ముంచుకొస్తున్న పశుగ్రాసాల కొరత!
ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గమనిస్తే పశుగ్రాసాల కొరత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. వాణిజ్య పంటలు పండించే ప్రతి రైతు కొంత భూమిని పశుగ్రాసాల సాగుకు ఉపయోగించాలి.కొద్దిపాటి నీటి వసతి ఉన్న రైతాంగం సంవత్సరం పొడవునా ఏకవార్షిక, బహువార్షిక పశుగ్రాసాల సాగును చేపట్టవచ్చు.
పశుగ్రాసాల సాగును ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోగల పంటల్లో పశుగ్రాసపు జొన్న, మొక్కజొన్న, సజ్జ, అలసంద(బొబ్బర్లు), పిల్లి పెసర, జనుము, ఉలవ, లూసర్న్ వంటి పంటలు ముఖ్యమైనవి.సజ్జలో ఎన్‌డీబీఎఫ్-1, 2 రకాలు 50 రోజుల్లో ఒకేసారి కోతకు వస్తాయి. ఏపీఎఫ్‌బీ-2, జైంట్ బాజ్రా, రాజ్‌బాజ్రా రకాలు నాలుగు కోతులుగా మొదటికోత 50 రోజులతో మొదలై తరువాత ప్రతి 30 రోజులకు ఒక కోతగా పశుగ్రాసాల దిగుబడిని పొందవచ్చు. పశుగ్రాస మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్, జె-1006, విజయా కాంపోజిట్, జవహర్ కాంపోజిట్ రకాలు 85 రోజులకు ఒకే కోతలో అధిక దిగుబడిని పొందవచ్చు.
పప్పుజాతి పశుగ్రాసాలైన అలసంద(బొబ్బర్లు)లో రష్యన్ జైంట్, బుందేల్ లోబియా- 1,2, ఇసి 4216, యూపీసీ 5286, 5287, కేబీసీ-2 మొదలైన రకాలు 55 నుంచి 60 రోజులకు ఒకే కోతలో నాణ్యమైన పశుగ్రాసాన్ని పొందవచ్చు. లూసర్న్ పంటలో ఆనంద్-1,2, 3 వంటి వార్షిక రకాలు ఒకే కోతలో 60-70 రోజుల్లో దిగుబడిని పొందవచ్చు. పూర్తి వర్షాధారంగా ఆలస్యమైన పరిస్థితుల్లో కూడా తక్కువ కాల వ్యవధిలో అంటే 45 రోజులకే ఒకటే కోతలో నాణ్యమైన పశుగ్రాసాన్ని పొందడానికి ఉలవ సాగు చేసుకోవచ్చు.
పండ్ల తోటలు సాగు చేసే రైతాంగం మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో పప్పుజాతి పశుగ్రాసాలైన స్టైలో హమాటా, లూసర్న్, అలసంద, ఉలవ, పిల్లి పెసర, జనుము వంటి పంటలను సాగు చేయడం వల్ల పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. దీంతోపాటు, భూమిలో నత్రజని స్థిరీకరించబడి భూసారాన్ని పెంపొందించుకోవడమే కాకుండా నేలలో నీటి సంరక్షణ కూడా జరుగుతుంది.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్