మూడు నెలల్లో అదనపు వసతి
Published Sun, Dec 15 2013 3:54 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
కారంపూడి, న్యూస్‌లైన్ :గిరిజన బాలుర వసతి గృహ విద్యార్థులకు మూడు నెలల్లో అదనపు వసతిని ఏర్పాటు చేస్తామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి విజయకుమార్ హామీ ఇచ్చారు. సం‘క్షోభ’ హాస్టళ్లు శీర్షికన శనివారం ‘సమర సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా కలెక్టర్ సురేశ్ కుమార్ స్పందించారు. హాస్టళ్లలోని విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకుని ఓ నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి విజయకుమార్ కారంపూడిలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. హాస్టళ్ల మరమ్మతుల కోసం రూ.78 లక్షలు మంజూరై ఉన్నాయన్నారు. కలెక్టర్ అనుమతితో ఇక్కడ అదనపు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శాశ్వత భవన నిర్మాణానికి ఉప ప్రణాళికలో నిధులు కోరతామన్నారు. ఏడు ప్రభుత్వ శాఖల సహకారంతో గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు.
విద్యార్థులతో ముఖాముఖి..
గిరిజన బాలుర వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా గిరిజన సంక్షేమ అధికారి విజయకుమార్ విద్యార్థుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో పెట్టెలు పెట్టుకోవడానికే సరిపోవడంలేదని, గత్యంతరం లేక చలిలో నిద్రిస్తున్నామని, వర్షం పడినపుడు పక్కనే ఉన్న జెడ్పీ హైస్కూల్‌లో పడుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. అనంతరం ఆయన హాస్టల్ రికార్డులను పరిశీలించా రు. గిరిజన బాలికల వసతి గృహాన్ని పరి శీలించారు. కొన్నిచోట్ల నూతన లైట్లు, కిటికీలకు దోమ తెరలు ఏర్పాటు చేశారు. ఆయనతోపాటుఅసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫే ర్ ఆఫీసర్ ఎంవీ రమేష్ కూడా వచ్చారు.
Advertisement