భాస్వరం ఎరువులను పైపాటుగా వేయకూడదు!
వరి పంట ప్రస్తుతం పిలకలు పెట్టే దశ నుంచి అంకురమేర్పడే దశలో ఉంది. ఈ కాలంలో నీరు, ఎరువుల యాజమాన్యం ముఖ్యమైనవి.నాటిన వారం రోజుల నుంచి పిలకలు పెట్టడం పూర్తిగా ముగిసే వరకు 2 సెం.మీ. మించకుండా పొలంలో నీరు నిలబెట్టాలి. ఈ దశలో నీరు పొలంలో ఎక్కువగా ఉంటే పిలకల సంఖ్య తగ్గి దిగుబడులు తగ్గుతాయి.
సారవంతమైన భూముల్లో, అత్యధిక పిలకలు తయారైన దశలో పొలంలో నీటిని పూర్తిగా తీసివేసి 2-3 రోజులు ఆరగట్టాలి. దీన్నే మధ్యంతర మురుగుతీత అంటారు. దీని వలన వరిపైరు వేర్లు ప్రాణ వాయువును పీల్చుకొని ఆరోగ్యవంతంగా ఉంటాయి. సిఫారసు చేసిన నత్రజనిలో 3వ వంతు పిలకల దశలో పైపాటుగా వేయాలి. పొలంలో నీటిని తీసివేసి బురద పదునులో మాత్రమే నత్రజని ఎరువును పైపాటుగా వేస్తే నత్రజని నష్టం తగ్గి పైరుకు బాగా ఉపయోగపడుతుంది. 2 రోజుల తర్వాత మళ్లీ నీరు పెట్టాలి. భాస్వరం/భాస్వరం కలిసిన కాంప్లెక్స్ ఎరువును పైపాటుగా వేయొద్దు.
డిసెంబర్-జనవరిల్లో నాటిన చెరకు మొక్క తోట, కార్శి తోటలకు జడ చుట్లు వేసుకోవాలి. ఉత్తర కోస్తా జిల్లాల్లో సాగులో ఉన్న వర్షాధారపు చెర కు సాగులో, జూలైలో నాటిన చెరకు తోటలకు రెండో దఫా నత్రజని (ఎకరానికి 35 కిలోల యూరియా) భూసార పరీక్షాధారంగా వాడుకోవాలి.లోతట్టు ప్రాంతాల్లో, అధిక నత్రజని వాడకమున్న చెరకు తోటలకు దూదేకుల పురుగు, పొలుసు పురుగు, తెల్ల ఈగ ఆశించడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి చెరకు తోటలను పర్యవేక్షించి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎల్లో లీఫ్ వ్యాధి చెరకుకు సోకుతోంది. ఇది సోకిన తోట నుంచి తెచ్చిన విత్తనం వాడకూడదు. కార్శి కూడా చేయకపోవడం శ్రేయస్కరం.
మిరప నారుమళ్ల పెంపకానికి సరైన అదును ఇదే. 6 వారాల వయస్సు గల మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి. నారు ముదిరినట్లైతే తలలు తుంచి నాటుకోవాలి.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్