దేశం..అధికార దర్పం
సాక్షి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికల్లో ఆధిక్యం చాటుకున్న టీడీపీ ఇప్పుడు స్థానిక పాలనలో ముఖ్యమైన పరిషత్తు పీఠాల్ని కైవసం చేసుకునేందుకు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తోంది. జిల్లాలో ‘హంగ్’ ఏర్పడిన మండలాల్లో సంఖ్యాబలాన్ని సమీకరించేందుకు తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. వైఎస్సార్ సీపీ మెజార్టీ సాధించిన మండలాల్లోనూ తమ ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కైనా అధికార పీఠాన్ని సాధించేందుకు ఎత్తులు వేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశంతోనే నేతలు మండల పరిషత్తుల్ని కైవసం చేసుకునేందుకు ఎంపీటీసీలతో రాయ‘బేరాలు’ సాగిస్తున్నారు. గెలుపొందిన ఇండిపెండెంట్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలపై సామ, భేద, దాన, దండోపాయాల్ని ప్రయోగిస్తున్నారు. అధికారంలోకొచ్చినా, స్థానిక పాలనపై పట్టు లేకపోతే ఏమీ సాధించలేమని గెలుపొందిన వారికి నజరానాల ఎర వేస్తున్నారు. స్థానిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినా జూన్ 2 తర్వాతే పాలకవర్గాలు పగ్గాలు చేపట్టే వీలుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం తర్వాతే పాలకవర్గాలు కొలువుతీరనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిషత్తులకు ఎమ్మెల్యే, ఎంపీల ఓటు అవసరం లేకున్నా, మున్సిపల్ పాలకవర్గాలు కొలువుతీరిన తర్వాతే పరిషత్తు పాలకవర్గాలు పదవులు చేపట్టే అవకాశం ఉంది. దీంతో గెలుపు కిక్కుతో ఉన్న తెలుగు తమ్ముళ్లు శిబిరాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.
స్వతంత్రులపై తీవ్ర ఒత్తిళ్లు
జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 11 చోట్ల టీడీపీ మెజార్టీ సాధించింది. జిల్లాలో ఒక్క తాడేపల్లి మున్సిపాలిటీలో మాత్రం టీడీపీ మట్టి కరిచింది. ఇక జిల్లాలోని 57 మండలాల్లో 30 మండల పరిషత్తుల్ని టీడీపీ కైవసం చేసుకోగా, వైఎస్సార్ సీపీ 22 మండల పరిషత్తులలో గెలుపొందింది. అన్ని మండలాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లు వైఎస్సార్ సీపీ, టీడీపీ నడుమే సాగింది. రెండు నియోజకవర్గాల్లోని మండలాల్లో వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మంగళగిరి, నరసరావుపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధించారు. బాపట్ల, పిట్టలవానిపాలెం, ప్రత్తిపాడు, అచ్చంపేట నాలుగు మండల పరిషత్తులు హంగ్ దిశగా ఫలితాలు సాధించడంతో వీటిపై తెలుగు తమ్ముళ్ళు కన్నేశారు. కొన్ని మండలాల్లో వైఎస్సార్ సీపీ ఇండిపెండెంట్ల సహకారంతో పరిషత్తు పీఠాల్ని కైవసం చేసుకోనుండగా, ఇండిపెండెంట్లపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు.
మంగళగిరిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాబు
గుంటూరు-విజయవాడ నడుమ రాజధాని ఏర్పాటు అంటూ టీడీపీ వర్గాలు గత మూడ్రోజుల్నుంచీ ప్రచారం తీవ్రతరం చేశాయి. మంగళగిరి నియోజకవర్గంలో మండల పరిషత్తులు, అధిక పంచాయతీలు వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. ఈ నియోజకవర్గంలో రెండు మునిసిపాలిటీలలో మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ ఆధిక్యం సాధించింది. వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, మిగిలిన పార్టీలు కలిస్తే టీడీపీకి గడ్డు కాలమే. తాడేపల్లి మున్సిపాలిటీలో టీడీపీ చావుదెబ్బ తింది. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ నేతల భూ దందాలు ఈ ప్రాంతంలోనే నిర్వహిస్తుండటంతో ఎలాగైనా మంగళగిరి మండలాన్ని కైవసం చేసుకునేందుకు వైఎస్సార్ సీపీ నేతల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మంగళగిరి విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్‌గా ఉండటంతో తెలుగు తమ్ముళ్ళు అంతర్మథనం చెందుతున్నారు. శిబిరాలకు ప్రతినిధుల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేయడం పరిశీలనాంశం.