సాక్షి ప్రతినిధి, కర్నూలు: నీటి బొట్టును ఒడిసి పట్టాలి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.. పాలకులు పదేపదే చెబుతున్న మాటలివి.. అయితే వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పెద్ద వర్షం వస్తే ఆ నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితి. చెరువులకు, కాలువలకు గండ్లు పడి నీటి పారుదల వ్యవస్థ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. తరచి చూస్తే కాంట్రాక్టర్ల కాసుల దాహం.. అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల అలసత్వం ఇందులో కనిపిస్తోంది.
ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే కాలువల పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే జిల్లాలో కాలువలకు నీరు వదిలే సమయంలోనే కాంట్రాక్టర్లు పనులు చేపడుతుంటారు. అధికారులు కూడా ఆ సమయంలోనే నిధులు మంజూరు చేస్తుంటారు. దీంతో పనులు నాసిరకంగా సాగి అవి‘నీటి’లో కొట్టుకుపోతున్నాయి. కాలువ పనుల్లో ప్రవహిస్తున్న అక్రమాలపై ఇటీవల కలెక్టరేట్‌లో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు నిలదీశారు. అలాగే కాలువల దుస్థితిని కూడా సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారుల్లో చలనం రాలేదు.
ప్రభుత్వమూ స్పందించలేదు. ఫలితంగా బనగానపల్లె పరిధిలోని ఎస్సార్బీసీకి మంగళవారం భారీ గండి పడి వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోయింది. ఈ ఘటన మరువక ముందే బుధవారం చాగలమర్రి సమీపంలో కేసీ కెనాల్ 231/100 కి.మీ వద్ద ఓ చోట, 231/200 కి.మీ వద్ద మరో చోట గండి పడింది. రెండు చోట్ల గండ్లు పడటంతో సుమారు 300 క్యూసెక్కులకుపైగా నీరు వృథాగా పోతున్నాయి. ఇటీవల కాలంలో 0.5 కి.మీ వద్ద కేసీ కాలువకు గండిపడిన విషయం విదితమే. ప్రధాన కాలువలకు తరచూ గండ్లు పడటానికి పనుల్లో నాణ్యతకు తిలోదకాలివ్వటమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆయ‘కట్’.. జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, ఎల్లెల్సీలను నిర్మించారు. ఎల్లెల్సీ మినహా మిగిలిన రెండు కాలువల ద్వారా వచ్చే నీటి ఆధారంగా 3.55 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తుంటారు. అయితే కొంత కాలంగా కాలువలకు విడుదలచేసే నీరు చివరి ఆయకట్టుకు అందటం లేదు. నాసిరకం నిర్మాణాలతో కట్టకున్న రాళ్లు, మట్టి కాలువల్లో చేరుతోంది.
కర్నూలు- కడప కాలువను రూ.1,170 కోట్లతో ఆధునికీకరించారు. కర్నూలు నుంచి వైఎస్సార్ కడప జిల్లా వరకు 0 నుంచి 325 కి.మీ వరకు ఈ కాలువ విస్తరించింది. గండ్లు పడతాయనే ఉద్దేశంతో 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా.. 2,500 క్యూసెక్కులకే పరిమితం చేశారు. దీంతో కేసీ కెనాల్ కింద ఏటా ఆయకట్టు తగ్గిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టర్లకు వరంగా కాలువ పనులు
Published Thu, Aug 28 2014 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement