వనమంటే..వణుకు
నల్లమలలో చిరుతల వరుస దాడులు
పచ్చర్ల సంఘటనతో ఉలిక్కిపడిన గిరిజనులు
రెండు రోజుల క్రితం శ్రీశైలం టోల్‌గేట్ వద్ద చిరుత సంచారంతో కలకలం
వరుస సంఘటనలతో సరిహద్దు ప్రాంతాల్లో భయాందోళనలు
ప్రత్యేక పరిస్థితుల్లోనే చిరుత దాడి చేసి ఉండొచ్చంటున్న అధికారులు
నల్లమల అభయారణ్యంలో సంచరించే చిరుతలు మనుషులపై దాడి చేస్తున్న వరుస సంఘటనలు గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. స్వేచ్ఛగా అడవిలోకి వెళ్లి ఫలసాయాన్ని తెచ్చుకునే గిరిజనులు అడవిలోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. గతంలో ఎప్పుడూ చిరుతలు మనుషుల మీద దాడిచేసిన ఘటనలు జరిగిన దాఖలాలు లేవు. అయితే ఇటీవలి వరుస ఘటనలు అటవీ సమీప గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలో నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న పచ్చర్ల సమీపంలో పదిహేను రోజుల క్రితం అడవిలో కట్టెల కోసం వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసి చంపటం అటవీ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర అలజడిని రేకెత్తించింది. దీంతో పాటు చంపిన మహిళ మృతదేహాన్ని చిరుత భక్షించిందన్న వార్తలతో స్థానిక గిరిజనులు హడలిపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు అటవీ ప్రాంతంలోకి వెళ్లి అటవీ ఫలసాయాన్ని సేకరించే తమకు ఈ సంఘటన అత్యంత భయాందోళన కలిగిస్తోందంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిరుత మహిళపై దాడి చేయటంతో అది మ్యాన్ ఈటర్‌గా మారి ఉంటుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దశాబ్దాల నల్లమల అభయారణ్య చరిత్రలో ఇలా చిరుతలు మనుషులను చంపి తినటం జరగలేదని గిరిజనులు చెబుతున్నారు. అంతకు ముందు పచ్చర్ల సమీపంలోనే రైల్వే పనులు చేస్తున్న మరో మహిళపై చిరుత దాడికి పాల్పడగా, వారం రోజుల క్రితం పచ్చర్ల చెక్‌పోస్టు వద్ద మరో యువకుడిపై చిరుత దాడి చేసి గాయపర్చటం, మహానంది ఆలయం పరిసరాల్లో చిరుత సంచరించటం వంటి వార్తలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. దీంతో పాటు గురువారం రాత్రి శ్రీశైలం టోల్ గేట్ వద్ద ఓ కుక్కను చిరుత పట్టుకెళ్లిన వీడియోలు వైరల్‌గా మారి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
నీటి కోసమే అడవులను దాటుతున్నాయా..
నల్లమల దట్టమైన అటవీప్రాంతం కావడంతో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు తదితర ఎన్నో జంతువులు ఉన్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంపై అటవీశాఖ అధికా రులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. మూడు జిల్లాలకు ప్రధాన కార్యాలయంగా ఉన్న శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోనే చిరుత పులులు ఎక్కువగా సంచరిస్తున్నాయన్న విషయం చర్చనీ యాంశంగా మారింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం చెక్‌డ్యాంలు, సాసర్‌పిట్లలో నీరులేక అవి చాలా చోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. దీంతో తాగునీరు లేకపోవడంతో చిరుతలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేస్తున్నాయి.
చిరుతలు స్వేచ్ఛా జీవులు:
తెలుగు రాష్ట్రాల విభజన తరువాత పెద్ద పులులు అభయారణ్యం ఆంధ్రప్రదేశ్‌లోకే అధికంగా చేరింది. ఫలితంగా పులులు, చిరుతల సంఖ్య కూడా మనరాష్ట్రంలోనే ఎక్కువ. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి దేశవ్యాప్త పులుల గణన జరుగుతుంది. ఈ క్రమంలో మన రాష్ట్రంలోని అభయారణ్యంలో 83 కు పైగా పెద్దపులులు, లెక్కకు మించి చిరుతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. చిరుత పులులు స్వేచ్ఛా జీవులని, పెద్దపులిలా ఒక పరిధిని ఏర్పరచుకొని అవి ఒక చోట ఉండవని... ఎక్కడంటే అక్కడ సంచరిస్తూ ఉంటాయని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment