చివరి ఆయకట్టునూ రక్షిస్తాం
⇒ ప్రాజెక్టుల్లో 9.10 టీఎంసీల నీరు
⇒ జిల్లాలో రూ. వెయ్యి కోట్ల సాగు
⇒ నీటిని సద్వినియోగం చేసుకోవాలి
⇒ ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల
⇒ డిస్ట్రిబ్యూటరీల వద్ద వీఆర్‌వో, వీఆర్‌ఏలను కాపలా ఉంచాలి
⇒ వాహనంలో పర్యవేక్షిస్తా
⇒ సమీక్షలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి
ఇందూరు (నిజామాబాద్ అర్బన్) :
‘జిల్లాలో దాదాపు రూ. వెయ్యి కోట్ల వరి పంట ఉంది.. ఇది ఆషామాషీ విషయం కాదు.. పంట వేసిన రైతుకు జీవన్మరణ సమస్య... అధికారులు సమష్టి బాధ్యత తీసుకుని చివరి ఆయకట్టు వరకు నీరందించాలి. వేసిన పంటలను కాపాడాలి’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో నీటి పారుదల అధికారులు, తహసీల్దార్‌లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో 9.10 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. నిజాంసాగర్, అలీసాగర్, గుత్ప ప్రాజెక్టుల ఆయకట్టు కింద 2 లక్షల 10 వేల ఎకరాల పంట సాగవుతోందన్నారు. ప్రస్తుతం మూడు విడతలుగా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయగా, ఇంకా మూడు విడతల నీటిని ప్రాజెక్టుల నుంచి ఆన్‌అఫ్ పద్ధతిలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
వేసవిలో రబీ పంటలకు విడుదల చేసే నీటిని సక్రమంగా వాడుకోకపోతే నీరంతా వృథా అవుతుందన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద 82 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయని, చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు కలిపి 766 డిస్ట్రిబ్యూటరీలు, 218 సబ్ డిస్ట్రి బ్యూటరీలు ఉన్నాయన్నారు. ప్రతి డిస్ట్రిబ్యూటరీ వద్ద ఒక వీఆర్‌వో, ప్రతి సబ్ డిస్ట్రిబూట్యరీ వద్ద వీఆర్‌ఏలను కాపాల ఉంచాలన్నారు. వీరికి షిప్టుల వారిగా డే అండ్ నైట్ డ్యూటీలు వేసే బాధ్యత తహసీల్దార్‌లపై ఉందన్నారు. ఎవరెవరు డిస్ట్రిబ్యూటరీల వద్ద ఉంటున్నారో వారి పేర్లతో సహా వివరాలు అందించాలని, తాను పది రోజుల పాటు కెనాల్‌పైనే వాహనంలో పర్యవేక్షణ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.
మూడు విడతల నీటిలో 850–1000 క్యూసెక్కు నీటిని విడుదల చేస్తామన్నారు. రైతులు నీటిని వృథా చేయడకుండా అవగాహన కల్పిం చాలని అధికారులను ఆదేశించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 4.9 టీఎంసీల నీరు నిలువ ఉండగా, అందులోంచి 2.9 టీఎంసీల నీటిని వినియోగించగా, ఇంకా 2 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. కాలువను బంద్ చేసే సమయంలో ఇరిగేషన్ అధికారులు చివరి ఆయకట్టు వరకు నీరు అందిందో లేదో తెలుసుకున్న తరువాతే బంద్ చేయాలన్నారు. లేదంటే చివరి ఆయకట్టు పంట లకు నష్టం జరుగుతుందన్నారు. సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు, నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్‌లు యోగితా రాణా, సత్య నారాయణ, జేసీ రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.