కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచే వర్షాభావ పరిస్థితులతో రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు ఉండగా.. ఈనెల 8వ తేదీ నాటికి 4.86 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఇందులో 90 శాతం వర్షాధారమే కావడం గమనార్హం. పత్తి 2.52 లక్షల హెక్టార్లలో సాగు చేయగా విత్తనాలకే రూ.100 కోట్లు ఖర్చు చేశారు.
వేరుశనగ, మొక్కజొన్న, ఆముదం, కందులు, ఉల్లి, మిరప తదితర పంటలపై మరో రూ.750 కోట్లు వ్యయమైంది. విత్తనాల ఖర్చే ఈ స్థాయిలో ఉండగా.. ఇక ఎరువులు, కూలీలు, ఇతరత్రాలకు చేసిన మొత్తం తలుచుకుంటే రైతుల గుండె జారిపోతోంది. సీజన్ మొత్తానికి 2.50 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. ఇప్పటికే 1.20 లక్షల టన్నుల ఎరువులను రైతులు వినియోగించారు. వీటి విలువ రూ.1100 కోట్ల పైమాటే. పురుగు మందులు, ఇతర వ్యవసాయ ఖర్చులకు మరో రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. వరుణ దేవుడు కరుణించకపోవడంతో ఈ మొత్తం చేతికొచ్చే పరిస్థితి లేదనేది తేలిపోయింది.
జూన్ నెలలో పత్తి, కొర్ర, మొక్కజొన్న తదితర పంటలు దాదాపు 50 వేల హెక్టార్లలో సాగయ్యాయి. ఈ పంటలు కళ్లెదుటే ఎండుతుండటంతో రైతుల వేదన వర్ణనాతీతం. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.1 మి.మీ. కాగా.. 66.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. జులై నెలలో 117 మి.మీ. సాధారణ వర్షపాతం ఉండగా 113 మి.మీ. వర్షం కురిసింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మి.మీ., కాగా.. 13 రోజులు గడిచిపోయినా 5.9 మి.మీ., మించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఖరీఫ్ ఆరంభం నుంచి జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలే కురుస్తుండటంతో అదును దాటకూడదనే ఉద్దేశంతో అంతంత మాత్రం తేమలోనే విత్తనం వేశారు. ఆ తర్వాత ఆశించిన వర్షం లేకపోవడంతో ఎదుగుదల లోపించి పంట వాడుపడుతోంది. పూత, పిందెలతో కళకళలాడాల్సిన పత్తి, వేరుశనగ పైర్లు కళతప్పాయి. కర్నూలు, ఆదోని డివిజన్లలో వర్షాధారం కింద సాగు చేసిన 2.50 లక్షల హెక్టార్ల పంట చేతికందే పరిస్థితి లేకపోవడం రైతులను కలవరపరుస్తోంది.
ఇదే సమయంలో పశుగ్రాసం కొరత తీవ్రరూపం దాలుస్తోంది. పచ్చికతో కనిపించే కొండలు, బంజరు భూముల్లో ఎటు చూసినా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. రైతులకు పశు పోషణ భారం కావడంతో విధిలేని పరిస్థితుల్లో సంతల్లో తెగనమ్ముకోవడం కనిపిస్తోంది. ఇక 80 శాతం చెరువుల్లో చుక్క నీరు లేకపోవడంతో పలు ప్రాంతాల్లో నీటి సమస్య జటిలమవుతోంది. వీటి పరిధిలోని దాదాపు 60 వేల హెక్టార్ల భూమి కూడా బీడు వారుతోంది.
కరువు మేఘం.. ఉరుముతోంది..!
Published Tue, Aug 19 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement
Advertisement