‘దేశ’మంటే.. దౌర్జన్యమోయ్! | Thota Narasimha attacks YSRCP MLA's family members in Veeravaram | Sakshi
Sakshi News home page

‘దేశ’మంటే.. దౌర్జన్యమోయ్!

Published Sun, May 18 2014 3:23 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

నరసింహం దాడులపై డీఎస్పీతో మాట్లాడుతున్న జ్యోతుల నెహ్రూ, చలమలశెట్టి సునీల్ - Sakshi

నరసింహం దాడులపై డీఎస్పీతో మాట్లాడుతున్న జ్యోతుల నెహ్రూ, చలమలశెట్టి సునీల్

- దాడులకు తెగబడుతున్న టీడీపీ శ్రేణులు
- వీరవరంలో నరసింహం స్వైరవిహారం
- కాకినాడలో వనమాడి వర్గీయుల రౌడీయిజం
- దివిలిలో ఎస్సీ మహిళలపై దురాగతం

 
 సాక్షి, కాకినాడ : అధికారమే పరమావధిగా తెలుగుదేశం నాయకులు సార్వత్రిక ఎన్నికలకు ముందు అడ్డదారులెన్నో తొక్కారు. ధనమదంతో కోట్లు కుమ్మరించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. చివరి క్షణం వరకు డబ్బు, మద్యం పంపిణీ చేశారు. మోడీ ప్రభంజనానికి తోడు ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. గెలిచిన గంటల్లోనే తమ అసలు స్వరూపం బయటపెడుతూ ప్రత్యర్ధులపై విషం కక్కుతున్నారు.  తమకు ఓట్లు వేయలేదని, అనుకూలంగాపనిచేయలేదనే అక్కసుతో దాడులకు తెగపడుతున్నారు.

టీడీపీ తరఫున కాకినాడ ఎంపీగా బొటాబొటి మెజారిటీతో గట్టెక్కిన మాజీ మంత్రి తోట నరసింహం తన రాజకీయ ఎదుగుదలకు మూలమైన సొంత గ్రామస్తులపై స్వయంగా దాడులకు తెగపడ్డారు. ఆయన స్వగ్రామమైన కిర్లంపూడి మండలం వీరవరంలో ప్రాదేశిక ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు పోలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ వీరవరంలో ఆయనకు 875 ఓట్లు పడగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్‌కు 2,075 ఓట్లు పడ్డాయి. స్వగ్రామంలోనే ప్రత్యర్థికి ఆధిక్యత దక్కడాన్ని జీర్ణించుకోలేకపోయిన నరసింహం వీధి రౌడీలా మారిపోయారు.

ఎంపీనన్న సంగతి మరిచి  గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడుతూ,  దాడులు చేశారు. ప్రత్యక్ష సాక్షులు విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి టీడీపీ విజయోత్సవ ర్యాలీ జరుగుతుండగా వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లపై అవుట్లు, తారాజువ్వలు వేసి భయభ్రాంతులకు గురిచేశారు. తోట రామస్వామి ఇంట్లోకి టపాసు బాంబులు వేసి, కారు అద్దాలు బద్దలు కొట్టారు. అక్కడే ఉన్న బైకుని ధ్వంసం చేశారు. శనివారం ఉదయం నరసింహం వైఎస్సార్ సీపీ నేత తోట గాంధీ ఇంట్లోకి చొరబడి దాడిచేసి గాయపరిచారు. ఆ పార్టీ కమిటీ కన్వీనర్ గొల్లపల్లి సూరిబాబు ఇంటిపై దాడి చేసి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ దౌర్జన్యంతో సూరిబాబు తల్లి మూర్ఛిల్లింది.

కాగా గ్రామకూడలిలో ఉన్న గరగ భీమరాజు, గెడ్డం గంగారావులపైనా టీడీపీ వారు దాడిచేశారు. తనకు ఓటు వేయలేదనే అక్కసుతోనే నరసింహం ఇలాంటి చర్యలకు ఒడిగడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఒకదశలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నరసింహం ఇంటిపై దాడికి సిద్ధపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్దాపురం డీఎస్పీ అరవిందబాబు ఆధ్వర్యంలో పోలీసులు అతికష్టమ్మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ సీపీ నాయకుడు చలమలశెట్టి సునీల్ వీరవరం చేరుకుని నరసింహం ఇంటిపై దాడికి సిద్ధమైన కార్యకర్తలను సంయమనం పాటించాలని కోరారు. వీధిగూండాలా వ్యవహరించిన నరసింహాన్ని అరెస్టు చేయాలని నెహ్రూ డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ మురళీమోహన్ హామీ ఇవ్వడంతో పాటు గాంధీ ఫిర్యాదు మేరకు నరసింహంపై కేసు నమోదు చేశారు.

ఫైనాన్స్ కార్యాలయంపై దాడి
కాకినాడలో టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరులు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై గూండాల్లా దాడులకు తెగపడ్డారు. సూర్యనారాయణపురంలోని సర్వారాయ టెక్స్‌టైల్స్ వద్ద మదర్ థెరిస్సా విగ్రహం సమీపంలోని ఓ ఫైనాన్స్ కార్యాలయంపై శనివారం దాడి చేసి భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. 27వ డివిజన్‌కు చెందిన ఫైనాన్స్ వ్యాపారులు రామ్,లక్ష్మణ్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పనిచేశారు. శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఫైనాన్స్ కార్యాలయానికి వచ్చి అక్కడున్న సుమో అద్దాలను, కారు షెడ్‌ను ధ్వంసం చేశారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్‌కు పనిచేస్తారా!’ అని అక్కడున్న సిబ్బందిని దుర్భాషలాడారు.

దివిలిలో పలువురికి తీవ్రగాయాలు
టీడీపీ శ్రేణులు పెద్దాపురం మండలం దివిలి ఎస్సీ పేటలో ఇళ్లల్లోకి చొరబడి, ఆడవాళ్లని కూడా చూడకుండా టీడీపీ దాడులకు తెగపడ్డారు. అనుమతి లేకుండానే విజయోత్సవ ర్యాలీ చేస్తూ శుక్రవారం అర్ధరాత్రి దివిలి ఎస్సీ పేట చేరుకున్నారు. మద్యం మత్తులో కొందరు పేటలోని ఇళ్లలో చొరబడ్డారు.

‘వైఎస్సార్‌సీపీకి పనిచేస్తారా.. మీ అంతు చూస్తాం’ అంటూ నానా దుర్భాషలాడారు. నిద్రిస్తున్న ఆడవాళ్లను జుట్టు పట్టుకొని రోడ్లపైకి లాక్కొచ్చి, దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మగవాళ్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఒ.రమణమ్మ, మూరా రాజులు, మూరా సత్తబ్బాయి, మూరా శశికళ, పినిపే నూకాలమ్మ, పినిపే మంగ, యాదగిరి అచ్చారావు, మూరా శ్రీను తీవ్ర ంగా గాయపడ్డారు. వారిని తొలుత పెద్దాపురం ఆస్పత్రికి, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పెద్దాపురం పోలీసులు టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. అధికారం దక్కి 24 గంటలు కాకుండానే ఇంతకు తెగించిన తెలుగుదేశం వారు మునుముందు ఇంకెంత వికృతరూపం ప్రదర్శిస్తారోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement