రణక్షేత్రంలో ఉప్పొంగిన ఉత్సాహం.. వైభవంగా వీరారాధనోత్సవాలు | Palnadu Veera Aradhana Utsavam 2022: Rayabaram Ghattam | Sakshi
Sakshi News home page

రణక్షేత్రంలో ఉప్పొంగిన ఉత్సాహం.. వైభవంగా వీరారాధనోత్సవాలు

Published Fri, Nov 25 2022 6:28 PM | Last Updated on Fri, Nov 25 2022 6:28 PM

Palnadu Veera Aradhana Utsavam 2022: Rayabaram Ghattam - Sakshi

పల్నాటి రణక్షేత్రం కారంపూడి కత్తిగట్టి కదంతొక్కిందా.. వీరావేశంతో నాగులేరు ఉవ్వెత్తున ఉప్పొంగిందా.. బ్రహ్మనాయుడి ఉగ్రనృసింహకుంతం సమరనాదం మోగిస్తూ ముందుకురికిందా.. పల్నాటి పౌరుషాగ్నిని రగిలించిందా.. అన్నట్టు పోరాటాల పురిటిగడ్డ పల్నాడు గర్జించింది. వీరారాధనోత్సావాలతో ప్రతిమదీ పులకించింది. వీరుల 
కొణతములతో వీరంగమాడింది.  

కారంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాల రెండో రోజు రాయబారం ఘట్టం వైభవంగా జరిగింది. వీరాచారవంతులు వీరుల కొణతములతో కదంతొక్కారు. ఎదురు రొమ్ములపై బాదుకుంటూ కత్తిసాము చేశారు. వీరుల గుడిలో కొలువుదీరిన ఆయుధాలకు పూజలు చేశారు. రెండుగంటల పాటు కత్తుల సేవ చేశారు. అనంతరం గ్రామోత్సవానికి బయలు దేరారు. వీరులు కొందరు వీరావేశంతో ఊగిపోతుంటే బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం వారిపై వాలి ఓదార్చే ఘట్టం అబ్బురపరిచింది. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం బయట, బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయంలో వీరాచారవంతులు కత్తి సేవ చేశారు. చిన్న పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఉగ్ర రూపులై ఉత్సవంలో పాలుపంచుకున్నారు.  


చెన్నకేశవుని దీవెనలు పొంది 

చెన్నకేశవస్వామి, అంకాలమ్మ చెంతకు ఒక్కో ఆచారవంతుడు ఆయుధంతో వెళ్లి వారి దీవెనలు పొందారు. గంటలు గణగణ మోగిస్తూ జై చెన్నకేశవ అంటూ నినదించారు. గోవింద నామస్మరణలు చేశారు. అనంతరం పీఠాధిపతి పిడుగు తరుణ్‌ చెన్నకేశవ ఇంటి వద్దకు చేరుకుని అక్కడ కొద్ది సేపు కత్తి సేవ చేశారు. రణక్షేత్ర వీధులు సంప్రదాయ డోలు, వీరు జోళ్ల వాయిద్యాలు, సన్నాయి మేళాలతో మార్మోగాయి. ఆయుధాలతో వీరులు చేసిన గ్రామోత్సవం ఆద్యంతం నాటి పోరాటాన్ని కళ్లకుకట్టింది. వీరుల గుడి నుంచి బస్టాండ్‌ సెంటర్‌ మీదుగా చెన్నకేశవస్వామి, అంకాలమ్మ ఆలయాలకు చేరుకుని కోట బురుజు మీదుగా పీఠాధిపతి ఇంటి వరకు, అక్కడి నుంచి మళ్లీ వీరుల గుడి వరకు గ్రామోత్సవం కొనసాగింది. వీరుల ఆయుధాలకు కారంపూడి ప్రజలు నీరాజనాలు పలికారు. వారుపోసి కొబ్బరి కాయలు కొట్టి ఆశీస్సులు పొందారు.  


ఆయుధాలకు పంచామృతాభిషేకాలు 

పల్నాటి వీరాచారవంతులు పల్నాటి రణక్షేత్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే వారు తొలుత తలనీలాలు సమర్పించి నాగులేరులో స్నానం చేశారు. నాగులేరు గంగధారి మడుగులో ఆయుధాలను శుభ్రం చేసుకున్నారు. కొందరు పంచామృతాలతో వీరుల ఆయుధాలను నాగులేరులో అభిషేకించడం విశేషం. నూతన వస్త్రాలతో పూజ కట్టుకున్నారు. వీరంతా ఒకేసారి ఆయుధాలను వీరుల గుడిలో ఉంచి పొంగళ్లు చేసుకుని  వీర్ల అంకాలమ్మ, చెన్నకేశవస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. గురువారం తెల్లవారు జాము వరకు కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరాచారవంతులు వస్తూనే ఉన్నారు. శుక్రవారం కూడా మరికొందరు రానున్నారు. 

రాయబారం కథాగానం 
రెండో రోజు రాయబారం చారిత్రక ఘట్టం నేపథ్యంలో వీరుల గుడిలో రాత్రి అలరాజు రాయబారం కథాగానాన్ని వీరవిద్యావంతులు గానం చేశారు.  వేదనాభరితమైన ఈ ఘట్టం గుండెలను పిండేసింది.  

మందపోరు ఘట్టం.. చాపకూడు 
పల్నాటి వీరారాధనోత్సవాలలో 3వ రోజు శుక్రవారం మందపోరు ఘట్టం జరగనుంది. ఈ రోజు బ్రహ్మనాయుడు చాపకూడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోపాటు ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు పది వేల మంది సహపంక్తి భోజనాలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ చేయూతతో ఈ కార్యక్రమం జరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement