
చవుడు నేలల్లో వరి పండుతుందా? అసలు పండదన్నది నిన్నమొన్నటి మాట.. ఇకపై ఆ మాట చెల్లదు.. చైనా శాస్త్రవేత్తలు ఉప్పు నీటిలో వరి పండించడమే కాకుండా సాధారణ వరి మాదిరిగానే దిగుబడులూ సాధించారు. చైనా హైబ్రిడ్ వరి వంగడాల పితామహుడిగా పేరొందిన యువాన్ లాంగ్‌పింగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కింగ్‌డావులో జరిపిన ప్రయోగాల ద్వారా కనీసం 4 వంగడాలు ఉప్పును తట్టుకుని మరీ పెరగగలవని తేలింది. దాదాపు 200 రకాల వరి వంగడాలను వేర్వేరు ఉప్పు మోతాదులున్న నీటిలో పండించినప్పుడు నాలుగు వంగడాలు ఉప్పు ప్రభావాన్ని అధిగమించాయి. ముందుగా వీటన్నింటికి మూడు శాతం లవణాలున్న నీటిని అందించారు.
ఆ తరువాత క్రమేపీ ఉప్పు మోతాదును ఆరు శాతానికి పెంచారు. హెక్టారుకు 4.5 టన్నుల వరకు దిగుబడులు వస్తాయని తొలుత అంచనా వేయగా.. అవి కాస్తా 9.3 టన్నులు పండటంతో ఆశ్చర్యపోవడం శాస్త్రవేత్తల వంతైంది. చైనాలో దాదాపు పది కోట్ల హెక్టార్ల చవుడు నేలలు ఉన్నాయని, వీటిల్లో ఈ రకమైన వరి వంగడాలు పండిస్తే రైతుకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతుందని లాంగ్‌పింగ్ బృందం అంచనా వేస్తోంది. కొత్త వంగడాలను మరింత మెరుగుపర చడంతో పాటు సాగు పద్ధతులను ప్రామాణీకరించేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నామని వారు వివరించారు.