వైద్యశాలలో గాయపడిన వారిని పరామర్శిస్తున్న డాక్టర్ గోపిరెడ్డి
రొంపిచర్ల: పోలింగ్ సందర్భంగా జరిగిన వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని మండలంలోని తుంగపాడులో వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఇళ్లపై తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం దాడి చేసి ఇద్దరిని గాయపరిచారు. ‘వైఎస్సార్ సీపీ తరఫున ఏజెంట్లుగా కూర్చొని ఓట్లు వేయిస్తారా... మీ సంగతి చూస్తా’ నంటూ గొట్టిపాటి హరిబాబు, వెంకటేష్‌లపై దాడి చేసి గాయపర్చారు. అడ్డొచ్చిన వారిని కూడా బెదిరించారు. దాడి చేసిన వారిలో గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు వై. నాగరాజు, సాయి, టి.నాగేశ్వరరావు, ఎ.కృష్ణతో పాటు మరికొందరు ఉన్నట్లు బాధితులు తెలిపారు. గాయపడిన హరిబాబు నరసరావుపేట ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.
ఎమ్మెల్యే పరామర్శ
తెలుగుదేశం గూండాల దాడిలో గాయపడి నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరిబాబును ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారనే అక్కసుతో దాడులు చేయడం హేయమైన చర్య అని ఖండించారు. దళితులు గ్రామంలోకి, పనులకు రావద్దని మోటార్ల సైకిళ్లపై వారి ఇళ్ల ముంగిట ర్యాలీలు నిర్వహించడం మానుకోవాలన్నారు. ఇకపై ఇలాంటివి జరిగితే సహించేది లేదని గోపిరెడ్డి హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులకు ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట గ్రామ మాజీ సర్పంచ్ గొట్టిపాటి శ్రీనివాసరావు, కాకుమాను బాలహనుమంతారెడ్డి, మంగపతి రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment