ఈ వారం వ్యవసాయ సూచనలు
ఖరీఫ్ గడువు: తెలంగాణలో 10, ఏపీలో 15 వరకు!
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డెరైక్టర్ జనరల్ డా. ఎస్. అయ్యప్పన్, ప్రొ. ఎమ్మెస్ స్వామినాథన్, వ్యవసాయ విశ్వవి ద్యాలయ ఉపకులపతి డా. ఎ. పద్మరాజు, ఇతర రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఇటీవల హైదరాబాద్‌లో సమావే శమై దేశంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై సమీక్షించారు. అదను, పదను చూసుకొని విత్తుకోవడం, పశుగ్రాసాల కొరత నివారణ చర్యలు, తక్కువ నీటి అవసరం ఉండే పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు చేశారు. ఈ సూచనలతో పోస్టర్లను ముద్రించి వ్యవసాయ శాఖ ద్వారా గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి రైతులకు మేలు చేకూర్చడానికి కృషి జరుగుతున్నది.
తెలంగాణలో జూలై 10వ తేదీ వరకు, జూలై 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఖరీఫ్ పంటలను విత్తుకోవచ్చు. నేల బాగా పదునైన తర్వాతే విత్తుకోవాలి. అరకొర పదునుతో విత్తుకోకూడదు. పెసర పంటను జూలై 30వ తేదీ తర్వాత విత్తుకోకూడదు. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, బెండ, కంది, తీగజాతి కూరగాయలు, చిక్కుడు తదితర పంటలను విత్తుకోవచ్చు. వంగ, టమాట, మిరప వంటి కూరగాయ పంటల ను ఎత్తయిన మడులపై పెంచుకో వాలి. అలసంద, జొన్న, మొక్క జొన్న, సజ్జ వంటి పశుగ్రాసాలను కూడా సాగు చేసుకోవాలి.
ప్రస్తుతం వేసుకోదగిన అంతర పంటలు: వర్షాభావ పరిస్థితులను అధిగమించడానికి అంతర పంటలు తప్పనిసరిగా వేసుకోవాలి. పత్తి- సోయాబీన్, పత్తి-అపరాలు, జొన్న-సజ్జ, కంది-సోయాబీన్, మొక్కజొన్న-కంది, వేరుశనగ-కంది, వేరుశనగ-ఆముదం, ఆముదం -పెసలు, ఆముదం-అలసంద, ఆముదం-వేరుశనగ, ఆముదం- మినుములు, ఆముదం-కంది, పసుపు-ఆముదం, పసుపు- మొక్కజొన్న మొదలైన పంటలను కలిపి సాగు చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మిశ్రమ వ్యవసాయం చేపట్టవలసిన ఆవశ్యకత ఉంది. పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, పెరటి కోళ్లు, కుందేళ్ల పెంపకం కూడా చేపట్టవచ్చు. కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం, పట్టు పురుగుల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చు.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
పశు సంపదకు బీమా రక్షణ
పాడి పసువు ధర జాతిని బట్టి రూ. 15 వేల నుంచి రూ. 45 వేల వరకు పలుకుతోంది. స్థానిక, విదేశీ, సంకరజాతి పశువులకు బీమా చేయొచ్చు. 2-10 ఏళ్ల ఆవులకు, 3-10 ఏళ్ల గేదెలకు బీమా చేయొచ్చు.
వీటి ఖరీదులో 5% మేరకు బీమా ప్రీమియం ఉంటుంది. బీమా చేసిన పశువుకు చెవిపోగు వేస్తారు. చెవిపోగు ఊడిపోతే ఏజెంట్‌కు చెప్పి వెంటనే వేయించుకోవాలి.
బీమా ఉన్న పశువు మరణిస్తే ఏజెంట్‌కు చెప్పి, కళేబరాన్ని ఫోటో తీయించాలి. పశువుల వైద్యునితో పోస్టుమార్టం చేయించి, ఆ నివేదికతోపాటు చెవిపోగును అధికారులకు ఇచ్చి పరిహారం పొందాలి.
సబ్సిడీపై కొన్న పశువు చనిపోతే పాల సహకార సంఘం అధ్యక్షుడితో సంతకం చేయించి బ్యాంకు ద్వారా బీమా పరిహారాన్ని పొందాలి.
- డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506),
అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా
చేపల రైతులు పాటించాల్సిన అదనపు జాగ్రత్తలు
వానాకాలం అయినప్పటికీ తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. ఫలితంగా మార్కెట్ సైజుకు పెంచే చేపల చెరువుల్లో నీటి లోతు దాదాపు సగానికి (6 అడుగుల నుంచి 3 అడుగులకు) తగ్గిపోయింది. అంటే.. చేపలకు సాధారణంగా లభించే నివాస స్థలం సగానికి తగ్గి.. చెరువుల్లో చేపల సాంద్రత రెట్టింపవుతుందన్నమాట.
ఇటువంటప్పుడు చెరువు నీటిలోని మొత్తం ఆక్సిజన్ పరిమాణం కూడా అంతేస్థాయిలో తగ్గిపోయింది. పైగా తీవ్ర వేడిమి వల్ల నీటికి ఆక్సిజన్‌ను పట్టి ఉంచే సామర్థ్యం తగ్గిపోతుంది. సేంద్రియ పదార్థం కుళ్లడం వల్ల ఏర్పడే కాలుష్యం సాంద్రత కూడా పెరుగుతుంది.
చేపలు, ముఖ్యంగా రోహు చేపల పెరుగుదల తగ్గిపోవచ్చు. కాబట్టి రోజువారీ వాడే మేత పరిమాణాన్ని తగ్గించి వాడాలి.
తెల్లవారుజామున, ఉదయం పూటల్లో ఆక్సిజన్ లోటుతో చేపలు చెరువు పై భాగానికి వస్తుంటాయి. చెరువులోకి మళ్లీ నీరు తగినంత తోడుకునే వరకు రైతులు మేత, ఎయిరేషన్ విషయంలో అదనపు జాగ్రత్తలు పాటించాలి. మార్కెట్ సైజుకు వచ్చిన చేపలను పట్టేయడం మంచిది.
- డా. రావి రామకృష్ణ (98480 90576)
సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు
రొయ్య అనాలోచితంగా గుల్లకొట్టదు!
రొయ్యల్లో పెరుగుదల మోల్టింగ్(నిర్మోచనం) అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. దీన్నే గుల్లకొట్టడం అంటారు.
రొయ్య తన శరీర పరిమాణం పెంచుకోవాలనుకున్నప్పుడు, గాయాలైనప్పుడు, ప్రత్యుత్పత్తి సమయంలోనూ సహజంగానే గుల్లకొడుతుంది. ఆడరొయ్య గుల్లకొట్టిన సమయంలోనే కలయిక జరుగుతుంది.
ఇటువంటి పరిస్థితి లేనప్పుడు.. రైతులు రసాయనాల వాడకం ద్వారా బలవంతంగా గుల్లకొట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు.
గుల్లకొట్టడం అనే జీవ ప్రక్రియ రొయ్యకు పునర్జన్మ వంటిది. అటువంటి సంక్లిష్ట ప్రక్రియను రొయ్య అనాలోచితంగా చేసే సమస్యే లేదు.
చెరువు యాజమాన్య ప్రక్రియ సక్రమంగా ఉంటే రొయ్యల పెరుగుదల ఆగే సమస్యే లేదు.
- ప్రొఫెసర్ పి. హరిబాబు, ప్రభుత్వ మత్స్యకళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా