కలసి రాకనే...
సాక్షి ప్రతినిధి, గుంటూరు :టీడీపీ ముఖ్యనేతలు, ఆ పార్టీ పరాజిత అభ్యర్థుల మధ్య పరస్పరం ఫిర్యాదుల పరంపర ప్రారంభమైంది. అధికారం వచ్చి వారం రోజులు కాకమునుపే ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. తన ఓటమికి నియోజకవర్గంలోని కొందరు నేతలే కారణమని ఓడిన అభ్యర్థులు ఆరోపిస్తుంటే.. ఆడలేక మద్దెల వోడన్నట్లు సమర్ధత లేక తమపై అభాండాలు వేస్తున్నారని అభ్యర్థులను తప్పుపడుతున్నారు నాయకులు. అభ్యర్థుల ఓటమిపై జిల్లా అధ్యక్షుడు, ముఖ్యనేతల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో త్వరలో అన్ని నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్థితులపై సమీక్ష జరగనుంది. దీనికి ముందే పరాజిత అభ్యర్థులు తమ ఓటమికి కొందరి నాయకుల వెన్నుపోటు కారణమని పేర్కొంటుంటే, ఆ నాయకులు వీరి ఆరోపణలను తిప్పికొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి మద్దాళి గిరిధర్ తన ఓటమికి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జియావుద్దీన్ కారణమని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. అధినేతకు ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జయావుద్దీన్ డివిజన్‌లో తనకు వచ్చిన ఓట్లు ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఆ డివిజన్‌లో జియావుద్దీన్, అతని బంధువులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ తనకు కేవలం 63 ఓట్లు వచ్చాయని గిరిధర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ వాదనను జియావుద్దీన్ పూర్తిగా ఖండిస్తున్నారు. తాను అన్ని విధాలుగా సహకరించానని, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆ డివిజన్‌లో ఎక్కువగా ఉన్న మైనార్టీలు ముస్తఫాకు ఓటు వేశారని చెబుతున్నారు. ఈ విధమైన ఆరోపణలు చేసి పార్టీలో తన కెరీర్‌కు ఆటంకం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జియావుద్దీన్ చెబుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
సహాయ నిరాకరణపై బీజేపీ గుర్రు...
నరసరావుపేటలో పరిస్థితి మరో విధంగా ఉన్నది. పొత్తు కుదుర్చుకున్న టీడీపీ నరసరావుపేటను బీజేపీకి కేటాయించింది. అక్కడి అభ్యర్థి డాక్టర్ నలబోతు వెంకటరావు జిల్లాలోని మిగిలిన అభ్యర్థులు కంటే ఎక్కువ డబ్బు ఖర్చుచేసినా టీడీపీ నేతలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్లనే ఆయన ఓటమి పాలయ్యారనే అభిప్రాయం బీజేపీలో వినవస్తోంది. ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌కు సత్తెనపల్లిలో సీటు రావడంతో ఎక్కువ మంది అక్కడికి వెళ్లి ప్రచారం చేసినట్టు చెబుతున్నారు. ద్వితీయశ్రేణి నాయకులు ప్రచారంలో పాల్గొనకుండా నాటకాలాడారని, పోలింగ్ రోజున టీడీపీ శ్రేణులు ఎవరి ఓట్లు వారు వేసుకొని చెట్ల కింద కాలక్షేపం చేశారే కాని మిగిలిన ఓట్లు పడటానికి ప్రయత్నించలేదని చెబుతున్నారు. తమను టీడీపీ నాయకులు మోసం చేశారని చెబుతూ ఇందుకు ఉదాహరణలు పేర్కొంటున్నారు. టీడీపీకి పట్టు ఉన్న యలమంద, రావిపాడు గ్రామాల్లో తమను ఆ పార్టీ వర్గీయులు పట్టించుకోకపోవటంతో వైఎస్సార్‌సీపీకి ఎక్కువగా ఓట్లు పడ్డాయని చెబుతున్నారు.
కోడెల పోటీచేస్తే కనీసం నియోజకవర్గంలో 16 గ్రామాల వరకు 75 శాతం పోలింగ్ టీడీపీకి అనుకూలంగా పడేదని, తమ అభ్యర్థి పోటీ వల్ల టీడీపీ వర్గీయులు పట్టించుకోకపోవటంతో ఆయా గ్రామాల్లో వైఎస్సార్‌సీపీకి సగం ఓట్లు పోలయ్యాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వీటితోపాటు టీడీపీ ఓటమి పాలైన మంగళగిరి, బాపట్ల, మాచర్ల నియోజకవర్గాల్లోని కొందరు టీడీపీ నేతలు సొంతపార్టీ అభ్యర్థులకు సహకరించలేదని చెబుతున్నారు. గెలిచిన చోట్ల కూడా మెజార్టీ తక్కువ రావడానికి గల కారణాలు, మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలపై మూడు రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డికి కొందరు ముఖ్యనేతలు సహకరించలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమీక్ష సమావేశాల్లో నియోజకవర్గాల పరిస్థితులు వెలుగులోకి రానున్నాయి.