గురజాల పట్టణంలో ముస్లింల ఇళ్ళపై రాళ్ళు, కర్రలతో దాడులు చేస్తున్న టీడీపీ వర్గీయులు
సాక్షి, గుంటూరు: ఓటమి భయంతో గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులు విధ్వంసాలకు తెగబడ్డారు. పోలింగ్‌కు విఘాతం కలిగించేందుకు కుట్రలకు తెరతీశారు. పోలింగ్ కేంద్రాల్లోకి రాకుండా వైఎస్సార్‌సీపీ ఏంజెంట్లను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నరసరావుపేట నియోజకవర్గం యలమందలో పోలింగ్ కేంద్రానికి ఏజెంట్లతో వెళ్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కారుపై దాడిచేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనలో గోపిరెడ్డికి గాయాలయ్యాయి. ఆయన వెంట ఉన్న ముగ్గురు ఏజెంట్లను కారులోంచి లాగిపడేశారు. అనంతరం 225, 226 పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఆరుగురు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు లాక్కొచ్చి దాడిచేశారు. వారిలో బోయపాటి నరసింహారావు, గార్లపాటి అంజయ్య, ముప్పాళ్ల నాగరాజులను కిడ్నాప్ చేసి.. మధ్యాహ్నం వరకూ వారిని బంధించి, తీవ్రంగా కొట్టారు. గురజాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్, ఆయన కుమారుడి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు. ఆయన కారును ధ్వంసం చేశారు. వేమూరు మండలం బూతుమల్లి గ్రామంలో సైక్లింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ నాయకులను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆయనను రెండు గంటలపాటు దిగ్బంధించారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ మేరుగ తన అనుచరులతో కలిసి బూతుమల్లి కాలువ వద్ద రోడ్డుపై బైఠాయించారు. పొన్నూరు నియోజకవర్గం నిడుబ్రోలు గ్రామంలో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు పోలింగ్ బూత్‌లోకి చొరబడి పోలింగ్ ఆఫీసర్లు, కానిస్టేబుళ్లను బయటికి లాగిపడేసి యథేచ్ఛగా సైక్లింగ్‌కు పాల్పడ్డారు.
గురజాలలో గుండాగిరి
గురజాలలో టీడీపీ గుండాలు విధ్వంసం సృష్టించారు.. తమకు ఓట్లు వేయలేదన్న అక్కసుతో ముస్లిం మైనార్టీల ఇళ్లపై రాళ్లదాడికి తెగబడ్డారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా దాడులకు తెగబడ్డారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన సుమారు 500 మంది కర్రలు, కత్తులు, రాడ్లతో గురజాల పట్టణంలో మూడు గంటలపాటు వీరంగం సృష్టించారు. కిష్టయ్యబడిలో ఏర్పాటు చేసిన 29వ నంబరు పోలింగ్ బూత్‌లో గురువారం వైఎస్సార్‌సీపీ తరఫున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్న ముస్లిం యువకులను టీడీపీ నేతలు ఈడ్చి బయటపడేసి తీవ్రంగా కొట్టి బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడ్డారు. ముస్లింలంతా ఏకమై వైఎస్సార్‌సీపీ తరఫున గట్టిగా నిలబడి ఓటింగ్‌లో పాల్గొనడంతో.. తమకు ఓట్లు వేయలేదనే అక్కసుతో ముస్లింలను దూషిస్తూ వారిపై దాడులు చేశారు. దాడుల్లో గాయపడ్డ ముస్లిం యువకులను పరామర్శించేందుకు గురువారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ముస్లింల ఇంటికి వెళ్లారు. దీన్ని గమనించిన టీడీపీకి చెందిన ఓ సామాజికవర్గం నేతలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా నగరం మండలంలోని జిల్లేపల్లి గ్రామంలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలపైనే లాఠీచార్జ్ చేశారు. పార్టీ కార్యకర్త మేరుగ శివరాంను విచక్షణారహితంగా కొట్టడంతో ఆయన తీవ్ర మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
మంగళగిరిలో అస్తవ్యస్తం
మంగళగిరి: లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల అధికారుల వైఫల్యంతో ఆగ్రహం చెందిన పలువురు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుతిరిగారు. కొన్నిచోట్ల పోలింగ్ గంటకుపైగా ఆలస్యమైంది. కొన్ని ఈవీఎంలు మొరాయించాయి. దాదాపు 50 బూత్‌ల్లో పోలింగ్ నిలిచిపోయింది. కొన్ని బూత్‌ల్లో మధ్యాహ్నం 12.30 గంటల వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు. ముస్లింలు, ఎస్సీ ఓటర్లు అధికంగా ఉన్న బూత్‌ల్లో ఈవీఎంలు పని చేయకపోవడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలో లోకేశ్ ఓటమి తప్పదని భావించిన సీఎం అధికారులపై ఒత్తిడి తెచ్చి పోలింగ్ ఆలస్యమయ్యేలా కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ బూత్‌ల పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి (ఆర్కే) అధికారుల తీరుపై ఓటర్లు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని సి.కె. హైస్కూలులో ఏర్పాటు చేసిన బూత్‌ల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఆగ్రహించిన ఆర్కే పోలింగ్ బూత్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment