గుంటూరులో ఖాళీ చేసిన టిడిపి కార్యాలయం
గుంటూరు: పోలింగ్ ప్రారంభం కాకముందే గుంటూరులో ఏర్పాటు చేసిన టిడిపి కార్యాలయాన్ని ఖాళీ చేశారు. ఇక్కడ మాజీ మంత్రి గల్లా అరుణ కుమారుడు, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ లోక్సభ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడ అట్టహాసంగా టిడిపి కార్యాలయాన్ని జయదేవ్ ఏర్పాటు చేశారు. ఏం జరిగిందో ఏమో ఆ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్ మొత్తాన్ని కూడా తీసుకువెళ్లారు. కుర్చీలు, ఎల్సిడి టీవీలు తీసివేశారు. కార్యాలయానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకు అక్కడ బోసిగా కనిపిస్తోంది. దాంతో వారు నిరుత్సాహానికి లోనయ్యారు. వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.
కార్యాలయం ఖాళీ చేయడమే కాకుండా జయదేవ్ కూడా కనిపించకుండా వెళ్లిపోయారు. రెండు జిల్లాల అవతల నుంచి వచ్చిన జయదేవ్కు ఇక్కడ కార్యకర్తల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. దాంతో జయదేవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదీగాక పొన్నూరు టిడిపి అభ్యర్ధి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్కు, జయదేవ్కు మధ్య ఈ ఉదయం వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. దాంతో జయదేవ్ మనఃస్థాపానికి గురైనట్లు చెబుతున్నారు. కార్యాలయం ఖాళీ చేయడం, అభ్యర్థి కనిపించకుండా పోవడంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇదిలా ఉండగా, కార్యాలయం ఖాళీ చేసిన దృశ్యాలు సాక్షి టీవీలో ప్రసారం కావడంతో ఫర్నిచర్‌ను తిరిగి తరలించారు. మళ్లీ ఎక్కడ కుర్చీలు అక్కడ వేశారు.