కోడిపోరుకు పుంజులను వదులుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత చలమారెడ్డి
కారంపూడి (మాచర్ల): పల్నాటి వీరారాధనోత్సవాల్లో ప్రధానమైన కోడిపోరు ఉత్సవం సందర్భంగా ఆదివారం గుంటూరు జిల్లా కారంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. కోడిపోరు ఉత్సవ వేదికగా టీడీపీ నాయకులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టే చర్యలకు దిగారు. తోపులాటలు చోటుచేసుకున్నాయి. గొడవలు జరగకుండా వీరులగుడి ఆవరణలోకి ఎవరూ పార్టీ జెండాలతో ప్రవేశించకుండా, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా అధికారులు చర్యలు చేపట్టగా వైఎస్సార్‌సీపీ కట్టుబడింది. ఆ ప్రకారమే వైఎస్సార్‌సీపీ శాసన సభ పార్టీ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ గురజాల నాయకులు ఎనుముల మురళీధరరెడ్డి పార్టీ శ్రేణులు జెండాలను గుడి బయటే ఉంచి వీరులగుడి ప్రాంగణంలోని కోడిపోరు గరిడీకి చేరుకున్నారు.
పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి సహా ఏడుగురిని గరిడీలోకి అనుమతించారు. ఎమ్మెల్యే పీఆర్కే.. బ్రహ్మనాయుడు పక్షం వైపు పోటీకి దిగి పీఠాధిపతి పిడుగు తరుణ్‌చెన్నకేశవతో ఆశీనులయ్యారు. కొద్దిసేపటికి మాచర్ల టీడీపీ ఇన్‌చార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి డీజే ర్యాలీతో వీరులగుడి వరకు వచ్చారు. అయితే కొందరు పార్టీ నేతలు మెడలో పార్టీ కండువాలు, జెండాలతో గుడిలోకి నినాదాలతో దూసుకొచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు తాము కూడా జెండాలతో వస్తామని బయలుదేరడం, రెండు పార్టీల వారు వందలాదిగా ఎదురుపడడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాహాబాహీ తలపడే పరిస్థితి వచ్చింది. ఉత్సవాల పవిత్రతను దెబ్బతీస్తారా? అని వైఎస్సార్ సీపీ శ్రేణులు టీడీపీ నేతలపై ఆగ్రహించారు. టీడీపీ నేతలు దౌర్జన్యానికి సిద్ధపడ్డారు.
పార్టీ జెండాలతో వస్తున్న టీడీపీ కార్యకర్తలు
సీఐ, ఎస్‌ఐ, పోలీసులకు పరిస్థితిని అదుపు చేయడం కష్టమైంది. పోలీసులు ఎంత యత్నించినా టీడీపీ నాయకులు ఒకటిరెండు జెండాలు ప్రాంగణంలో ప్రదర్శించారు. అప్పటిదాకా మిన్నకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు జైజగన్ అంటూ నినదించారు. ప్రతిగా టీడీపీ నాయకులు ఎవరికి నచ్చిన నాయకునికి వారు జిందాబాద్‌లు కొట్టారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ పార్టీ శ్రేణులకు సర్దిచెప్పి, ఉద్రిక్తత తగ్గేలా చూశారు. అనంతరం బ్రహ్మనాయుడు పుంజు చిట్టిమల్లుతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నాగమ్మ పుంజు శివంగిడేగతో చలమారెడ్డి పోటీలకు సిద్ధమయ్యారు. అంతకు ముందు వీరవిద్యావంతులు కోడిపోరు కథాగానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment