Shortage of fodder
-
పశువులు పస్తులేనా..!
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితు కారణంగా వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. వర్షాల్లేక పచ్చిగడ్డి, వరి సాగు లేక ఎండుగడ్డి దొరకడం గగనంగా మారింది. వచ్చే వేసవిలో మూగజీవాలకు మేత దొరకడం కష్టం కానుంది. జిల్లాలో గేదెలు, ఆవులు, ఎద్దులు అన్నీ కలిపి 10లక్షలకు పైగా ఉన్నాయి. ఎక్కువగా పత్తి, సోయాబీన్, ఆ తర్వాత వరి సాగు చేస్తుంటారు. ధాన్యం దిగుబడి అనంతరం ఎండుగడ్డి పశువులకు మేతగా ఉపయోగపడేది. కానీ తగ్గిన వర్షాల కారణంగా జిల్లాలో 60వేల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా.. 20వేల ఎక్టార్లకు పడిపోయింది. దీంతో ఎండాకాలంలో ఎండుగడ్డి దొరకలేని పరిస్థితి ఏర్పడనుంది. గడ్డి విత్తనాలు పశుసంవర్ధక శాఖ పంపిణీ చేసినా కరెంటు కోతల కారణంగా సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. నీటి సదుపాయం ఉన్న కొంతమంది రైతులు విత్తనాలు తీసుకెళ్లినా తీవ్రమైన కరెంటు కోతల కారణంగా విత్తుకున్నా గడ్డిని వృథాగా వదిలేశారు. చెరువులు, కుంటలు నిండకపోవడంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఏటా జనవరి మాసం పూర్తయ్యే సరికి పశువులకు మేత కరువు ఉండేది కాదు. ప్రస్తుతం నవంబర్లోనే కనుచూపు మేరలో పచ్చగడ్డి కనిపించడం లేదు. వాణిజ్య పంటల సాగుకే ప్రాధన్యం.. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా కురవడంతో వరి, జొన్న, మొక్కజొన్న సాగుకు ఎక్కువగా నీటి అవసరం ఉన్నందునా వర్షాలు లేక ఎక్కువగా వేసుకోలేదు. ఈ పంటల దిగుబడి అనంతరం ఎండుగడ్డిగా పశువులకు ఆహారంగా ఉపయోగపడేది. తగ్గిన వర్షాల కారణంగా పత్తి, సోయా, కంది పంటలు వేసుకున్నారు. ఈ పంటల దిగుబడి అనంతరం ఎండుగడ్డిగా కూడా పశువులకు ఉపయోగకరంగా ఉండదు. అరకొరగా గడ్డి విత్తనాలు రైతులు పశువుల పెంపకానికి 75 శాతం రాయితీపై మేలు రకపు గడ్డి విత్తనాలు అందజేస్తున్నారు. గడ్డి విత్తనాల పెంపకంపై అవగహన కల్పించి పశు సంతతిని కాపాడుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కొన్ని మండలాల్లో పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. తూర్పు ప్రాంతాంలో విత్తన పంపిణీ ఊసే లేకుండా పోయింది. అవగాహన కరువు.. ప్రభుత్వ పథకాలపై పాడి రైతులుకు అవగాహన కల్పించే వారు కరువయ్యారు. పశుగ్రాసం కోసం రబీలో నీటి సౌకర్యం ఉన్న రైతులకు గడ్డి విత్తనాలు రాయితీపై అందించాలి. దీనిపై గ్రామాల వారీగా ప్రచారం చేయకపోవడంతో రైతులు పశుగ్రాసం కోసం నానా తంటాలు పడుతున్నారు. విత్తనాలు పంపిణీ చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నా అవి ఎవరికి చేరుతున్నాయో తెలియడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పశుసంపద అభివృద్ధి దిశగా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో గడ్డి విత్తనాల పంపిణీపై అంతగా అవగాహన ఉండడం లేదు. మార్చి తర్వాతే కష్టాలు.. ప్రతీ ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పంటలు చేతికొస్తాయి. ఈ దశలో పశుగ్రాసానికి ఇబ్బందులు ఉండవు. మార్చి తర్వాత సమస్య మొదలయ్యేది. కానీ ఈ ఏడాది డిసెంబర్‌కు ముందే పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఎండుగడ్డి దొరకని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్, మే,జూన్ వరకు పశుగ్రాసం దొరకక మూగజీవులు అల్లాడాల్సిందే. మేకలు, గొర్రెలు పెంపకందారుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాటిని మేపేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మూగజీవాలను కాపాడుకునే మార్గం తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం పాడి రైతుల కష్టాలు తెలుసుకుని వారికి సైతం వంద శాత ం రాయితీపై గడ్డివిత్తనాలు అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రతి గ్రామంలో నీటితొట్టెలు ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. -
కరువు మేఘం.. ఉరుముతోంది..!
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచే వర్షాభావ పరిస్థితులతో రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు ఉండగా.. ఈనెల 8వ తేదీ నాటికి 4.86 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఇందులో 90 శాతం వర్షాధారమే కావడం గమనార్హం. పత్తి 2.52 లక్షల హెక్టార్లలో సాగు చేయగా విత్తనాలకే రూ.100 కోట్లు ఖర్చు చేశారు. వేరుశనగ, మొక్కజొన్న, ఆముదం, కందులు, ఉల్లి, మిరప తదితర పంటలపై మరో రూ.750 కోట్లు వ్యయమైంది. విత్తనాల ఖర్చే ఈ స్థాయిలో ఉండగా.. ఇక ఎరువులు, కూలీలు, ఇతరత్రాలకు చేసిన మొత్తం తలుచుకుంటే రైతుల గుండె జారిపోతోంది. సీజన్ మొత్తానికి 2.50 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. ఇప్పటికే 1.20 లక్షల టన్నుల ఎరువులను రైతులు వినియోగించారు. వీటి విలువ రూ.1100 కోట్ల పైమాటే. పురుగు మందులు, ఇతర వ్యవసాయ ఖర్చులకు మరో రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. వరుణ దేవుడు కరుణించకపోవడంతో ఈ మొత్తం చేతికొచ్చే పరిస్థితి లేదనేది తేలిపోయింది. జూన్ నెలలో పత్తి, కొర్ర, మొక్కజొన్న తదితర పంటలు దాదాపు 50 వేల హెక్టార్లలో సాగయ్యాయి. ఈ పంటలు కళ్లెదుటే ఎండుతుండటంతో రైతుల వేదన వర్ణనాతీతం. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.1 మి.మీ. కాగా.. 66.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. జులై నెలలో 117 మి.మీ. సాధారణ వర్షపాతం ఉండగా 113 మి.మీ. వర్షం కురిసింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మి.మీ., కాగా.. 13 రోజులు గడిచిపోయినా 5.9 మి.మీ., మించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ ఆరంభం నుంచి జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలే కురుస్తుండటంతో అదును దాటకూడదనే ఉద్దేశంతో అంతంత మాత్రం తేమలోనే విత్తనం వేశారు. ఆ తర్వాత ఆశించిన వర్షం లేకపోవడంతో ఎదుగుదల లోపించి పంట వాడుపడుతోంది. పూత, పిందెలతో కళకళలాడాల్సిన పత్తి, వేరుశనగ పైర్లు కళతప్పాయి. కర్నూలు, ఆదోని డివిజన్లలో వర్షాధారం కింద సాగు చేసిన 2.50 లక్షల హెక్టార్ల పంట చేతికందే పరిస్థితి లేకపోవడం రైతులను కలవరపరుస్తోంది. ఇదే సమయంలో పశుగ్రాసం కొరత తీవ్రరూపం దాలుస్తోంది. పచ్చికతో కనిపించే కొండలు, బంజరు భూముల్లో ఎటు చూసినా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. రైతులకు పశు పోషణ భారం కావడంతో విధిలేని పరిస్థితుల్లో సంతల్లో తెగనమ్ముకోవడం కనిపిస్తోంది. ఇక 80 శాతం చెరువుల్లో చుక్క నీరు లేకపోవడంతో పలు ప్రాంతాల్లో నీటి సమస్య జటిలమవుతోంది. వీటి పరిధిలోని దాదాపు 60 వేల హెక్టార్ల భూమి కూడా బీడు వారుతోంది. -
ముంచుకొస్తున్న పశుగ్రాసాల కొరత!
ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గమనిస్తే పశుగ్రాసాల కొరత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. వాణిజ్య పంటలు పండించే ప్రతి రైతు కొంత భూమిని పశుగ్రాసాల సాగుకు ఉపయోగించాలి.కొద్దిపాటి నీటి వసతి ఉన్న రైతాంగం సంవత్సరం పొడవునా ఏకవార్షిక, బహువార్షిక పశుగ్రాసాల సాగును చేపట్టవచ్చు. పశుగ్రాసాల సాగును ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోగల పంటల్లో పశుగ్రాసపు జొన్న, మొక్కజొన్న, సజ్జ, అలసంద(బొబ్బర్లు), పిల్లి పెసర, జనుము, ఉలవ, లూసర్న్ వంటి పంటలు ముఖ్యమైనవి.సజ్జలో ఎన్డీబీఎఫ్-1, 2 రకాలు 50 రోజుల్లో ఒకేసారి కోతకు వస్తాయి. ఏపీఎఫ్బీ-2, జైంట్ బాజ్రా, రాజ్బాజ్రా రకాలు నాలుగు కోతులుగా మొదటికోత 50 రోజులతో మొదలై తరువాత ప్రతి 30 రోజులకు ఒక కోతగా పశుగ్రాసాల దిగుబడిని పొందవచ్చు. పశుగ్రాస మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్, జె-1006, విజయా కాంపోజిట్, జవహర్ కాంపోజిట్ రకాలు 85 రోజులకు ఒకే కోతలో అధిక దిగుబడిని పొందవచ్చు. పప్పుజాతి పశుగ్రాసాలైన అలసంద(బొబ్బర్లు)లో రష్యన్ జైంట్, బుందేల్ లోబియా- 1,2, ఇసి 4216, యూపీసీ 5286, 5287, కేబీసీ-2 మొదలైన రకాలు 55 నుంచి 60 రోజులకు ఒకే కోతలో నాణ్యమైన పశుగ్రాసాన్ని పొందవచ్చు. లూసర్న్ పంటలో ఆనంద్-1,2, 3 వంటి వార్షిక రకాలు ఒకే కోతలో 60-70 రోజుల్లో దిగుబడిని పొందవచ్చు. పూర్తి వర్షాధారంగా ఆలస్యమైన పరిస్థితుల్లో కూడా తక్కువ కాల వ్యవధిలో అంటే 45 రోజులకే ఒకటే కోతలో నాణ్యమైన పశుగ్రాసాన్ని పొందడానికి ఉలవ సాగు చేసుకోవచ్చు. పండ్ల తోటలు సాగు చేసే రైతాంగం మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో పప్పుజాతి పశుగ్రాసాలైన స్టైలో హమాటా, లూసర్న్, అలసంద, ఉలవ, పిల్లి పెసర, జనుము వంటి పంటలను సాగు చేయడం వల్ల పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. దీంతోపాటు, భూమిలో నత్రజని స్థిరీకరించబడి భూసారాన్ని పెంపొందించుకోవడమే కాకుండా నేలలో నీటి సంరక్షణ కూడా జరుగుతుంది. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్