ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులు, కుంటలు, చెరువుల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా జిల్లాలో 60 వేల హెక్టార్లకు గాను 20వేల హెక్టార్లలోనే వరి సాగైంది. ఇదే ప్రభావం వల్ల మెట్ట పంటల్లోనూ దిగుబడి తగ్గింది. ఖరీఫ్ ప్రభావం ప్రస్తుతం రబీ కాలంలో కరెంటు కోతలతో సహా అదే విధంగా ఉంది.
నీటి సౌకర్యం ఉన్న రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే దిగుబడి సాధించి అవసరమైన ఆదాయం పొందవచ్చని ఏరువాక కోఆర్డినేటర్, శాస్త్రవేత్త రాజశేఖర్ వివరించారు. ప్రత్యామ్నాయ పంటల్లో మొక్కొజన్న, జొన్న, పెసర, మినుము, కుసుమ, పొద్దు తిరుగుడు పంటలు సాగు చేయొచ్చు. ఆరుతడి పంటలు సాగు చేస్తే అవసరమైన నీరు, విద్యుచ్ఛక్తి, పెట్టుబడులు తగ్గుతాయి. ఒక ఎకరం వరి సాగుకు అవసరమైన నీటితో కనీసం రెండు నుంచి నాలుగెకరాల విస్తీర్ణంలో ఆరుతడి పంటలు వేసుకోవచ్చు. పంట మార్పిడి వల్ల పంటను ఆశించే పురుగులు, తెగుళ్లు తగ్గుతాయి. ఆరుతడి పైరులో పప్పు ధాన్యాల పంటలతో భూసారం వృద్ధి చెందుతుంది.
మొక్కజొన్న
అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకు వేసుకోవచ్చు. జీరోటిల్లేజి పద్ధతిలో మొక్కజొన్న విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కేజీల విత్తనం అవసరమవుతుంది. డీహెచ్‌ఎం-111/ 117 వంటి మధ్యకాలిక రకాలు, డీహెచ్‌ఎం-115 వంటి స్వల్పకాలిక రకాలు వేసుకోవచ్చు. హైబ్రిడ్లలో మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను ఎంచుకుని వేసుకోవచ్చు. కోహినూర్, బియో-9637 95రోజుల నుంచి వంద రోజులు, పయనిర్ 3342, డీకేసీ-7074, జేకేఎంహెచ్-1701, 85- 90 రోజుల పంట కాలం. మొక్కజొన్నకు 600 మిల్లీమీటర్ల నీటి పరిమాణం, 450 యూనిట్లు విద్యుచ్ఛక్తి అవసరం.
పొద్దుతిరుగుడు
నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వేసుకోవచ్చు. ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరం. ఊష్ణోగ్రతలు 38డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు దిగుబడి అంతగా రాదు. పంట కాలం 90 రోజులు. హైబ్రిడ్‌లు కేబీఎస్‌హెచ్1/14, ఎన్‌డీఎస్‌హెచ్-1, డీఆర్‌ఎస్‌హెచ్-1, ఏపీఎస్‌హెచ్ 66, ఇంకా ప్రైవేట్ హైబ్రిడ్లను కూడా వేసుకోవచ్చు. దీనికి 400 మిల్లీమీటర్ల నీటి పరిమాణం, 300 యూనిట్ల విద్యుచ్ఛక్తి అవసరం.
శనగ
వరికి ప్రత్యామ్నాయమే కాకుండా సోయాబీన్ తర్వాత కూడా ఆరుతడి పంటగా నవంబర్ వరకు వేసుకోవచ్చు. ఎకరానికి 25-30 కిలోల విత్తనం అవసరం. జేజీ11, అన్నెగిరి, జేఏకేఐ 9218 రకాలు ఎంచుకోవచ్చు. 100-105 రోజుల పంట కాలం. దీనికి 150 మిల్లీమీటర్ల నీటి పరిమాణం. 112 యూనిట్ల విద్యుచ్ఛక్తి అవసరం.
రబీ.. ఆరుతడి పంటలే మేలు
Published Sat, Nov 8 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement
Advertisement