కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వరి ధాన్యం మార్కెట్‌లోకి వచ్చి నెల రోజులవుతోంది. కర్నూలు సోనా క్వింటా ధర రూ.1500 పైగానే ఉన్నా.. లావు రకం ధాన్యానికి గిట్టుబాటు ధర కరువైంది. కొనుగోలు కేంద్రాలు కాగితాలకే పరిమితం కాగా.. రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి.
కేసీ కెనాల్, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, ఎల్‌ఎల్‌సీ కింద జిల్లాలో దాదాపు 3లక్షల ఎకరాల్లో వరి సాగయింది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం గ్రేడ్-ఎ, కామన్ వెరైటీ రకాలు జిల్లాలో దాదాపు 50వేల ఎకరాల్లో సాగు చేశారు. దిగుబడి 75వేల టన్నులు పైగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం గ్రేడ్-ఎ ధాన్యానికి రూ.1400, సాధారణ రకాలకు రూ.1,360 ప్రకారం కనీస మద్దతు ధర నిర్ణయించింది. మార్కెట్‌లో ఇంతకంటే ధర తగ్గితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలతో ధాన్యం కొనాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో గ్రేడ్-ఎ ధాన్యానికి రూ.1,250 నుంచి రూ.1,350 ధర మాత్రమే లభిస్తోంది.
ఈ పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాల జాడ కరువైంది. గ్రామైక్య సంఘాల ద్వారా 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. టార్పాలిన్లు, గోనె సంచుల సమస్య ఉత్పన్నమైంది. అవసరమైన అన్ని సౌకర్యాలను నవంబర్ నెలాఖరులోగా సమకూర్చుకుని.. డిసెంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను తెరిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయంలో అధికారులు సకాలంలో స్పందించకపోవడం రైతులకు శాపంగా మారుతోంది. అన్నిచోట్లా కేంద్రాలను తెరిచినట్లు అధికారులు చెబుతున్నా.. బండిఆత్మకూరు, ఉయ్యాలవాడ మండలం అల్లూరు మాత్రమే వీటి జాడ కనిపిస్తోంది. తక్కిన ప్రాంతాల్లో వీటి ఊసే కరువైంది. ఇదే అదనుగా కొందరు రైస్ మిల్లర్లు, దళారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరతో ధాన్యం కొనుగోలు చేస్తూ రైతుల పేరిట గోదాములకు తరలిస్తున్నారు.
జిల్లాలో గ్రేడ్-ఎ, సాధారణ రకాల ధాన్యం 75వేల క్వింటాళ్లు మార్కెట్‌లోకి వస్తున్నా.. 25 శాతం మాత్రమే ఎంఎస్‌పీతో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. అంటే.. మిగిలిన ధాన్యాన్ని మీ ఇష్టం వచ్చిన ధరతో కొనుగోలు చేయమని మిల్లర్లను పరోక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారా అంటే.. ఇప్పటి వరకు 138 టన్నులు మించకపోవడం పరిస్థితి అద్దం పడుతోంది. లావు రకాలకు డిమాండ్ లేకపోవడం.. కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రాకపోవడంతో మిల్లర్లు, దళారీలు క్వింటా రూ.1,250 నుంచి రూ.1,350 ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది.
బయటి మార్కెట్‌లోనే ధర అధికం
వరికి మద్దతు ధర కంటే బయటి మార్కెట్‌లో అధిక ధర లభిస్తోంది. ఈ కారణంగా కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకురావడం లేదు. అధికార యంత్రాంగం నిర్ణయించిన మేరకు జిల్లాలో 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు బండిఆత్మకూరు ప్రాంతంలో 138 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం.
- సుధాకర్, వెలుగు ఏపీఎం(మార్కెటింగ్)
మద్దతు.. కరువు
Published Mon, Dec 29 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM
Advertisement
Advertisement