కారంపూడి మండల మ్యాప్‌లో ఈనాటికి కన్పిస్తున్న సింగరుట్ల, వీరలక్ష్మీపురం గ్రామాలు
సాక్షి, అమరావతి బ్యూరో/కారంపూడి: పాడి–పంట.. పక్షుల కిలకిలారావాలు.. రచ్చబండలు.. అమ్మలక్కల ముచ్చట్లు.. ఇవీ పల్లెలకు ప్రతిరూపాలు. కానీ, ఊరు ఉండి ఆ ఊర్లో ఇవేమీ లేకపోతే..? అచ్చం ఇలాంటివే రెండు ఊర్లు గుంటూరు జిల్లా కారంపూడి మండలంలో ఉన్నాయి. ఒకటి సింగరుట్ల అయితే రెండోది వీరలక్ష్మీపురం. ఇక్కడ జనావాసాలు అంతరించినా అనేక శతాబ్దాలుగా ఆ గ్రామాల పేర్లు మాత్రం సజీవంగా ఉంటూ వస్తున్నాయి. ఈ విశేషమేంటో.. స్థానికంగా ప్రచారంలో ఉన్న చరిత్ర ఏమిటంటే..
రూపం చెడినా ఆనవాళ్లున్నాయి
పల్నాటి యుద్ధం (క్రీ.శ 1182) అనంతరం వీరలక్ష్మీపురం అగ్రహారం కనుమరుగు కాగా, ఉగ్రనారసింహుని ఆగ్రహానికి గురై సింగరుట్ల భౌతిక రూపం లేకుండాపోయిందనే గాథ స్థానికంగా ప్రచారంలో ఉంది. సింగరుట్లలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం గతకాల వైభవానికి ప్రతీకగా కన్పిస్తోంది. ఆ గ్రామ పుట్టుక నుంచి కాలగర్భంలో కలసిపోయే వరకు అంతా స్వామి మహిమతోనే జరిగినట్లు స్వామివారి స్థల పురాణం చెబుతోంది. ఆ గ్రామ ఉనికి నిజమని తెలిపేందుకు అక్కడికి సమీపంలోనే అదే పేరుతో సింగరుట్ల తండా ఒకటి ఉంది. అలాగే, వీరలక్ష్మీపురం గ్రామం కాలగర్భంలో కలిసిపోయినా దానికి పడమరగా లక్ష్మీపురం పేరుతో కొత్త గ్రామం ఉంది.
సింగరగూడెమే సింగరుట్లగా..
కారంపూడికి సమీపంలోని నల్లమల అడవిలో నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడు. ఆహార సేకరణ నిమిత్తం వేటకు వచ్చిన చెంచులు స్వామివారిని గుర్తించకుండా అపరాధం చేశారని, వారిపై తేనేటీగలు దాడిచేసి ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టిన విషయాన్ని చెంచులు వారి నాయకుడు సింగరకు తెలపగా, సింగర ఆ ప్రాంతాన్ని పరిశీలించి కొండరాతిపై ఉగ్రనారసింహుని రూపాన్ని చూశాడని, ఇక అప్పటినుంచి ఆయన్ను కొలుస్తూ అక్కడే గూడేన్ని ఏర్పాటుచేసుకున్నాడని.. ఆదే సింగరగూడెమని కాలక్రమంలో సింగరుట్లగా నామాంతరం చెందినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత కాలంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు స్వామివారికి 7,700 ఎకరాల భూమిని ఈనాంగా సమర్పించి, పూజించాడని చారిత్రక ఆధారం ఉంది. తర్వాత కాలంలో సింగరుట్ల అగ్రహారికులు స్వామివారి మాన్యాలను ఆక్రమించుకుని చివరకు స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు లేకుండా చేయడంతో ఉగ్రనారసింహుడు ఆగ్రహించి సింగరుట్ల గ్రామ రూపరేఖలు లేకుండా చేశాడనే పురాణ గాథ ఉంది.
వీరలక్ష్మీపురం.. రికార్డుల్లో పదిలం
ఇక పల్నాటి చరిత్ర కాలంలో వీరలక్ష్మీపురం అగ్రహారంగా వర్థిల్లింది. ఇది 581.14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఊరు కాలగమనంలో కలిసిపోయినా గ్రామం సరిహద్దులు మాత్రం చెక్కుచెదరలేదు. ఇక్కడున్న భూములు సేద్యం చేస్తున్న క్రమంలో అనేక దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. వాటిలో వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, పోలేరమ్మ విగ్రహాలున్నాయి. ఇక్కడ లభ్యమైన విగ్రహాన్నే అగ్రహారం పొలాల్లో వేపకంపల్లి, ఒప్పిచర్ల గ్రామస్తులు ప్రతిష్ఠించారు. వీరలక్ష్మీపురంలో వీరాంజనేయస్వామి దేవాలయం నేటికీ అలనాటి చరిత్రకు సాక్షిగా కన్పిస్తోంది. పల్నాటి చరిత్ర కాలంలో పేర్కొన్న 194 గ్రామాల్లో వీరలక్ష్మీపురం అగ్రహారం కూడా ఒకటి.
సింగరుట్లలోని నరసింహస్వామి ఆలయం
Comments
Please login to add a commentAdd a comment