అదుగో..ఇదుగో అంటూ ఊరిస్తున్న రుణమాఫీ ఇప్పట్లో అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా అన్నదాతలు తమకున్న అవకాశాలను క్రమంగా కోల్పోతున్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): అదుగో..ఇదుగో అంటూ ఊరిస్తున్న రుణమాఫీ ఇప్పట్లో అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా అన్నదాతలు తమకున్న అవకాశాలను క్రమంగా కోల్పోతున్నారు. పంటలు దెబ్బతిన్న సమయంలో ఆర్థికంగా ఆదుకునే బీమాకు దూరమవుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 13 పంటలకు ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పించింది. వేరుశనగకు వాతావరణ బీమా ఉండగా.. వరి పంటకు గ్రామం యూనిట్‌గా అవకాశం కల్పించారు. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకోని రైతులు ఈ నెల చివరిలో నిర్ణయించిన మేర ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంది.
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి. పంట రుణాలు ఎవరూ చెల్లించవద్దని.. అధికారంలోకి వస్తే మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కేంద్రం, ఆర్‌బీఐ సహకరించడం లేదంటూ తాజాగా రీ షెడ్యూల్ రాగం ఎత్తుకున్నారు. రికవరీ లేకపోవడంతో ఇంత వరకు బ్యాంకులు రుణాల పంపిణీ చేయలేదు.
2014 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఒక్క రైతుకు కూడా పంట రుణాలు అందలేదు. దీంతో వాతావరణ, పంటల బీమాను పొందలేని పరిస్థితి ఏర్పడింది. పంట రుణాలు తీసుకునే రైతులకు బ్యాంకులే ప్రీమియాన్ని చెల్లిస్తాయి. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వ వైఖరి కారణంగా జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు పంటల బీమాకు దూరం అవుతున్నారు. వీరందరూ నాన్ లోనింగ్ ఫార్మర్స్ కింద బీమా చేసుకోవచ్చు. వీరికి ఈ నెల చివరి వరకు మాత్రమే అవకాశం ఉంది. వ్యవధి తక్కువగా ఉన్న దీనిపై రైతులకు అవగాహన కల్పించే దిక్కు లేకుండా పోయింది.
వేరుశనగకు వాతావరణ బీమా..
వేరుశనగ పంటకు వాతావరణ ఆధారిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఎకరాకు రూ.550 ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంది. నిర్ణీత సమయాల్లో అధిక వర్షపాతం, అత్యల్ప వర్షపాతం, తెగుళ్లు తదితర వాటిని పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లిస్తారు. ఎకరాకు రూ.11 వేలకు వాతావరణ బీమా చేయనున్నారు.