ఓటర్లకు నకిలీ నోట్లు పంపిణీ
కారంపూడి, న్యూస్‌లైన్ :టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి ఓటర్లకు నకిలీ నోట్లు పంచారు. దీంతో మిగతా ఓటర్లు కూడా తమకిచ్చిన నోట్లను తనిఖీ చేసుకున్నారు. దాదాపు చాలా మందికి నకిలీవి దర్శనమిచ్చాయి. గ్రామంలోని వడియరాజుల కాలనీ, వినుకొండ రోడ్డు, ముస్లిం బజారులో నకిలీ నోట్లు వెలుగు చూశాయి. తొలుత వరికోత మిషన్ బ్రోకర్‌కు వినుకొండ రోడ్డులో ఒక రైతు రెండు వేలు చెల్లించాడు. ఆ నోట్లు తీసుకున్న బ్రోకర్ ఇవి నకిలీ నోట్లని తెలపడంతో సదరు రైతు అవాక్కు అయ్యాడు సోమవారం రాత్రి టీడీపీ వాళ్లు ఓట్ల వేయమని ఈ డబ్బు ఇచ్చారని తెలిపి వేరే నోట్లు ఇచ్చాడు. విషయం బయటకు రావడంతో మిగతా వారు చెక్ చేసుకున్నారు. దీంతో మరికొన్ని చోట్ల బయట పడ్డాయి. మంగళవారం రెండో విడత డబ్బు పంపిణీకీ ఉపక్రమించినప్పుడు ఓటర్లు ప్రశ్నించడంతో డబ్బు పంపిణీ చేస్తున్న వ్యక్తులు అక్కడ నుండి జారుకున్నారు. మళ్లీ వచ్చి అసలు నోట్లు పంపిణీ చేశారని తెలిసింది. కారంపూడిలో బయట పడిన నోట్లలో 9డీఇ705239, 6ఇఏ 508575, 9బీపీజె29003 సీరియల్ నంబర్లున్నాయి. ఎన్నికల్లో ఓటర్ల పంపిణీకి కోయంబత్తూరును నుంచి వీటిని తీసుకు వచ్చారని తెలుస్తోంది.
గ్రామాల్లో దొంగనోట్ల హల్‌చల్..
మాచవరం: మండలంలోని కొన్ని గ్రామాల్లో దొంగ నోట్లు హల్‌చల్ చేస్తూ ఓటర్లను బెంబేలెత్తిస్తున్నాయి. మండలంలోని మోర్జంపాడు, మల్లవోలు తదితర గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు దొంగనోట్లను ఓటర్లకు పంచినట్లు పలువురు తెలిపారు. పేదలు వారికి కావాల్సిన సామగ్రి కొనుగోలు చేసేందుకు పలు దుకాణాలకు వెళితే అవి చెల్లవని, దొంగ నోట్లని దుకాణాదారులు తెలపడంతో నోట్లను తిరిగి పార్టీ నాయకులకే ఇస్తున్నారు.