రొంపిచెర్ల (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. బీరు బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఐదు రోజులక్రితం సోమలలో తెలుగుదేశం పార్టీ వర్గీయులు ఘర్షణలకు దిగారు. టీడీపీ కార్యకర్తలు రొంపిచెర్ల క్రాస్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించి చెప్పులతో కొట్టి కాల్చివేశారు. దీనిపై రొంపిచెర్ల సర్కిల్‌లో శనివారం ఉదయం ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
తిరిగి సాయంత్రం ఇరువర్గాలు రొంపిచెర్ల సర్కిల్‌కు చేరుకోగా.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో రొంపిచెర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న రొంపిచెర్ల ఎస్‌ఐ శ్రీనివాస్ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటికి కల్లూరు, భాకరాపేట, పీలేరు, ఎర్రావారిపాళ్యెం స్టేషన్ల నుంచి పోలీసులు రొంపిచెర్లకు చేరుకుని.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, దాడుల విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్‌రెడ్డి రొంపిచెర్ల చేరుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. రొంపిచెర్ల మండలంలో ఉనికి కోసమే టీడీపీ ఘర్షణలకు పాల్పడుతోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment