కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా లేదు. ఇప్పటి వరకు ఎక్కడా పదునైన వాన కురవలేదు. అడపాదడపా కురిసినా.. విపరీతమైన ఎండలకు భూమి ఆరిపోతోంది. ఇప్పటికే సాగు చేసిన పంటల పరిస్థితి దయనీయంగా తయారైంది. చాలా చోట్ల పైర్లు నిలువునా ఎండిపోతున్నాయి. దీంతో భవిష్యత్‌లో పశుగ్రాస సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
పాడి నమ్ముకున్న రైతులు ఉన్న కొద్దిపాటి పొలంలో పశుగ్రాసాలను సాగు చేస్తే ప్రయోజనం పొందవచ్చని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్(పశుగ్రాసం సీడ్) డాక్టర్ శివకుమార్( 8897103123) తెలిపారు. పశుపోషణలో దాదాపు 60 నుంచి 70 శాతం ఖర్చు మేతపైనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తగినంత మేత ఇచ్చినప్పుడే ఆశించిన పాల ఉత్పత్తి లభిస్తుందన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేస్తోందని, కరువు ప్రాంతాలైన ఆదోని, కర్నూలు డివిజన్‌లకు వీటిని అధికంగా కేటాయించామన్నారు.
అందుబాటులో ఉన్న పశుగ్రాసం విత్తనాలు...
జిల్లాలో ప్రస్తుతం ఎస్‌ఎస్‌జీ ప్రియ 5000 రకం పశుగ్రాసం విత్తనాలు పది టన్నులు అన్ని పశువైద్యశాలల్లో సిద్ధంగా ఉన్నాయి. వీటిని 75 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నాయి. 5 కిలోల కిట్ ధర రూ.180 ఉండగా రైతులు రూ.45 చెల్లించాల్సి ఉంది.
ఎస్‌ఎస్‌జి జొన్న హైబ్రిడ్క్రం 20 టన్నులు, మొక్కజొన్న పది టన్నులు జిల్లాలోని పశువైద్య శాలలకు ఒకటి, రెండు రోజుల్లో చేరనుంది. ఎస్‌ఎస్‌జి జొన్న హైబ్రిడ్ రకం 5 కిలోల కిట్ ధర రూ.180 ఉండగా రైతులు రూ.45 చెల్లించాల్సి ఉంది. మొక్కజొన్న 5 కిలో కిట్ ధర రూ.207.50 ఉండగా రైతులు రూ.52 చెల్లించాల్సి ఉంది.
ఈ సారి న్యూట్రిఫీడ్ అనే పశుగ్రాసం విత్తనాలను 75 శాతం సబ్సిడీపై కొత్తగా పంపిణీ చేయనున్నారు. ఇవి కిలో ధర రూ.578.18 ఉండగా, ఇందులో 75 శాతం సబ్సిడీ ఇస్తారు. జిల్లాలకు 200 కిలోలు మాత్రమే తెప్పిస్తున్నారు. ఇవి 66 ఎకరాలకు సరిపోతాయి. ధర ఎక్కువ ఉండటంతో ఎకరాకు 3 కిలోలు మాత్రమే వేసుకోవాలి. ఇందులో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విత్తనాలు నాలుగైదు రోజుల్లో జిల్లాకు రానున్నాయి.
హైబ్రిడ్ జొన్న..
వర్షాధారం కింద జూన్ నుంచి ఆగస్టు నెల చివరి వరకు.. నీటి ఆధారం కింద అయితే ఎప్పుడైనా విత్తుకోవచ్చు. హెక్టారుకు 30 నుంచి 40 కిలోల విత్తనాలు సరిపోతాయి. సాళ్లలో, సాళ్ల మధ్య 4-5 అంగుళాలు అంతరం ఉండాలి. హెక్టారుకు 80 కిలో నత్రజని, 30 కిలోల పొటాష్ అవసరమవుతాయి. 10-15 రోజులకోసారి నీటి తడులు పెట్టాలి. మొదటి కోత 50-55 రోజుకు 50 శాతం పూత దశలో కోయాలి. ప్రతి 35-40 రోజులకు ఒక కోత చొప్పన మూడు కోతలు కోయాలి. హెక్టారుకు 70-80 టన్నుల దిగుబడి వస్తుంది.
మొక్కజొన్న(అఫికాన్ టూర్ రకం)
వర్షాధారం కింద జూన్ నుంచి ఆగస్టు నెల చివరి వరకు.. నీటి పారుదల కింద జనవరి నుంచి మే నెల వరకు విత్తుకోవచ్చు. హెక్టారుకు 40 నుంచి 50 కిలోలు వేసుకోవాలి. సాళ్లలో, సాళ్ల మధ్య 10 అంగుళాల అంతరం ఉండాలి. హెక్టారుకు 120 కిలోల నత్రజని, 120 కిలో పొటాష్ అవసరమవుతాయి. 7 నుంచి పది రోజులకోసారి నీటి తడులు ఇవ్వాలి. 60 నుంచి 70 రోజులకు కంకి సమయంలో మొదటి కోత కోయాలి. హెక్టారుకు 50 నుంచి 60 టన్నుల దిగుబడి వస్తుంది.
న్యూట్రిఫీడ్
కొత్తగా వస్తున్న ఈ పశుగ్రాసం విత్తనాలు అన్ని రకాల నేలలకు ముఖ్యంగా మెట్ట సేద్యానికి అనుకూలమైనవి. ఇది నీటి ఎద్దడిని తట్టుకొని పచ్చిమేతకు ఉపయోగపడే పంట. న్యూట్రిఫీడ్ పలు దఫాలుగా కోత కోసేందుకు అనువైన పచ్చి గడ్డి రకం. అధిక శక్తినిచ్చే పశుగ్రాసం. త్వరగా మేపుటకు అనుకూలమైంది. అధిక పాల దిగుబడికి ఎంతో దోహద పడుతుంది.
పశుగ్రాసం సాగు ప్రయోజనకరం
Published Tue, Aug 19 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement
Advertisement