‘పచ్చ’ నేతల పందేరాలు
సాక్షి, గుంటూరు :ఓట్ల కోసం టీడీపీ నేతలు పన్నుతున్న కుయుక్తులు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. గెలుపు కోసం అన్ని అడ్డదారులు తొక్కుతూ ఓటర్లను నానా రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికల నిబంధనల్ని తోసిరాజని సామాజిక వర్గాల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటమి తప్పదని తెలుస్తున్నా.. పైకి బీరాలు పలుకుతూ లోపల సొంత పార్టీ నేతలతో బేరాలు కుదుర్చుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏమిచ్చైనా ఓట్లను కొనేందుకు టీడీపీ నేతలు ప్రలోభాల్ని పదునెక్కిస్తున్నారు. ఓటుకు నోటు, మద్యం పంపిణీ, అనేక రకాల తాయిలాలు ఎర వేస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో పట్టపగలే నోట్ల కట్టల పాములు బుసలు కొడుతున్నాయి. ఓటర్లకు ఇన్వర్టర్లను పంపిణీ చేసేందుకు పెద్ద ఎత్తున లోడ్ పట్టణంలో నిల్వ ఉంచారు.
ఎండాకాలం కావడంతో కరెంటు కోతలతో సతమతమవుతున్న పట్టణ వాసులకు బ్యాటరీలతో పాటు ఇన్వర్టర్లను పంపిణీ చేసి ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఇందుకు ఎన్నికల్లో పోటీచేస్తున్న బ్యాటరీ కంపెనీ అధినేత ఎలాగైనా సరే మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ హవాను నిలువరించేందుకు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు. ఈ ప్రలోభాలపై జిల్లా ఎన్నికల అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పక్కా సమాచారం అందించినా పట్టుకునేందుకు ఏ మాత్రం ప్రయత్నించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మంగళగిరి పట్టణంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీచేసిన వ్యాపారికి సంబంధించిన గోడౌన్లలో బహుమతులు దాచి ప్రలోభ పెడుతున్నట్లు సమాచారం. భారీగా నగదు పంపిణీ పట్ట పగలే జరుగుతున్నా అధికారులు ఏ మాత్రం కన్నెత్తి చూడటం లేదు.
‘సామాజిక’ సమావేశాలు
మంగళగిరి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవికి మద్దతుగా అతని సామాజిక వర్గానికి చెందిన కొందరు ఏర్పాటు చేస్తున్న సమావేశాలు బెడిసికొడుతున్నాయి. గురువారం మంగళగిరిలోని ఓ కళ్యాణమండపంలో ఎన్నికల కోడ్ అతిక్రమించి చిరంజీవి వర్గీయులు నిర్వహించిన సమావేశం రసాభాసగా ముగిసింది. నిబంధనలకు విరుద్ధంగా కులాల నడుమ చిచ్చు పెట్టి ఓట్లు బావుకునేందుకు టీడీపీ చేస్తున్న కుటిల రాజకీయాలపై విశ్లేషకులు ఏవగించుకుంటున్నారు. సమావేశంపై సమాచారమిచ్చినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సమావేశంలో గంజి చిరంజీవికి మద్దతిచ్చే విషయంపై విభిన్న వాదనలు జరిగినట్లు సమాచారం. మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్ పదవి చేనేత వర్గానికే ఇచ్చేలా టీడీపీ అధినేత చంద్రబాబుతో హామీ ఇప్పించాలని కొందరు డిమాండ్ చేయడంతో ఖిన్నులవడం టీడీపీ నేతల వంతైంది. మరోవైపు బీసీల్లో ఓ ప్రధాన వర్గం టీడీపీని ఓడించాలంటూ కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయడం పట్టణంలో కలకలం రేపింది. తమ వర్గానికి జిల్లాలో ఒక్క సీటు కూడా కేటాయించని టీడీపీని ఎన్నికల్లో మట్టి కరిపించాలని బీసీ సామాజిక వర్గ ముఖ్య నేత మాగంటి సుధాకర్ యాదవ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళగిరినే వేదికగా చేసుకుని సమావేశాల్లో తీర్మానాలు చేస్తున్నారు. దీంతో గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, మంగళగిరి అభ్యర్థి గంజి చిరంజీవిల్లో గుబులు రేగింది.