న్యూఢిల్లీ: భారత్, అఫ్ఘానిస్తాన్ విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఓ యూనిర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘర్షణల్లో కశ్మీర్‌కు చెందిన ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని శార్ధా యూనివర్సిటీలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శార్ధా యూనివర్సిటీలో సోమవారం నాడు ముగ్గురు అఫ్ఘానిస్తాన్ విద్యార్థులు ఓ భారత విద్యార్థిని చితకబాదిన దృశ్యాలను సోషల్ మీడియాలో ఉంచారు. అంతేకాకుండా రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన భారత విద్యార్థులు కొంతమంది అఫ్ఘాన్ విద్యార్థులపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. యూనివర్సిటీలో హింసను ప్రేరేపించేలా ఉన్న దృశ్యాలను సోషల్ మీడియాలో ఉంచినందుకు యూనివర్సిటీ అధికారులు ముగ్గురు అఫ్ఘాన్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.
ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలో భాగంగా.. గురువారం నాడు కశ్మీర్ యువకుడిని అఫ్ఘాన్‌కు చెందిన విద్యార్థిగా భావించిన భారత విద్యార్థులు అతనిపై దాడికి దిగారు. ఈ దాడిలో అతడికి తీవ్రంగా గాయాలయినట్టు తెలుస్తోంది. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యూనివర్సిటీ వెలుపల బలగాలను మోహరించిన పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న 350 మంది విద్యార్ధులపై కేసు నమోదు చేశారు. యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అధికారులు ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా వేశారు. ఆదివారం వరకు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment