీపీ నేతలు దౌర్జన్యానికి సిద్ధపడ్డారు. పార్టీ జెండాలతో వస్తున్న టీడీపీ కార్యకర్తలు సీఐ, ఎస్ఐ, పోలీసులకు పరిస్థితిని అదుపు చేయడం కష్టమైంది. పోలీసులు ఎంత యత్నించినా టీడీపీ నాయకులు ఒకటిరెండు జెండాలు ప్రాంగణంలో ప్రదర్శించారు. అప్పటిదాకా మిన్నకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు జైజగన్ అంటూ నినదించారు. ప్రతిగా టీడీపీ నాయకులు ఎవరికి నచ్చిన నాయకునికి వారు జిందాబాద్‌లు కొట్టారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ పార్టీ శ్రేణులకు సర్దిచెప్పి, ఉద్రిక్తత తగ్గేలా చూశారు. అనంతరం బ్రహ్మనాయుడు పుంజు చిట్టిమల్లుతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నాగమ్మ పుంజు శివంగిడేగతో చలమారెడ్డి పోటీలకు సిద్ధమయ్యారు. అంతకు ముందు వీరవిద్యావంతులు కోడిపోరు కథాగానం చేశారు. -
అమరావతిలో మరో నిర్భయ
కారంపూడి (మాచర్ల): రోజురోజుకూ కామాంధులు పేట్రేగిపోతున్నారు. మానవ మృగాల అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా గుంటూరు జిల్లా ఒప్పిచర్లలో భర్త ఆదరణకు దూరమై కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్న ఒంటరి మహిళపై ఓ 17 ఏళ్ల యువకుడు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె జననాంగంలో కర్రతో తిప్పి దారుణంగా హింసించాడు. ప్రస్తుతం ఆ మహిళ చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. పిడుగురాళ్ల మండలం జూలకల్లుకు చెందిన బాధితురాలి(24)కి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఆమెను చేరదీసి పెంచిన అమ్మమ్మ.. ఏడేళ్ల కిందట కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన యువకుడితో వివాహం చేసింది. బాబు పుట్టిన కొన్నాళ్లకు ఆమెను మరీ అమాయకంగా ఉన్నావ్ అంటూ భర్త ఇంట్లో నుంచి కొట్టి తరిమేశాడు. భర్త, కుమారుడిపై మమకారం పెంచుకున్న ఆమె.. వారికి చేరువయ్యేందుకు ప్రయత్నించింది. అయినా కూడా భర్త దగ్గరకు రానివ్వకపోవడంతో అదే గ్రామంలోని గుడి, బడి వద్ద ఉంటూ కాలం వెళ్లదీసింది. దీంతో కొందరు మహిళలు ఆమెను గుంటూరులోని ఓ అనాథాశ్రమంలో చేర్పించారు. అక్కడ 8 నెలల పాటు ఉన్న ఆ మహిళ.. కొడుకును చూడకుండా ఉండలేక మళ్లీ ఒప్పిచర్లకు తిరిగి వచ్చింది. చిన్నపాటి రేకుల ఇల్లు అద్దెకు తీసుకుని కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి స్నానం చేసి దుస్తులు మార్చుకుంటున్న సమయంలో పొరుగునే నివసిస్తున్న షేక్ సైదులు ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెపై దాడి చేసి.. నోట్లో గుడ్డలు కుక్కి.. చంపేస్తానని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున ఐదు గంటల వరకు అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడడంతో పాటు ఆమె జననాంగంలో కర్రతో తిప్పి దారుణంగా హింసించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. రక్తసిక్తమైన బట్టలతో బయటకు వచ్చిన ఆ మహిళ ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పింది. వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. సోమవారం రాత్రి అమ్మమ్మ సాయంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆ మహిళ జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గురజాల సీఐ నరసింహరావు, కారంపూడి ఎస్ఐ మురళి ఘటనాస్థలికి వెళ్లి.. ఇంటి నిండా ఉన్న రక్తపు మరకలతో పాటు రక్తంతో తడిసిన దుస్తులు, జననాంగంపై దాడికి ఉపయోగించిన వస్తువులను సేకరించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మంగళవారం ఆమెను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. -
కారంపూడిలో రైతు ఆత్మహత్య
కారంపూడి (గుంటూరు జిల్లా) : కారంపూడిలో ముత్యాలంపాటి సత్యనారాయణ(50) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా వున్నాయి. పొలానికి గురువారం వెళ్లిన సత్యనారాయణ అక్కడ పొలానికి కొట్టగా మిగిలి వున్న పురుగుమందును తాగి ఇంటికి వచ్చాడు. పిల్లలకు ఫోన్ చేసి, కడసారి నన్ను చూసుకోవచ్చని త్వరగా రావాలని కోరాడు. విషయం తెలిసిన భార్య, కుటుంబ సభ్యులు హుటాహుటిన సత్యనారాయణను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్యనారాయణ గతంలో ఆదర్శ రైతుగా పని చేశాడు. మూడున్నర ఎకరాల్లో పత్తిపంట వేసి నష్టపోయాడు. అప్పుల బాధకు, ఇతర సమస్యలు తోడు కావడంతో ఆయన ఉసురు తీసుకున్నాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
కుస్తీ పోటీలకు కారంపూడి విద్యార్థులు
కారంపూడి: రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు 17 మంది ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బి.సుధాకర్ శనివారం తెలిపారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మందడంలో శుక్రవారం అండర్14, 17 విభాగాలలో జిల్లా స్థాయి ఎంపికలు జరిగాయి. అండర్ 14 బాలుర ఫ్రీ స్టెయిల్ విభాగంలో ఇ.రవి, ఎ.అంజిబాబు, ఎల్.రాకేష్, జి.అభినవ్, జి.రామకృష్ణ, ఆర్.ఆంజనేయులునాయక్, జి.నరసింహారావు ఎంపికయ్యారు. అండర్ 17 బాలుర ఫ్రీ స్టెయిల్ విభాగంలో ఎం.నాగేంద్రబాబు, పి.రమేష్, జి.గోపయ్య, ఇ రాజేష్, అండర్ 17 బాలుర గ్రీకో రోమన్ స్టెయిల్లో కె.దిలీప్‌కుమార్, బి.అబేజ్, ఎం.వంశీ, ఎ.సిద్దార్ధ, ఎం.రత్నకుమార్, పి.నాగరాజు ఎంపికయ్యారు. వీరికి శిక్షణ ఇచ్చిన పీడీ జి.భూషణం, పీఈటీ శ్రీనివాసులు ఎంపికైన క్రీడాకారులను ప్రిన్సిపాల్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ జాన్‌వెస్లీ, ఉపాధ్యాయులు అభినందించారు. -
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
గుంటూరు : గుంటూరు జిల్లా కారంపూడి పట్టణంలో కుటుంబ కలహాలతో దంపతులు గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఫైనాన్స్ వ్యాపారంతో పాటు బియ్యం వ్యాపారం చేసే గుండా ప్రసన్నాంజనేయులు (44), స్రవంతి దంపతులకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబకలహాల కారణంగా ఇద్దరూ గురువారం వేకువజామున ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నారుల ఏడుపులు విని ఇరుగు పొరుగువారు వెళ్లి చూడగా దంపతులు ఇద్దరూ ఫ్యానుకు వేలాడుతున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పందెం కోళ్లు కాదు..!
కారంపూడి: కరంపూడిలోని పశు వైద్యశాలలో మంగళవారం సంక్రాంతి సంబరాల సందర్భంగా కోళ్ల ప్రదర్శనకు వచ్చిన పుంజులివి. కట్టేసి ఉన్నా కొట్లాటకు దిగాయి. ఈ ఫ్రీ షోను అక్కడున్న వారు సరదాగా తిలకించారు. చారిత్రక పల్నాటి పోతుగడ్డపై సంక్రాంతి సందర్భంగా పశువైద్యశాఖ నిర్వహించిన ప్రదర్శనలో యాదృచ్ఛికంగా ఈ పోరాట దృశ్యాలు కనిపించాయి. జాతి కోళ్లు, విత్తనపు పొట్టేళ్లు, దూడలు, ఆవులు, కోడె దూడలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. అందంగా ఉన్న వాటికి పశు వైద్యాధికారి పద్మావతి, సర్పంచ్ యేసురత్నం, ఎంపీపీ నాగులునాయక్, తహశీల్దార్ స్వర్ణలతమ్మ, ఎంపీడీవో హీరాలాల్, ఎంపీటీసీ సభ్యులు బొమ్మిన సావిత్రి అల్లయ్య, ఖాసిమ్, జ్యోతీబాయి తదితరులు పాల్గొన్నారు. -
మాట్రిక్స్ బయోమాస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
గుంటూరు: మాట్రిక్స్ బయోమాస్ పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. గుంటూరు జిల్లాలోని కారంపూడిలో ఓ పరిశ్రమలో వ్యర్ధ పదార్థాలతో విద్యుదుత్పత్తి జరుగుతోంది. విద్యుదుత్పత్తికి అవసరమైన వ్యర్ధ పదార్ధాలకు నిప్పు అంటుకోవడంతో పరిశ్రమలో మంటలు రేగినట్టు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నిప్పు పెట్టారా ? లేక ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. (కారంపూడి) -
ఓటర్లకు నకిలీ నోట్లు పంపిణీ
కారంపూడి, న్యూస్‌లైన్ :టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి ఓటర్లకు నకిలీ నోట్లు పంచారు. దీంతో మిగతా ఓటర్లు కూడా తమకిచ్చిన నోట్లను తనిఖీ చేసుకున్నారు. దాదాపు చాలా మందికి నకిలీవి దర్శనమిచ్చాయి. గ్రామంలోని వడియరాజుల కాలనీ, వినుకొండ రోడ్డు, ముస్లిం బజారులో నకిలీ నోట్లు వెలుగు చూశాయి. తొలుత వరికోత మిషన్ బ్రోకర్‌కు వినుకొండ రోడ్డులో ఒక రైతు రెండు వేలు చెల్లించాడు. ఆ నోట్లు తీసుకున్న బ్రోకర్ ఇవి నకిలీ నోట్లని తెలపడంతో సదరు రైతు అవాక్కు అయ్యాడు సోమవారం రాత్రి టీడీపీ వాళ్లు ఓట్ల వేయమని ఈ డబ్బు ఇచ్చారని తెలిపి వేరే నోట్లు ఇచ్చాడు. విషయం బయటకు రావడంతో మిగతా వారు చెక్ చేసుకున్నారు. దీంతో మరికొన్ని చోట్ల బయట పడ్డాయి. మంగళవారం రెండో విడత డబ్బు పంపిణీకీ ఉపక్రమించినప్పుడు ఓటర్లు ప్రశ్నించడంతో డబ్బు పంపిణీ చేస్తున్న వ్యక్తులు అక్కడ నుండి జారుకున్నారు. మళ్లీ వచ్చి అసలు నోట్లు పంపిణీ చేశారని తెలిసింది. కారంపూడిలో బయట పడిన నోట్లలో 9డీఇ705239, 6ఇఏ 508575, 9బీపీజె29003 సీరియల్ నంబర్లున్నాయి. ఎన్నికల్లో ఓటర్ల పంపిణీకి కోయంబత్తూరును నుంచి వీటిని తీసుకు వచ్చారని తెలుస్తోంది. గ్రామాల్లో దొంగనోట్ల హల్చల్.. మాచవరం: మండలంలోని కొన్ని గ్రామాల్లో దొంగ నోట్లు హల్చల్ చేస్తూ ఓటర్లను బెంబేలెత్తిస్తున్నాయి. మండలంలోని మోర్జంపాడు, మల్లవోలు తదితర గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు దొంగనోట్లను ఓటర్లకు పంచినట్లు పలువురు తెలిపారు. పేదలు వారికి కావాల్సిన సామగ్రి కొనుగోలు చేసేందుకు పలు దుకాణాలకు వెళితే అవి చెల్లవని, దొంగ నోట్లని దుకాణాదారులు తెలపడంతో నోట్లను తిరిగి పార్టీ నాయకులకే ఇస్తున్నారు. -
రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
కారంపూడి, న్యూస్‌లైన్ :కారంపూడిలోని రేషన్ దుకాణాలపై గుంటూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కారంపూడిలో నాలుగు షాపులను తనిఖీ చేసేందుకు వెళ్లారు. వీటిలో రెండు షాపులకు తాళాలు వేసి ఉన్నాయి. షాపు నం 32లో రెండున్నర క్వింటాళ్ల బియ్యం వ్యత్యాసాన్ని గుర్తించామని, మరో షాపులో వ్యత్యాసం ఏమీ లేదని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎన్.కిశోర్‌కుమార్ తెలిపారు. అనంతరం వేపకంపల్లె గ్రామంలోని రేషన్ షాపు నం. 26లో తనిఖీ చేస్తున్నారు. అక్కడ స్టాకులో వ్యత్యాసాలు ఉన్నాయని, తుది నివేదికకు కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. దాడుల్లో విజిలెన్స్ హెడ్‌కానిస్టేబుల్ మహేశ్వరరావు, వీఆర్వో పసుపులేటి సైదులు, సిబ్బంది పాల్గొన్నారు. రెండు రేషన్ షాపుల సీజ్.. మంచికల్లు (రెంటచింతల),న్యూస్‌ైలైన్: మంచికల్లు గ్రామంలోని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రెండు రేషన్ షాపులను సీజ్‌చేసినట్లు విజిలెన్స్ సీఐ కె.వంశీధర్ బుధవారం తెలిపారు. విజిలెన్స్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆయన ఆదేశాలతో గ్రామంలోని 16, 17 నంబర్ రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ దాడుల్లో 16వ రేషన్ షాపులో 104 కేజీల బియ్యం, 64 కేజీల పంచదార, షాపున ంబర్ 17లో 12 క్వింటాళ్ల బియ్యం, 167 కేజీల పంచదార నిల్వ ఉండాల్సిన దాని కన్నా తగ్గినట్లు గుర్తించారు. దీంతో ఆ షాపులపై 6-ఎ కేసులు నమోదుచేసి సీజ్ చేసినట్లు సీఐ వంశీధర్ తెలిపారు. సరుకును రెవెన్యూ ఇన్స్పెక్టర్ కటికల బాలయ్యకు స్వాధీనపరిచామన్నారు. -
మూడు నెలల్లో అదనపు వసతి
కారంపూడి, న్యూస్‌లైన్ :గిరిజన బాలుర వసతి గృహ విద్యార్థులకు మూడు నెలల్లో అదనపు వసతిని ఏర్పాటు చేస్తామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి విజయకుమార్ హామీ ఇచ్చారు. సం‘క్షోభ’ హాస్టళ్లు శీర్షికన శనివారం ‘సమర సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా కలెక్టర్ సురేశ్ కుమార్ స్పందించారు. హాస్టళ్లలోని విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకుని ఓ నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి విజయకుమార్ కారంపూడిలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. హాస్టళ్ల మరమ్మతుల కోసం రూ.78 లక్షలు మంజూరై ఉన్నాయన్నారు. కలెక్టర్ అనుమతితో ఇక్కడ అదనపు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శాశ్వత భవన నిర్మాణానికి ఉప ప్రణాళికలో నిధులు కోరతామన్నారు. ఏడు ప్రభుత్వ శాఖల సహకారంతో గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు. విద్యార్థులతో ముఖాముఖి.. గిరిజన బాలుర వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా గిరిజన సంక్షేమ అధికారి విజయకుమార్ విద్యార్థుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో పెట్టెలు పెట్టుకోవడానికే సరిపోవడంలేదని, గత్యంతరం లేక చలిలో నిద్రిస్తున్నామని, వర్షం పడినపుడు పక్కనే ఉన్న జెడ్పీ హైస్కూల్లో పడుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. అనంతరం ఆయన హాస్టల్ రికార్డులను పరిశీలించా రు. గిరిజన బాలికల వసతి గృహాన్ని పరి శీలించారు. కొన్నిచోట్ల నూతన లైట్లు, కిటికీలకు దోమ తెరలు ఏర్పాటు చేశారు. ఆయనతోపాటుఅసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫే ర్ ఆఫీసర్ ఎంవీ రమేష్ కూడా వచ్చారు.