మరిపెడ : తెలంగాణ ప్రాం తంలో ఖరీఫ్ సీజన్‌లో పసుపు, మొక్కజొన్న తరువాత వేసవి వరి మాగాణులో నిల్వ ఉన్న తేమ కింద నువ్యు పంట సాగు చేయవచ్చు. వర్షాధారంగా పండించిన దానికంటే రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా వేసుకుంటే చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. తద్వారా విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొం దవచ్చని మరిపెడ మండల వ్యవసాయ అధికారి సీహెచ్.యాకయ్య (88866 14594) తెలిపారు. నువ్వు పంట సాగు-యాజమాన్య పద్ధతులపై ఆయన వివరించారు.
అనువైన నేలలు
మురుగు నీరు నిలువని తేమ నిలిచే తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిలిచి ఆమ్ల, క్షార గుణాలు కలిగిన నేలలు పనికిరావు. నేలను 2 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని రెండు సార్లు గుంటుకతోలి చదును చేయాలి. ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి మూడింతలు ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి.
విత్తన రకాలు
ఖరీఫ్‌లో గౌరి, మాధవి, ఎలమంచిలి-11, ఎల మంచిలి-17 రకాలు అనుకూలం. ఎలమంచిలి-66(శారద) ఖరీఫ్ లేదా రబీ, వేసవిలో వేసుకోవచ్చు. రబీలో రాజేశ్వరి, శ్వేతాతిల్, చందన, హిమ(జేసీఎస్-9426) రకాలు వేసుకోవాలి.
విత్తనశుద్ధి - విత్తే విధానం
కిలో విత్తనానికి 3గ్రాముల థైరం లేదా కాప్టన్-ఎ లేదా మాంకోజెబ్‌తో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఖరీఫ్‌లో జూలై చివరి వారం నుంచి ఆగస్టు తొలి వారం వరకు, రబీలో జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి తొలి వారం వరకు పంట వేసుకోవచ్చు.
ఎరువుల యాజమాన్యం
ఖరీఫ్‌లో ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల ప శువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భస్వరాన్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. రబీ లేదా వేసవిలో వీటితోపాటు 8 కిలోల నత్రజనిని అదనంగా వేసుకోవాలి. నత్రజని సగభాగం, భాస్వరం మరియు పొటాష్‌నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. మిగతా సగభాగం నత్రజని ఎరువును విత్తిన నెల రోజులకు కలపు తీసివే యాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్‌ఫాస్ఫేట్ రూపంలో వాడినప్పుడు అదనంగా కాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది.
నీటి యాజమాన్యం
విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అబివృద్ధి మరియు గింజకట్టు దశల్లో తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35 నుంచి 40 రోజుల నుంచి 65 నుంచి 70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
కలుపు నివారణ - అంతరకృషి
విత్తేముందు ప్లూకోరలిన్ 45శాతం ఎకరాకు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి కలియ దున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30శాతం లేదా అలాక్లోర్ 50శాతం ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేయాలి. మొక్కలు మొలిచిన 15 రోజులకు అదనపు మొక్కను తీసి వేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి.
రసం పీల్చే పురుగులు (తెల్లనల్లి, తామర పురుగులు, పచ్చడోమ) : పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేస్తాయి. పురుగులు ఆశించి న ఆకులు ముందుగా పాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈనెలు పొడవుగా సాగి కింది వైపుకు ముడుచుకుపోయి పాలిపోతాయి.
నివారణ : మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయోట్ 2మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5మిల్లీలీటర్లు లేదా డైమిథోయోట్ 2మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగులు : ఎండు తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు వర్ణానికి మారి వేలాడుతుంటాయి. తదుపరి ఆకుల అంచులు లోనికి ముడుచుకోని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలేర్పడతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగుచారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. ఎండుతెగులు సోకిన కాండం మీద కాయల మీద గులాబి రంగు శీలింధ్రం బీజాల సముదాయం కనిపిస్తుంది. భూమిలో అధిక ఉష్ణోగ్రత తెగులు వృద్ధికి దోహదపడుతుంది.
నివారణ : పంట మార్పిడి తప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3గ్రాముల థైరం లేదా కాప్టాన్ లేదా కార్బెండిజమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మాంకోజెబ్ 3గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కాండం ఎండు తెగులు : కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా నల్లగా మారుతుంది.
నివారణ : మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లీటరు నీటితో కలిపి చల్లుకోవాలి.
వెర్రితెగులు : ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఎర్పడవు. మొక్కల ఎదుగుదల తగ్గి పైభాగంలో చిన్న చిన్న ఆకులు గుబురుగా ఉండి వెర్రితల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తిచెందుతుంది.
నివారణ : రాజేశ్వరి, చందన, హిమ రకాలు ఈ తెగులును కొంత వరకు తట్టుకుంటాయి. తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి. పైరుపై మిథైల్‌డెమోటాన్ 1మిల్లీలీరు లేదా డైమిథోయోట్ 3మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి దీపపు పురుగులను కూడా అరికట్ట వచ్చు.
బూడిద తెగులు : లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించి న ఆకులు మాడి రాలిపోతాయి.
నివారణ : నీటిలో కరిగే గంధకపు పొడి 3గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
నువ్వు పంట సాగు నాలుగు విధాల బాగు
Published Tue, Oct 7 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement
Advertisement