ఓటుకు రేటు
సాక్షి ప్రతినిధి, గుంటూరు :సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది. తమ గెలుపునకు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని జార విడుచుకోవడం లేదు. ఆ పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే రానున్నది తమ ప్రభుత్వమేనంటూ అధికారులు, సిబ్బందిని బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులను గెట్ టు గెదర్ పేరుతో పిలిపించి బేరసారాలు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం ఉద్యోగులను ప్రలోభపెడుస్తున్నారు. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులతో ముందుగానే బేరం కుదుర్చుకుని వారి సహాయంతో ఇతర సంఘాల నాయకులను కలుస్తూ గంపగుత్తగా ఓట్లు మాట్లాడుకుంటున్నారు. అంతేనా... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కదిలికలను తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలనే ఏర్పాటు చేసింది. ప్రతీ చిన్న సంఘటనను రచ్చరచ్చ చేస్తున్నారు.
బ్యాలెట్ ఓట్లు కీలకం..
సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చే ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటువేసే అవకాశం కల్పించింది. దీంతో రాజకీయపార్టీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రసన్నం చేసు‘కొనేందు’కు ప్రయత్నాలు చేస్తుంటాయి. గుంటూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పొందేందుకు ఇక్కడి నాయకులు అడ్డదార్లు తొక్కుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 25వేల మంది ఉపాధ్యాయులు, 40వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోనే 15వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉంటారని అంచనా. దీంతో గుంటూరు పార్లమెంటు అభ్యర్థి గల్లా జయదేవ్, అసెంబ్లీ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను పొందేందుకు కొన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులను మధ్యవర్తులుగా నియమించుకున్నారు. వారి ద్వారా ఓట్లు పొందేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. మహిళా ఓటర్లకైతే ఖరీదైన పట్టుచీరలు, పురుష ఓటర్లకు ఓటుకు రూ. 1500 నుంచి రెండు వేల వరకు ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
గుంటూరులో వీకెండ్ విందులు.. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు పరిధిలోని పోస్టల్ ఓట్లకోసం టీడీపీ అభ్యర్థులు భారీగానే ఖర్చుచేస్తున్నారు. ఇప్పటికే ఏపీఎన్‌జీవో సంఘంలో ఒక కీలక నాయకుడు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘంలో ఒకరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పోస్టల్ ఓట్లను సేకరిస్తున్నారు. నరసరావుపేటలో ఓ ఉపాధ్యాయుడు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలంటూ డబ్బులు ఇవ్వజూపి పోలీసులకు ఆదివారం చిక్కిన వైనం దీనిని రుజువు చేస్తోంది. ఆయననుంచి పదివేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు కూడా. ప్రధానంగా గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట అసెంబ్లీ పరిధిలో ఈ పోస్టల్ ఓట్లకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే కొంతమంది ఓట్లు వేయగా మరికొందరు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం టీడీపీ నాయకులు విందు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు నరగంలోని ఓ పేరొందిన హాటల్‌లో శని, ఆదివారాలు విందులు ఏర్పాటు చేశారు. గెట్ టు గెదర్ అంటూ పిలిచి పోస్టల్ ఓట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.